
పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషీ
సందర్భం
పహల్‌గామ్ ఉగ్రదాడికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకుంది. కుటుంబాల విచ్ఛిన్నమే లక్ష్యంగా పురుషులను మాత్రం ఎన్నుకుని... వారి మతం అడిగి మరీ భార్యల ఎదుటే భర్తలను ఉగ్రవాదులు చంపిన వైనం దేశాద్యంతం ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక హింసాత్మక ఘటన కాదు. మానసిక యుద్ధ తంత్రం. ఈ విషయంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. కచ్చితమైన, వ్యూహాత్మకమైన, సమన్వయ యుతమైన మిలిటరీ ప్రతిచర్యకు దిగింది.
నిఘా వర్గాల అంచనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ ‘ఆప రేషన్ సిందూర్’ను నిర్వహించారు. పహల్‌గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదు లకు, పాకిస్తాన్‌లోని వారి గురువులను రూఢి చేసుకునేంతవరకూ అత్యంత ఓరిమితో వ్యవహరించారు. మిలటరీ భాషలో ఈ ఓరిమిని క్రమశిక్షణ అనాలి. మరోవైపు పాకిస్తాన్ యథావిధిగా పహల్‌గామ్ దాడి తరువాత సరిహద్దుల్లో తన పదాతి దళాలను పెంచుకుని భారత మిలిటరీ ప్రతిచర్య కోసం ఎదురు చూసింది. అయితే భారత్ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్న విషయం పాక్‌కు తెలియలేదు.
బయటకు కనిపించని అసలు వ్యూహం
ఏదో జరగబోతోందన్న సంకేతాలు రెండు వారాలుగా కనిపిస్తున్నా కచ్చితంగా ఏమిటన్నది చివరి క్షణం వరకూ బయటపడలేదు. ప్రధాని కేబినెట్ సమావేశాలు, ప్రతిపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. భద్రతాదళ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మంత్రి అందరూ చర్చల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కూ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపారు. బయటకు కనిపించిన ఈ వ్యూహం వెనుక అసలైన ప్రతీకార చర్య చోటు చేసుకుంది. అణుబాంబుల బెదిరింపులతో మన ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జరిగిన విఫల యత్నాన్ని కూడా భారత్ అధిగమించింది.
భారత రక్షణ దళాలు నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసీ) ఆవల తొమ్మిది కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఇది భారత సత్తాను, కృత నిశ్చయాన్ని చాటే ప్రణాళికా బద్ధమైన ప్రతిదాడి. యుద్ధాల్లో ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యం ఉంటుంది. మానసిక యుద్ధాల్లో మరీ ఎక్కువ. అందుకే అనూహ్యంగా ఇద్దరు మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సిందూర్ గురించిన అధికారిక ప్రక టన వెలువరించారు.
విదేశీ వ్యవహారాల శాఖ కార్య దర్శితో ఇద్దరు మహిళ సైనికాధికారులు పాల్గొనడం పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ బలమైన సంకేతం పంపినట్లు అయ్యింది. భారత్‌కు తన గౌర వాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు అన్న సందే శాన్ని స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ వీటికి అంతే స్థాయిలో ప్రత్యుత్తరమూ ఇస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో భారత పౌరులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి మాత్రం వాస్తవం: నిష్క్రియతో శాంతిని పొందలేమ న్నది అందరూ గుర్తించాలి.
మునీర్‌పై విమర్శలు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్‌పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పాకిస్తాన్ భద్రతాంశాల విశ్లేషకురాలు అయేషా సిద్దిఖా ఆయన్ని ‘ఆలోచన లేని జనరల్’గా అభివర్ణించారు. మతానికి మాత్రమే కట్టుబడిన జనరల్‌కు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. జనరల్ జియా–ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్‌ల మాదిరిగా తానూ ఏదో పేరు సంపాదించాలన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. జియా, ముషారఫ్ ఇద్దరూ విభ జనకు ముందు భారత్‌లో పుట్టిన వారే. వాళ్లు సిద్ధాంతానికి వ్యూహాన్ని జోడించగల సమర్థులు. మునీర్ మతాన్ని, మాటలనే నమ్ముకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్నది రెండు సరిహద్దుల మధ్య యుద్ధం కాదు. సైద్ధాంతికమైనది. త్యాగమంటే ఏమిటో చెప్పేది. నష్టానికి దేశాలు న్యాయం పొందడం ఎలాగో చెప్పేది. ఆపరేషన్ సిందూర్ అన్న పేరు కేవలం ప్రతీకాత్మకమైంది మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఉన్న ప్రాశస్త్యం తెలియంది కాదు. పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు కుటుంబంలోని భర్తలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అందుకే మహిళల నుదుటి బొట్టును కాపాడేందుకే ఈ దాడులు చేసిందన్న సంకేతాన్ని భారత్ పంపింది. బెదిరింపులు, బుల్లెట్లు భారత సంకల్పాన్ని దెబ్బతీయలేవని, అణ్వాయుధాల పేరుచెప్పినా ఇక వదిలేది లేదన్నది ఆపరేషన్ సిందూర్ ఇచ్చే స్పష్టమైన సందేశం.
మరి ఈ దాడులకు పాక్ స్పందించకుండా ఉంటుందా? కచ్చితంగా స్పందిస్తుంది. కాకపోతే ఎప్పుడు, ఎలా అన్నది వేచి చూడాలి. ఇందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్ధంగానే ఉన్నాయి. పాక్ కవ్వింపులకు దిగితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇండియా స్పష్టమైన సంకే తాలిచ్చింది. అంతేకాదు... ఇదేదో పరిస్థితిని మరింత జటిలం చేసుకునేందుకు మాత్రం కాదనీ, పొరుగు దేశం తన హద్దుల్లో తానుండటం మేలన్న సంకేతాన్ని ఇచ్చేందుకేననీ స్పష్టం చేసింది. హద్దు మీరితే అంతే గట్టి సమాధానం దొరుకుతుందన్న హెచ్చరిక కూడా అందులో ఉంది.
మనోజ్ కె. చన్నన్
వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్)