రాయని డైరీ: అమిత్‌ షా (కేంద్ర మంత్రి)

Amit Shah Rayani Dairy Guest Column By Madhav Singaraju - Sakshi

‘‘ఇండియాలో ఏంటి విశేషాలు అమిత్‌జీ..’’ అని రాత్రి పన్నెండు గంటలప్పుడు రోమ్‌ నుంచి మోదీజీ ఫోన్‌ చేశారు. 
రోమ్‌ కన్నా ఢిల్లీ మూడున్నర  గంటలు ముందుంటుంది కాబట్టి, ఆయన నాకు ఫోన్‌ చేసిన టైమ్‌లో అక్కడ రాత్రి ఎనిమిదిన్నర అయుండాలి. మోదీజీ అప్పుడే డిన్నర్‌ ముగించుకుని నాలుగడుగులు వేయడానికి బాల్కనీలోకి వచ్చి ఫోన్‌ చేసినట్లున్నారు.  
‘‘పెద్దగా విశేషాలేం లేవు మోదీజీ’’ అన్నాను.. బలమైన  ఆవలింత నొకదాన్ని బలంగా నొక్కిపట్టేస్తూ. 
‘‘పెద్దగా లేవంటే.. కొద్దిగా ఉన్నాయనేగా..’’ అని మోదీజీ తన కవితాత్మక ధోరణిలో అన్నారు. 

మామూలుగానైతే అది నేను కవితల్ని ఆస్వాదించే టైమ్‌ కాదు. డిన్నర్‌ ముగించుకుని బాల్కనీలో నేనూ నాలుగు అడుగులు వేసి అప్పటికే మూడున్నర గంటలు దాటింది కాబట్టి ఇక్కడి విశేషాలు కూడా ఏవీ వెంటనే గుర్తుకు రాలేదు. నిద్ర మత్తును వదిలించుకునేందుకు కొంత టైమ్, విశేషాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మరికొంత టైమ్‌ తీసుకున్నాను. మొత్తం మీద ఐదు సెకన్‌ల టైమ్‌ తీసుకుని ఉంటాను.
‘‘చెప్పండి అమిత్‌జీ..’’ అన్నారు ఉత్సాహంగా. 

అక్కడ మోదీజీకి నిద్ర తన్నుకొచ్చేవరకు ఇక్కడ నేను విశేషాలను గుర్తుకు తెచ్చుకోడానికి తన్నుకులాడటం తప్పేలా లేదని అర్థమైంది.  
‘‘కొన్ని విశేషాలైతే ఉన్నాయి మోదీజీ! రాజ్‌నాథ్‌సింగ్‌ మిమ్మల్ని ఇక్కడ ఒక సభలో 24 క్యారెట్ల బంగారం అన్నారు. అంతే కాదు. గాంధీజీ తర్వాత గాంధీజీ అంతటి వారని కూడా అన్నారు. లక్నో వెళ్లినప్పుడు నేను కూడా అదే మాట అన్నాను. 2024 లోనూ మోదీజీనే మనకు కావాలంటే కనుక 2022లోనూ యోగినే మనం ఎన్నుకోవాలి అని అక్కడి వారికి చెప్పి వచ్చాను’’ అన్నాను.

‘‘మన విశేషాలు మనకెందుకు అమిత్‌జీ! మనవాళ్ల విశేషాలేమైనా ఉంటే చెప్పండి’’ అన్నారు మోదీజీ. మనవాళ్లు అంటే ఆయన అర్థం వేరే. 
‘‘ఉన్నాయి మోదీజీ! రాహుల్‌ గుజరాత్‌ వెళ్లి సూరత్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. ‘రెండేళ్ల క్రితం.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని మీరు అన్నారా?’ అని రాహుల్‌ని జడ్జి అడిగితే.. నేనెప్పుడన్నాను, నేనెందుకంటాను అని అనకుండా.. ‘నాకు తెలియదు’ అని చెప్పి వచ్చేశాడు. రాహుల్‌ సూరత్‌ కోర్టులో అలా చెప్పి వచ్చేయడం ఇది మూడోసారి మోదీజీ’’ అని చెప్పాను. 
‘‘ఇంకా..’’ అన్నారు. 
‘‘మమతా బెనర్జీ పణాజి వెళ్లారు మోదీజీ’’ అని చెప్పాను. 
‘‘వెళ్లి?’’ అన్నారు. 

‘‘టీఎంసీ అంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ కాదు.. టి అంటే టెంపుల్, ఎం అంటే మసీద్, సి అంటే చర్చి అని అంటున్నారు మోదీజీ..’’ అని చెప్పాను. 
‘‘ఇంకా..’’ అన్నారు!
‘‘లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి కూడా ఒక విషయం ఉంది మోదీజీ. అయితే అది విషయమే కానీ విశేషం ఏమీ కాదు..’’ అన్నాను. 
‘‘అయినా చెప్పండి’’ అన్నారు. 
‘‘2024లో మీరు వచ్చే ప్రసక్తే లేదట.  పార్టీలన్నీ ఏకమై, మిమ్మల్ని ఓడిస్తాయని లాలూ అంటున్నారు మోదీజీ’’ అని చెప్పాను.
‘‘అవునా’’ అన్నారు. 
‘మరి అక్కడి విశేషాలేంటి మోదీజీ’ అని అడగబోయి ఆగాను. 
అప్పటికే ఒంటి గంట అవుతోంది. 
‘‘ఇక్కడా విషయాలున్నాయి అమిత్‌ జీ. ఓ గంటలో మళ్లీ ఫోన్‌ చేస్తాను.. మీ డిన్నర్‌ అయింది కదా?’’.. అని ఫోన్‌ మాట్లాడుతూనే ఎవరితోనో మాటల్లోకి వెళ్లిపోయారు!! 

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top