Nandamuri Balakrishna: ఎప్పటికీ వెంటాడే వెన్నుపోటు!

Kommineni Srinivasa Rao guest column on chandrababu naidu - Sakshi

నేటి వర్తమానం రేపటి గతం అవుతుంది. ఆ గతం భవిష్యత్తును శాసిస్తుంది. కాలం అందరినీ ఓ కంట కనిపెడుతుంది. అందుకే ఎల్లవేళలా మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి. తెలుగు రాజకీయ చరిత్రలో మాయని మచ్చ... తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు ఘట్టం. చంద్రబాబునాయుడు కుట్రలోనో, వ్యూహంలోనో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు భాగమయ్యారన్నది చరిత్ర. అది చెరిపితే చెరిగేది కాదు. కానీ దాన్ని దులుపుకోవడానికి స్వయానా ఎన్టీఆర్‌ కుమారుడు, నటుడు బాలకృష్ణ విఫలయత్నం చేశారు. తాము తండ్రికి వెన్నుపోటు పొడిచామని అంటున్నారని బాధపడ్డారు. కానీ ఎన్టీఆరే అన్నట్టు– క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకూ చంద్రబాబుతో పాటు ఆయనా ఆ నింద మోయక తప్పదు.

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం వేదన, రోదన పర్వంలో ఉన్నట్లున్నారు. ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏదో అంశంపై కంటతడి పెట్టా రంటూ వార్తలొచ్చాయి. గత నవంబర్‌లోనూ తన భార్యను అవమా నించారని ఆరోపిస్తూ గుక్కపెట్టి రోదించడం ఆశ్చర్యపరచింది. తాజాగా నటుడు, హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ కూడా కంటతడి పెట్టడం విస్మయపరచింది. తాము ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని అంటున్నారని ఆయన బాధపడ్డారు.
ఎన్టీఆర్‌ మరణానంతరం చంద్రబాబు వ్యూహాత్మకంగా బాల కృష్ణతో వియ్యం అందారని కొందరు నమ్ముతారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవలేదన్న అర్థం వచ్చేలా బాలకృష్ణ మాట్లాడారు. చంద్ర బాబును ఉద్దేశించి ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. చంద్రబాబు ఆత్మను అమ్ము కున్నాడనీ, తండ్రి లాంటి తనకు ద్రోహం చేశాడనీ ఆయన వాపోయారు. బహుశా బాలకృష్ణ ఆ వీడియో చూడలేదనుకోవాలి. చూసినా, అదేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారనుకోవాలి. 

1994 ఎన్నికలలో 250 సీట్లను సాధించిన ఎన్టీఆర్‌ను దించ డంలో ఉద్దేశం పార్టీని కాపాడుకోవడం అని బాలకృష్ణ అన్నారంటే, తండ్రిపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం అవుతుంది. నిజానికి రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణనే తన వారసుడిగా ఉండాలని ఎన్టీఆర్‌ కాంక్షించారు. భార్య బసవతారకం కన్నుమూయడంతో ఎన్టీఆర్‌ వేదనకు గురి అయ్యారు. దానికి తోడు 1989 ఎన్నికలలో అధికారం కోల్పోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. దాంతో జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి సేవలకు పొంగిపోయి, ఆమెను రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు ఆ ప్రతిపాదనను విరమింప చేయడానికి యత్నించారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైగా మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా బహిరంగ సభలో లక్ష్మీపార్వతిని వేదికపైకి రప్పించి తాను పెళ్లాడబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన ఇంటికి వస్తే సొంత కుటుంబ సభ్యులెవరూ పలకరించలేదు. ఆ తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒక ప్రకటన చేసి ఈ రెండో వివాహాన్ని సమర్థించారు. 

1994 ఎన్నికలలోపు లక్ష్మీపార్వతిని కూడా ఆయన జనంలో తిప్పారు. ఈ జంటను చూడటానికి జనం విశేష సంఖ్యలో ఎగబడే వారంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలో తన వర్గానికి ఎక్కువ టిక్కె ట్లను ఇప్పించుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా తన సాయం కూడా తీసుకున్నారని లక్ష్మీపార్వతి చెబుతుంటారు. టీడీపీ మళ్లీ అధి కారంలోకి వచ్చింది. అక్కడి నుంచి చంద్రబాబు, లక్ష్మీపార్వతి వర్గాల మధ్య రాజకీయం మొద లైంది. లక్ష్మీపార్వతిని తదు పరి వారసురాలిగా ప్రక టిస్తే తమ రాజకీయ భవి ష్యత్తు దెబ్బ తింటుందని చంద్ర బాబు వర్గం భావించింది. అదే సమయంలో లక్ష్మీపార్వతి వర్గానికి చెందిన నేత ఒకరు ఆమె ఉప ముఖ్య మంత్రి కావాలని అంటూ మాట్లాడారు. అది మరింత ఆజ్యం పోసింది.

ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్‌ ప్రజల వద్దకు ప్రభుత్వం కార్య క్రమం నిర్వహిస్తున్న తరుణంలో విశాఖలో డాల్ఫిన్‌లో కొందరితో చంద్రబాబు సమావేశం  అయ్యారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు టూర్‌ అర్ధంతరంగా ముగించుకుని హైదరా బాద్‌ వచ్చేశారు. ఆ పిమ్మట పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను కలవడం, అందరూ వైస్రాయి హోటల్‌లో బస చేయడం, ఒకట్రెండు రోజుల్లో వేగంగా జరిగిపోయింది. తమకు ఎన్టీఆర్‌ను దించుతున్నామన్న సంగతే తెలియదని కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్‌ కొంత ఆలస్యంగా మేలు కుని చంద్రబాబు, దేవేందర్‌ గౌడ్, అశోక్‌ గజపతిరాజు, విద్యాధర రావులను మంత్రి పదవుల నుంచి తొలగించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు కూడా ప్రకటించారు. కానీ అప్పటికే డిల్లీలో ఆనాటి పీవీ ప్రభుత్వాన్ని చంద్రబాబు వర్గం మేనేజ్‌ చేసుకుని, ఎన్టీఆర్‌ శాసనసభను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆనాటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ అమలు చేయకుండా అడ్డుకోగలిగారు. కానీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారిని ముఖ్యమంత్రిగా నియమించ వచ్చా అన్న ప్రశ్నకు ఈనాటికీ సమాధానం దొరకలేదు.

ఎన్టీఆర్‌ వైస్రాయి హోటల్‌ వద్దకు వెళ్లినప్పుడు గేట్లు మూసేసి చంద్రబాబు వర్గం చెప్పులు విసిరింది. అవి ఆయన మీద పడకుండా పరిటాల రవి, దేవినేని నెహ్రూ వంటివారు యత్నించారు. టీడీపీ తమదేనని, ఎన్టీఆర్‌నే పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినట్లు చంద్రబాబు వర్గం తీర్మానాలు చేసింది. చివరికి కోర్టు ద్వారా టీడీపీ ఖాతాలో ఉన్న సుమారు 75 లక్షల రూపాయలను ఎన్టీఆర్‌కు దక్క కుండా చంద్రబాబు చేయగలిగారు. ఎన్టీఆర్‌ సొంతంగా మరో పార్టీ పెట్టుకోవడానికీ, ఎన్నికల గుర్తుగా సింహంను ఎంపిక చేసుకోవడానికీ కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఆయనతో లేరు. మరి దానిని తండ్రి పట్ల కుమారులు చూపించిన గౌరవం అని బాలకృష్ణ చెబుతారేమో. ఆ అవమానాలతో కుంగి పోయిన ఎన్టీఆర్‌ గుండెపోటుకు గురై మరణించారు. అయినా ఇదంతా వెన్నుపోటు కిందకు రాదని బాలకృష్ణ చెప్పదలిచారా?  
హరికృష్ణ నేరుగా ఎమ్మెల్యేలతో కలిసి వైస్రాయి హోటల్‌లో బస చేశారు. ఆ తర్వాత ఆయన ఆరు నెలల మంత్రిగానే మిగిలిపోయి భంగపడ్డారు. తదుపరి సొంతంగా అన్నా టీడీపీ అని పార్టీని పెట్టు కుని ప్రచారం చేశారు. కానీ వ్యూహ లోపం, చంద్రబాబు అధికారం ముందు నిలబడలేకపోయారు. 2009 ఎన్నికల సమయంలో హరి కృష్ణ కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సేవలను చంద్రబాబు వాడు కున్నారు. అనంతరం తన కుమారుడు లోకేశ్‌కు పోటీ అవుతాడని భావించి, అతనిని పక్కన బెట్టేశారు. ఇలా రాజకీయ వ్యూహాల నండి, మరొకటని అనండి... ఎప్పటికప్పుడు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను వాడుకోవడం, వదలివేయడం జరి గిందని చెబుతారు. అయినా ఆ కుటుంబంలో ఎక్కువ మందిని తనవైపే ఉంచుకోవడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. 

ఇవన్నీ చంద్రబాబు తెలివి తేటలని టీడీపీలో ఆయనను అభిమానించేవారు భావిం చవచ్చు. కానీ చంద్రబాబు ఎవరికైనా వెన్ను పోటు పొడవడానికి వెనుకాడరని ఆయన వ్యతి రేకులు భావిస్తుంటారు. అంతదాకా ఎందుకు, చంద్రబాబుతో ఎంతో సఖ్యతగా ఉండే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో ఒకసారి ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ వేదిక మీద తన వెనుక ఎవరూ ఉండవద్దని, వెనుక ఉన్నవారు ఎన్టీఆర్‌ను ఏంచేశారో చూశారు కదా అని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మిత్రుడు అయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుది అంతా వెన్నుపోటు చరిత్ర అని విమర్శించారు. ఎన్టీఆరే పరుష పదాలతో వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తన భార్యతో కలిసి ఎన్టీఆర్‌ ఇంటికి వెళితే, ఆయన తలుపులు వేసు కున్నారు. ఇన్ని పరిణామాల తర్వాత కూడా బాలకృష్ణకు తన తండ్రి పదవి పోయిందన్న బాధకన్నా, తన బావను వెన్నుపోటుదారుడు అంటున్నారనీ, ఆ వెన్నుపోటుకు తాము సహకరించామని అంటు న్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తే ఇప్పటికీ వారిలో ఆ రియలైజేషన్‌ రాలేదన్నమాట. వెన్నుపోటో, ఎదురుపోటో పొడిచి తండ్రిని   పదవి నుంచి దించేసిన వాస్తవమైనా బాలకృష్ణ అంగీకరిస్తారా? తండ్రి మరణించిన తర్వాత రాజకీయ అవసరాలకు ఆయన ఫొటో పెట్టు కుని తిరగడాన్ని ఏమంటారో కూడా బాలకృష్ణ తెలుసుకోవాలి. ఎన్టీఆర్‌ ఒక వీడియోలో అన్నట్లుగా చంద్రబాబు రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నంతకాలం ఆయన ఈ విమర్శలకు గురికాక తప్పదేమో!

కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top