రాయని డైరీ : కపిల్‌ సిబల్‌ (కాంగ్రెస్‌)

Madhav Singaraju Rayani Dairy About Kapil Sibal - Sakshi

‘‘ఉన్నారా?’’ అని ఫోన్‌ చేశారు చిదంబరం! ‘‘ఉన్నాను చెప్పండి చిదంబరం జీ’’ అన్నాను. 
‘‘మీరూ నేను ఎక్కడికి పోతాం చెప్పండి సిబల్‌ జీ. ‘ఉన్నారా’ అని నేను అడిగింది ‘మీరు ఉన్నారా’ అని కాదు. ‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా’ అని’’ అన్నారు చిదంబరం.
నాకూ ఆ సందేహం వచ్చింది. నాకు ఫోన్‌ చేసి నన్నే ‘ఉన్నారా’ అని చిదంబరం ఎందుకు అడుగుతారు.. ఎంత నాకన్నా మూడేళ్లు పెద్దవారైతే మాత్రం! ఆ మాటే చిదంబరంతో అన్నాను. పెద్దగా నవ్వారు. 
కాంగ్రెస్‌లో వయసుడిగేవారు, వయసడిగేవారు ఉండరు. 

‘‘సో, ఎవరూ లేరు మీ పక్కన. ఉంటే మీరు మీ వయసు గురించి కానీ, నా వయసు గురించీ కానీ ఆలోచించేవారు కాదు కదా..’’ అని మళ్లీ నవ్వారు. నవ్వి, ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు. ఒక్క క్షణం ఆగాను. నేనున్నది ఢిల్లీలో. ఢిల్లీలో ఉన్నాను అని చెబితే.. ఢిల్లీలో కాంగ్రెస్‌ లేదని తెలిసీ ‘విషయాలేంటి?’ అని అడుగుతారు. కొన్నిసార్లు నేను జలంధర్‌లో కూడా ఉంటాను. జలంధర్‌లో ఉన్నానని చెబితే పంజాబ్‌లో ఉన్నది కాంగ్రెస్సే కనుక ‘విషయాలేంటి?’ అని అడగరు. ఓసారి ఇలాగే జలంధర్‌లో ఉన్నానని చెబితే టప్‌మని ఫోన్‌ పెట్టేశారు. ‘ ఫోన్‌ పెట్టేశారేమిటి?’ అని వెంటనే ఫోన్‌ చేసి అడిగాను. ‘ఢిల్లీలో ఉన్నారేమో విషయాలేంటి అని అడుగుదామనుకున్నాను. జలంధర్‌లో ఉన్నానన్నారు కనుక విషయాలేముంటాయ్‌ లెమ్మని పెట్టేశాను’ అన్నారు. అది గుర్తొచ్చి, జలంధర్‌లో ఉన్నాను అని అబద్ధం చెప్పాను. విషయాలు అడగరని. 
‘‘జలంధర్‌లో ఉన్నారా.. ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు?’’ అన్నారు. 

‘‘ఎందుకు చిదంబరం జీ?’’ అని అడిగాను. 
‘‘ఏం లేదు, మీరు ఢిల్లీ వెళ్లాక ‘విషయాలేంటి?’ అని అడుగుదామనీ..’’ అన్నారు! ఒక గంటలో ఢిల్లీలో ఉంటాను. నేనే మీకు ఫోన్‌ చేస్తాను’’ అన్నాను. 
గంట తర్వాత ఆయనే చేశారు! ‘‘ఉన్నారా?’’ అని అడిగారు! ‘చేరుకున్నారా?’ అని అడగాలి. ‘ఉన్నారా?’ అని అడిగారు! తెలిసిపోయిందా నేను ఢిల్లీలోనే ఉన్నట్లు?! 
‘‘చిదంబరం జీ, ‘ఢిల్లీ చేరుకున్నారా?’ అని కదా మీరు నన్ను అడగవలసింది, ‘ఉన్నారా?’ అని అడిగారేమిటి?’’ అని అడిగాను,
‘‘చేరుకుని ఉంటారని ఊహించి.. ‘ఉన్నారా?’ అని అడిగాను’’ అన్నారు! ‘ఉన్నాను..’ అని మళ్లీ నన్ను చెప్పనివ్వకుండా.. ‘‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. 
‘‘లేరు చిదంబరం జీ, నా పక్కనెవరూ లేరు చెప్పండి’’ అన్నాను. 

‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు!!
‘‘ఢిల్లీలోనే చిదంబరం జీ.. మీకెందుకు డౌటొచ్చిందీ’’ అన్నాను. 
‘‘ఎక్కడున్నారు అని అడిగింది మిమ్మల్ని కాదు సిబల్‌ జీ, మీ పక్కన లేనివారు ఇప్పుడెక్కడున్నారూ అని..’’ అన్నారు! 
చిదంబరం అడుగుతున్నది సోనియాజీ గురించని నాకు అర్థమైంది.
‘‘మీరెక్కడున్నారు చిదంబరం జీ’’ అని అడిగాను. నా పక్కన లేని వారు ఆయన పక్కన ఉండి, వారిపై నా మనోభావాలను  తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని సందేహం వచ్చి అలా అడిగాను. 
చిదంబరం పెద్దగా నవ్వారు. 

‘‘సిబల్‌ జీ, మీ ధైర్యాన్ని చూస్తుంటే కాంగ్రెస్‌ ఇంకో నూటా ముప్పై నాలుగేళ్లు అక్బర్‌ రోడ్డులోనే పటిష్టంగా ఉంటుందనిపిస్తోంది. గోవాలో రెస్ట్‌ తీసుకుంటున్న సోనియాజీ కనుక చెన్నైలో కూడా కొన్నాళ్లు ఉండేందుకు వస్తారేమో ముందే తెలిస్తే, నేను ఢిల్లీ వద్దామని మీకు ఫోన్‌ చేశాను. అంతే.’’ అన్నారు.
ధైర్యంలో ఆయన నాకంటే ఏం తక్కువో నాకు అర్థం కాలేదు!!
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top