అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!

Mallepally Laxmaiah Guest Column Over Ambedkar Ideology - Sakshi

కొత్త కోణం

‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్‌ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్‌ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్‌ బర్క్‌ మాటలను అంబేడ్కర్‌ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్‌ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్‌ చేసిన నిరసన గర్జన అది. 

షెడ్యూల్డ్‌ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్‌ ఇండియా షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య, వర్కింగ్‌ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్‌ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్‌ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్‌ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్‌ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్‌ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్‌ ఓటింగ్‌ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్‌ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. 

బాబాసాహెబ్‌ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను  పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్‌ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 

1955లో షెడ్యూల్డ్‌ కులాల ఫెడరేషన్‌ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్‌ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్‌ భాయి పటేల్‌ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్‌ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్‌ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్‌ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్‌ డిమాండ్‌ చేసిన ప్రత్యేక ఓటింగ్‌ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్‌ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్‌ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్‌ పటేల్‌ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్‌ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు.

అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్‌ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్‌ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్‌కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్‌ అండ్‌ మైనారి టీస్‌’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్‌ ఎన్నికల సభల్లో అంబేడ్కర్‌ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్‌ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్‌ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్‌ కులాల ఫెడరేషన్‌ తీర్మానం. 

ఆ తర్వాత క్యుములేటివ్‌ ఓటింగ్‌ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్‌కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్‌ మైనారిటీస్‌’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. 

రిజర్వేషన్‌ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్‌ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్‌ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.


మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top