ములాయం ప్రాభవం కొనసాగేనా? | Ratan Mani Lal Vishleshana After Mulayam, SP Uttar Pradesh Politics | Sakshi
Sakshi News home page

ములాయం ప్రాభవం కొనసాగేనా?

Published Fri, Oct 14 2022 12:45 AM | Last Updated on Fri, Oct 14 2022 12:45 AM

Ratan Mani Lal Vishleshana After Mulayam, SP Uttar Pradesh Politics - Sakshi

యాదవుల పార్టీగా మొదలైన సమాజ్‌ వాదీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం సింగ్‌ యాదవ్‌ మార్చివేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్‌ వాదీ రంగం మీద ఉందంటే  దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలాలను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. ములాయం అనంతర సమాజ్‌ వాదీలో ఈ గుణాలు కొరవడుతున్నందున యాదవులు వేరే రాజకీయ వేదికలను వెతుక్కునే వీలు ఏర్పడుతోంది. అదే జరిగితే సమాజ్‌వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం ముగిసిపోతాయి.

భారతదేశంలో 1970ల అనంతరం సోషలిస్టు ఉద్యమానికి సంబంధించి అత్యంత సుపరిచితుడైన నేత ములాయం సింగ్‌ యాదవ్‌. ఆయన అస్తమ యంతో భారత రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసిపోయింది. ములాయం 1950లలో స్కూల్‌ టీచర్‌గా పని చేశారు. 1967లో తొలుత ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అది కాంగ్రెస్‌ పార్టీ తన అగ్రకుల (ప్రధానంగా బ్రాహ్మణుల) పునాదితో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలను శాసిస్తున్న కాలం. 1974లో జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమ ప్రధాన ప్రతిరూపంగా ములాయం ఆవిర్భవిం చారు. కాలం గడిచేకొద్దీ యాదవ కుల నేతగా, దాని పొడిగింపుగా వెనుకబడిన కులాల నేతగా ములాయం తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో, తక్కిన దేశంలో కూడా చాలా విషయా లకు ఆయన గుర్తుండిపోతారు. కానీ ఆయన ప్రధాన విజయం, యూపీ రాజకీయాల్లో యాదవ ఆధిపత్యాన్ని సంఘటిత పర్చడమే.

కాంగ్రెస్‌ పార్టీకి ఇది తెలిసి ఉండదని చెప్పలేము. ఎందుకంటే అత్యంత ఆధిపత్యం, దూకుడుతనం, రాజకీయ జాగరూకతతో కూడిన యాదవ కుల ప్రాధాన్యతను ఆ పార్టీ గుర్తించింది. అనేకమంది నాయకుల పూర్వ వైభవం దీనికి సాక్షీభూతంగా నిలుస్తుంది. వీరిలో మొదటివారు చంద్రజిత్‌ యాదవ్‌. ఈయన 1967లో, 1971లో లోక్‌సభలో అజాంగఢ్‌ ఎంపీగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ తన ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించిన మరొక యాదవ నేత బలరాం సింగ్‌ యాదవ్‌. ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ సభ్యుడిగా, కేంద్ర ఉక్కు, గనుల శాఖా మంత్రిగా చాలాకాలం ఈయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాంగ్రెస్‌తో 38 సంవత్సరాల అనుబంధం తెగదెంపులు చేసుకుని 1997లో పార్టీని వదిలిపెట్టేశారు. ములాయంకు అపరిమితా నందం కలిగిస్తూ సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు.

1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చెందాక యూపీలో యాదవ సామాజిక వర్గం బలం మరింత పెరిగింది. దీనితో కొత్తగా ఏర్పడిన జనతా పార్టీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రామ్‌ నరేశ్‌ యాదవ్‌ను ఎంపిక చేసుకోవలసి వచ్చింది. అయితే ఈయన రాజకీయంగా దుర్బలుడు కావడంతో ములాయం ప్రభ ముందు వీగిపోయారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో యాదవ కుటుంబాలను ఏకం చేయడంలో ములాయం అవిశ్రాంతంగా కృషి చేశారు. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని యాదవుల మధ్య పెద్దగా సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి కావు. ఈ రెండు ప్రాంతాల్లో గ్రూపులుగా విడిపోయి ఉండటం కంటే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు బలం పెంచుకోవలసిన అవసరం ఉందని నచ్చజెప్పడంలో కూడా ములాయం విజయం సాధించారు.

ములాయంపై ప్రజా విశ్వాసం ఎంతగా పెరిగిందంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పదిసార్లు గెలుపొందుతూ వచ్చారు. అలాగే ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఈ కాలం పొడవునా, ఆయన తన సమీప, దూరపు కుటుంబ సభ్యులను తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి చేరేలా సిద్ధం చేస్తూ వచ్చారు. ఒక సమయంలో ఇలా రాజకీయాల్లో చేరిన ఆయన బంధువుల సంఖ్య మూడు డజన్లకు మించి ఉండేదని చెప్పుకొనేవారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లోనూ, తన ఓటు పునాదిని బలోపేతం చేసుకోవడంలోనూ ములాయం అంకిత భావానికి ఇది కొలమానంగా చెప్పవచ్చు. అదే సమయంలో బిహార్‌లో జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్, రామ్‌ విలాస్‌ పాశ్వాన్, కర్పూరీ ఠాకూర్, నితీశ్‌ కుమార్‌ వంటి పలువురు నేతలు పుట్టుకురాగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ములాయం ఏకైక నేతగా ఆవిర్భవించారు. జనతా, జనతాదళ్, లోక్‌ దళ్‌ ఎక్కడున్నా సరే... యాదవ నేతలు ఆయన వెన్నంటే నిలిచేవారు.

పొత్తులు పెట్టుకోవడంలో, వాటిని విచ్ఛిన్నపర్చడంలో ములాయం సత్తాను ఇతర నేతలందరూ ఆమోదించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ వంటి అన్నిపార్టీలలో తనకు ప్రయోజనం కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ములాయం ఈ శక్తిని ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే ములాయం మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో బీజేపీతో పొత్తు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చడం ములాయం రాజకీయ దురంధరత్వానికి మచ్చుతునక. తర్వాత 1991 నుంచి రామాలయ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బీఎస్పీతో పొత్తుతో 1993లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతితో దశాబ్దాలపాటు వ్యక్తిగత స్థాయిలో బద్ధ శత్రుత్వం కొనసాగింది. తర్వాత కాంగ్రెస్‌ మద్దతుతో 2003లో ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ వెనువెంటనే విదేశీ మూలాలున్న వ్యక్తి ప్రధాని కాకూడదనే దృక్ప థంతో సోనియాగాంధీ అభ్యర్థిత్వాన్నే అడ్డుకున్నారు. రాజకీయంగా ములాయం వేసిన కుప్పిగంతులను మల్లయుద్ధ విన్యాసాలుగా పేర్కొనేవారు. ఈ కుప్పిగంతులు యూపీ రాజకీయాల్లో కీలకమైన రాజకీయశక్తిగా నిలబెట్టడంలో ములాయంకు ఎల్లవేళలా తోడ్పడ్డాయి.

ముస్లిం–యాదవ సమ్మేళనంతో ఎన్నికల్లో గెలుపొందడంపై ఆరోపణలను ఎదుర్కొన్నారు. కానీ మైనారిటీలను బుజ్జగిస్తున్నారని వచ్చిన ఆరోపణలు ములాయంకు ఎన్నడూ హాని చేకూర్చలేదు. 1990లలో యూపీలో పోలీసు, పురపాలన యంత్రాంగంలో యాదవుల ఆధిపత్యాన్ని పెంచి పోషించారని వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయంగా దెబ్బతీయలేక పోయాయి. ఈ అన్ని ఆరోపణలూ వాస్తవానికి ములాయం స్థాయిని అజేయశక్తిగా పెంచాయి. దీనివల్ల ఆయన ప్రాభవం ఉత్తరప్రదేశ్‌ను దాటి ఆయన పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించే వరకు తీసుకుపోయింది.

అయితే, 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌కు కట్టబెట్టాలని ములాయం తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ నిర్ణయాలపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసింది. పార్టీలోని శక్తి కేంద్రాల మధ్య కీలుబొమ్మలా ఉంటున్నారని వ్యాపించిన పుకార్ల మధ్యనే 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్‌ యూపీని పాలించారు. దీనివల్ల అటు పార్టీలోనూ, ఇటు కుటుంబంలోనూ పతనం మొదలైంది. ఈ నేప థ్యంలో ములాయం యూపీ వ్యవహారాల నుంచి మరింతగా దూరం జరిగారు. అదే సమయంలో అఖిలేశ్‌ ప్రాభవం పెరిగింది. అప్పటి నుంచి ములాయం తన మునుపటి వ్యక్తిత్వానికి కేవలం ఒక ఛాయలా కొనసాగుతూ వచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో, ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలగడం ద్వారా ములాయం తన రాజకీయ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్‌ వాదీ మాత్రమే రంగం మీద నిలబడగలిగిందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలా లను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. కేవలం యాదవుల పార్టీగా మొదలైన సమాజ్‌వాదీ పార్టీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం మార్చి వేశారు. ములాయం అనంతర సమాజ్‌ వాదీ పార్టీలో ఈ గుణాలు కొరవడుతున్నందున, యాదవులు తమ రాజకీయ పలుకుబడిని మరెక్కడైనా చూపించుకునే వీలుంది. అదే జరిగిన పక్షంలో సమాజ్‌ వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం కచ్చితంగానే ముగిసి పోతాయి.


రతన్‌ మణి లాల్‌
వ్యాసకర్త కాలమిస్టు, టీవీ కామెంటేటర్‌
(‘ద డైలీ గార్డియన్‌’ సౌజన్యంతో)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement