కట్టడి సరే! కర్ర పెత్తనమొద్దు

Dileep Reddy Article On Social Media New Rules - Sakshi

ఆన్‌లైన్‌ కంటెంట్‌ విచ్ఛలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. అభ్యంతరకర కంటెంట్‌ డిజిటల్‌ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం.

భరోసా ఇవ్వాల్సిన నిబంధనలు భయాలు రేపితే? పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే! ‘డిజిటల్‌ మీడియా’లో వచ్చే కంటెంట్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు చర్చ రేపుతున్నాయి. ఇదొక ‘మృదు స్పర్శ’ అని సర్కారు ముచ్చటగా పేర్కొన్నా, చివరకు కఠువైన కర్రపెత్తనానికి దారితీసే జాడే కనిపిస్తోంది. అదే జరిగితే, ఇంతటి కసరత్తు తుదిస్వరూపం... భావ వ్యక్తీకరణ హక్కుకు ఒకడుగు దూరం, సెన్సార్‌షిప్‌కు మరొకడుగు దగ్గరైనట్టే లెక్క. ఇన్నాళ్లూ వాటిపై చట్ట నియంత్రణ లేకపోవడం ఓ లోపమైనా, ఎంతో ఆసక్తితో నిరీక్షించింది ఇందుకా? అన్న పెదవి విరుపు మీడియా వర్గాల్లో వస్తోంది. పౌరులు కూడా ఏం బావుకుంటారనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిబంధనల వెనుక పేర్కొన్న లక్ష్యాలు ఆదర్శవం తంగా అమలయితే, హానికి బదులు సమాజానికి మంచి జరగొచ్చు! కానీ, నిబంధనల నీడలో కేంద్ర సర్కారు పెద్దలకు లభించే నిర్హేతుక విచక్షణాధికారాల వల్ల దురుపయోగానికి ఆస్కారం పెరుగుతుంది. నిబంధనావళి రూపొందించిన తీరే అందుకు కారణం. ఆన్‌లైనే వేదికగా... ఏలిన వారి సానుకూల ప్రచార ద్వారాలు తెరచుకునేందుకు, గిట్టని ప్యత్యర్థి పక్షాల వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బంధాలు వేసేందుకూ ఇది ఊతమిస్తుంది. ఆన్‌లైన్‌ కంటెంట్‌ విచ్చలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. ఆన్‌లైన్‌ సమాచార వ్యవస్థల ఊపిరైన భావవ్యక్తీకరణ హక్కుకు గండి పడొచ్చు. డిజిటల్‌ మాధ్యమాలే వేదికగా పరస్పర సమాచార మార్పిడి చేసుకునే వినియోగదారుల గోప్యత గోడలె క్కొచ్చు! ఓటీటీ వేదికల్లో పుట్టే కంటెంట్‌ సృజన భంగపడచ్చు! నచ్చని సర్కారు విధానాలని ఎండగడుతూ వేర్వేరు సామాజిక వేది కల నుంచి నిరసనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే ప్రజాస్వామ్యవాదుల గొంతును నొక్కే ఆయుధంగా మారే ప్రమాదముంది.

ఇప్పుడెందుకీ నిబంధనలు?
సామాజిక మాధ్యమాలతో సహా ఇతర ఆన్‌లైన్‌ డిజిటల్‌ వేదికల నుంచి వస్తున్న కంటెంట్‌ తరచూ వివాదాస్పదమౌతోంది. రాజకీయ అనుకూల, ప్రతికూల వాదనల నడుమ ట్విటర్, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమిక డిజిటల్‌ వేదికలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలనెదు ర్కొంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, దానికి భంగం కలిగేలా ‘వాట్సాప్‌’ ఇటీవల తాజా నిబంధనావళిని తెచ్చే యత్నం, వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం తెలిసిందే! ఇక్కడొక పద్ధతి, పకడ్బందీ చట్టాలున్న ఇంగ్లండ్‌ వంటి ఐరోపా దేశాల్లో మరో పద్ధతి ఎలా పాటిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సదరు మాధ్యమిక డిజిటల్‌ వేదికను ప్రశ్నించాయి. ఆ పరిస్థితి కూడా, దేశంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, ఒక నియం త్రణ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్‌ మీడియా వేదికల నుంచి పిల్లలను పెడదారి పట్టిస్తున్న శృంగార వీడియోలు (పోర్నో), మహిళల్ని అసభ్యంగా, అభ్యంతరకరంగా చూపించే వీడియోలు, చిత్రాలు ప్రసారమౌతున్న తీరుపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ప్రజ్వల కేసులో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. వినియోగదారుల సమాచారం పంచుకునే మాధ్యమిక వేదికలతో సహా వివిధ డిజిటల్‌ మీడియాలో వస్తున్న కంటెంట్‌ను కట్టడి చేయాలని, అవసరమైతే మార్గదర్శకాల్ని జారీ చేయాలని, నియంత్రణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. ప్రస్తుత మార్గదర్శకాలు ఆ క్రమంలో వచ్చినవే! అయితే వీటిని పార్లమెంటు లోగానీ, మరే ఇతర శాసన వేదికల్లోగానీ చర్చించ లేదు. డిజిటల్‌ మీడియాపై అధికారిక నియంత్రణ, వారి పనితీరును నిర్దేశించే చట్ట మేదీ లేకపోవడం లోపంగానే ఉంది. కొత్తగా చట్టం తీసుకురాకుండా కేంద్రం తాజా నిబంధనలతో ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేసింది.

ఎటు దారి తీసేనో...!
డిజిటల్‌ వేదికల్లో కంటెంట్‌ ఏ అదుపూ లేకుండా, విచ్చలవిడిగా ఉండా లని ఎవరూ కోరుకోరు. నియంత్రణ, అందుకు తగిన మార్గదర్శకాలు, అమలుపై నిఘా ఉండాల్సిందే! అవి ఏ మేర సముచితమన్నది ప్రజా స్వామ్య వ్యవస్థలో చర్చ పుట్టిస్తుంది. ఫిర్యాదుల్ని పరిష్కరించడం, డిజిటల్‌ వేదికలని నియంత్రించడం, వారి ప్రక్రియల్ని చట్టబద్ధం చేయడం కోసమే ప్రస్తుత నియమావళి. డిజిటల్‌ అన్న మౌలిక పదం కింద... అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ వేదికల్ని, ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్ని, వాట్సాప్, సిగ్నల్‌ వంటి సమాచార మార్పిడి–మాధ్యమిక వేదికల్ని, వివిధ న్యూస్‌ వెబ్‌సైట్ల వంటి సమా చార మాధ్యమాల్ని... అన్నింటినీ ఒక గాటన కట్టడం ఆశ్చర్యం కలిగి స్తోంది. వాటి స్వరూప స్వభావాలు, పనితీరు, కంటెంట్‌ నిర్మాణం, పంపిణీ, లక్ష్యిత వినియోగదారులు... భిన్నం. కంటెంట్‌ పట్ల అభ్యంత రాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు ఆయా సంస్థల్లో నిర్దిష్ట మూడంచెల వ్యవస్థ ఉండాలని నిర్దేశించారు. అంతర్గ తంగా మొదట గ్రీవెన్స్‌ ఆఫీసర్, తర్వాత ఫిర్యాదుల్ని పరిష్కరించే ‘గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ కమిటీ’ ఉండాలి. అప్పటికీ పరిష్కారం లభించ కుంటే, సదరు అంశం మూడో స్థాయిలో, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో ఏర్పడే ‘తుది అంచె కమిటీ’కి వెళ్తుంది. వారిచ్చే తీర్పుకు లోబడి ఉండాలి. అంటే, పాలకపక్షాల కనుసన్నల్లోని వీర విధేయ అధికారులు ఆయా స్థానాల్లో ఉంటే, ఇది ’సూపర్‌ సెన్సా రింగ్‌’ కాక మరేమవుతుందన్నది ప్రశ్న! ఆన్లైన్‌ మీడియాలో ఏం రావాలి? ఏం రావొద్దు? అన్నది ప్రభుత్వాధికారుల నిర్ణయాల ప్రకారం జరిగితే, మీడియా స్వేచ్ఛ– వాక్‌స్వాతంత్య్రానికి అర్థం చిన్న బోతుంది. చిన్న సంస్థలు ఇంతటి ఫిర్యాదు–పరిష్కార వ్యవస్థల్ని ఏర్పరచుకోలేవు. పెద్ద సంస్థలు సర్కారు పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడ సాహసించలేవు. చివరకిది, ఫక్తు ప్రచారానికి–సమాచార వ్యవస్థకి మధ్య విభజన రేఖను చెరిపేస్తుంది. మీడియా విశ్వసనీయ తను తగ్గిస్తుంది. కడకు ఆర్థికంగా మనలేని స్థితికి మీడియా దిగజారు తుందన్నది ఆందోళన. ఓటీటీలో వచ్చే కంటెంట్‌ వీక్షకులను వేర్వేరు వయసుల వారిగా వర్గీకరించాలన్న నిబంధన స్వాగతించదగ్గదే.

న్యాయస్థానంలో నిలిచేనా...?
పరస్పర విరుద్ధాంశాలు సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. అభ్యంతరకర కంటెంట్‌ డిజిటల్‌ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత (ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్టింగ్‌) ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. ఇదే సమయంలో ఆ రెండు చట్టాలు తీసుకువచ్చే యత్నాలు మరోవైపు జరుగుతున్నాయి. గోప్యత ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో విస్పష్టమైన తీర్పునిచ్చింది. పైగా, నిబం ధనల్లో పేర్కొన్న పలు అంశాలు నిర్ణయించే అధికారం సర్కారుకు/ అధికారులకు దఖలుపరిచే మూల స్వరూపమేదీ సదరు ‘ఐటి చట్టం– 2000’లో లేదు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నట్టే, ఒక చట్టం కింద రూపొందే నిబంధనలు సదరు చట్టానికి లోబడే ఉండాలి. భిన్నంగా ఉంటే, సవాల్‌ చేసినపుడు న్యాయస్థానంలో నిలువ జాలవు. తగురీతిన పార్లమెంటులో చర్చించకుండా, చట్ట సవరణకూ సిద్దపడ కుండా, తనకు లేని అధికారాల్ని ప్రభుత్వం నిబంధనల రూపంలో తీసుకురావడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ బద్ధత అటుంచి, ముందు చట్టబద్ధతైనా ఉండాలిగా? అనే ప్రశ్న తలె త్తుతోంది. తప్పిదాల్ని సరిదిద్దుకోకుంటే... భారత రాజ్యాంగం అధిక రణం 19(1)(ఎ)లో, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన అధి కరణం 19లో నొక్కిచెబుతున్న భావ ప్రకటన స్వేచ్చ గాలికి ఎగిరిపోయి ప్రజాస్వామ్యం పరిహాసమవుతుంది.


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ :
dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top