
ప్రభుత్వాధినేతను జనం మనస్ఫూర్తిగా నమ్మితే ఎలా ఉంటుందో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సీఎం జగన్‌పై ప్రజల నమ్మకానికి నిలువెత్తు నమూనాగా నిలిచిన ఫలితాలివి. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదనీ, ఉన్న బలాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ కోల్పోయిందనీ స్పష్టమైంది. అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లలో గెలిచిన వైఎస్‌ఆర్‌సీపీపై మరింత బాధ్యత పడింది. గెలిచిన వార్డు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందించాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది.
అసాధారణ రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి అభినందనలు. నిజంగానే ఇది అత్యంత ప్రతిష్టాత్మక విజయం. గతంలో ఎన్నడూ ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి ఫలితాలు చూడలేదు. 73 మున్సిపాలిటీలు,11 మున్సిపల్ కార్పొరేషన్‌లు వైఎస్సార్‌సీపీ వశం అవడం కొత్త చరిత్ర. కేవలం రెండు మున్సిపాలిటీలు తాడిపత్రి, మైదుకూరులలో టీడీపీకే ఎక్కువ వార్డులు వచ్చినా, ఆ రెండు మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా టీడీపీకి దక్కుతాయన్న నమ్మకం లేదు. ఈ రకంగా వైఎస్సార్‌సీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం సాధించడం ఎలా సాధ్యమైంది? ఇది ఏ రకమైన సంకేతాలు ఇస్తోంది అన్నవి పరి శీలించాలి. ముందుగా ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఇరవై రెండు నెలలపాటు ప్రభుత్వాన్ని నడిపిన తీరు, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ముఖ్యంగా పేదవర్గాలపై విపరీతంగా పడిందని స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికలలో మాదిరి సామాజిక సమీకరణలలో ఎలాంటి మార్పు రాకుండా జగన్ కాపాడుకోగలిగారు. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ఆయన సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. ఆ వర్గాలవారు చెక్కుచెదరకుండా జగన్‌కు అండగా నిలిచారని అర్థం అవుతుంది. అలాగే ఇతరవర్గాలలో కూడా మెజార్టీ ప్రజలు జగన్ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు.
విశేషం ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో కాని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో గాని తన పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు ఒక్కసారి కూడా జగన్ విజ్ఞప్తి చేయలేదు. ప్రజలు తనను ఆదరిస్తారని ఆయన నమ్మారు. కచ్చితంగా అలాగే జరిగింది. మరోవైపు ప్రతిపక్షనేత వారం పాటు ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రచారం చేసినా, అనేక విమర్శలు చేసినా, చివరికి ప్రజలనే తిట్టి రెచ్చగొట్టినా ఫలితం దక్కలేదు. ఆయన రాజకీయ జీవితంలో ఇంతటి ఘోర పరాజయం చూడడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఎన్నడూ ఓడిపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో 23 సీట్లు మాత్రమే వస్తే, ఈసారి రెండు, మూడు మున్సిపాలిటీలలోనే ఓ మోస్తరు పోటీ ఇవ్వగలిగింది. జగన్ ప్రజలను విశ్వసిస్తే, చంద్రబాబు ఎన్నికల కమిషన్ వ్యవస్థను నమ్ముకుని బొక్కబోర్లాపడ్డారు. నిజానికి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంలో ఉండగా స్థానిక ఎన్నికలు జరగరాదని వైఎస్సార్‌సీపీ భావించింది. కానీ కోర్టులు అంగీకరించకపోవడంతో ఎన్నికలకు సిద్ధపడింది.
మరోవైపు ఎన్నికలకు సై అంటూ, ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ భయపడిపోతోందంటూ చంద్రబాబు కాలుదువ్వారు. కానీ తీరా ఎన్నికలు అయ్యేసరికి ఆయన చతికిలపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ముందుగా గమనించకపోలేదు. అందుకే తనకు ఆప్తుడని భావించిన ఎన్నికల కమిషనర్‌ను సైతం చంద్రబాబు విమర్శించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు. పంచాయతీ ఎన్నికలలో కాని, మున్సిపల్ ఎన్నికలలో ఎక్కడా గొడవలు జరగకుండా, రీపోలింగ్ అవకాశం లేకుండా జరగడం కూడా బహుశా ఒక రికార్డు కావచ్చు. స్వయంగా నిమ్మగడ్డే ఈ విషయం వెల్లడిస్తూ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని ప్రకటించారు. నిమ్మగడ్డ పదవీకాలంలోనే ఈ ఎన్నికలు పూర్తి కావడం వైఎస్సార్‌సీపీకి మంచిది అయింది. లేకుంటే తెలుగుదేశం ఏమని ఆరోపించేదో ఊహించండి. కొత్త ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికలలో విజయం సాధించిందని చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఎంపీటీసీ ,జడ్పిటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుతుంటే ఎన్నికల కమిషనర్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఆయన సెలవుపై టూర్ వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా ఇందుకు ఊతం ఇస్తుంది.
ఈ ఏడాదికాలంలో జరిగిన వివిధ పరిణామాలలో ఎన్నికల కమిషనర్‌తో విభేదాలు, తెలుగుదేశంతో సహా ఆయా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు, టీడీపీ మీడియా చేసిన దుష్ప్రచారం వీటన్నిటినీ ఎదుర్కొని వైఎస్సార్‌సీపీ నిలబడగలిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన కొన్ని సంకేతాలు ఇచ్చాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదన్నది వాటిలో ఒకటి అయితే, ప్రతి పక్ష టీడీపీ ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందన్నది మరొకటి. వైఎస్సార్‌సీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో 49.5 శాతం ఓట్లు వస్తే ఈ మున్సిపల్ ఎన్నికలలో 52.63 శాతం ఓట్లు వచ్చాయి. ఇది అరుదైన విషయమే. మరో వైపు టీడీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు నలభై శాతం ఓట్లు వస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 22 నెలల్లో మరో పదిశాతం ఓట్లను టీడీపీ కోల్పోయిందన్నమాట. అధికారపార్టీ కన్నా ఈసారి టీడీపీకి పది లక్షల ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురు ఇప్పటికే పార్టీకి దూరం అయ్యారు. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ గెలవలేకపోయింది. అంటే టీడీపీ గతంలో కన్నా దారుణమైన పతనాన్ని చవిచూసిందని అర్థం. జగన్ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, నేరుగా ప్రజల ఖాతాలలోకే డబ్బు చేరడం, అవినీతి, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం, అన్ని ప్రభుత్వ స్కీములూ నేరుగా ఇళ్ల వద్దకే చేరడం, పాలనను ప్రజలకు గ్రామాలలోనే అందించడం, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను వివిధ స్కీముల ద్వారా ఆదుకోవడం.. ఇలా అన్నీ పనిచేశాయన్నమాట.
ఇక చంద్రబాబు కొన్ని సవాళ్లు విసిరారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో వైఎస్సార్‌సీపీని ఓడిస్తే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పవచ్చని ఆయన ఆశించారు.అందుకోసం ఆయన రెచ్చగొట్టే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని, వారు పాచిపనుల కోసం బెంగళూరు, చెన్నై తదితర చోట్లకు వెళుతున్నారని, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ప్రజలను అవమానపర్చడమేనని ఆయన అనుకోలేదు. అంతేకాదు. ప్రజలకు సిగ్గు ఉందా? రోషం ఉందా? అంటూ కొత్త తరహా ప్రచారం చేశారు. అయినా ప్రజలు వాటికి రెచ్చిపోలేదు. ప్రభుత్వం పట్ల తమ అభిమతాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఆరకంగా చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపూర్‌లో మొదటిసారి టీడీపీ అపజ యాన్ని చవిచూడడం కూడా గమనించదగిన అంశమే. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 75 పంచాయతీలలో ఓటమి చెందారు. ఆయన జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ పరాజయ పరాభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీనితో ఆయన నైతికంగా ఇతర టీడీపీ నేతలను ప్రశ్నించే అర్హత కోల్పోయినట్లయింది. అందువల్లే విజ యవాడలో టీడీపీ కుల సంఘంగా మారిందని ఆరోపించిన సొంతపార్టీ నేతలను బాబు కనీసం మందలించలేకపోయారు.
అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లలో గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పడిందని అర్థం చేసుకోవాలి. గెలిచిన వార్డు సభ్యులు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందిం చాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. తద్వారా వారు మరింత పేరు తెచ్చుకోవాలి. మరో మూడు సంవత్సరాలలో శాసనసభ ఎన్నికలు వస్తాయి. వీరు సరిగా పనిచేయకపోతే దాని ప్రభావం ఆ ఎన్నికలపై కొంత పడుతుంది. ప్రస్తుతం జగన్ ప్రభావంతో గెలిచిన వీరు ఆయనకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరుతేవాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది. వారికి మరోసారి శుభాకాంక్షలు. అభినందనలు.
విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు