
పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషీ
సందర్భం
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్‌గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.
సరిహద్దును దాటి...
పాకిస్తాన్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్‌పూర్‌లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది.
పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్‌కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్‌లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్‌ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.
1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.
నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.
ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.
వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్
భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.
భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్‌ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.
సంజీవ్ శంకరన్
వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్