World TB Day 2022: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!

World TB Day 2022: Do not ignore these Symptoms - Sakshi

ప్రపంచ జనాభాను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో టీబీ మహమ్మారి లేదా క్షయవ్యాధి ఒకటి. కోవిడ్‌ మహమ్మారి  తరువాత టీబీ మరణాలు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 4వేలకు పైగా టీబీ వ‌ల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే టీబీపై అవగాహన కల్పించడంతోపాటు సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో  ప్రతీ ఏడాది మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుకుంటాం.  గ్లోబల్‌ హెల్త్‌ క్యాంపెయిన్‌ భాగంగా  WHO చేపట్టిన  8  ప్రధాన ‍  క్యాంపెయిన్లలో  వరల్డ్‌ టీబీ డే కూడా ఒకటి. 

ప్రతీ ఏడాది  మార్చి 24వ తేదీ  ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. గ్లోబల్‌గా  2012 సంవత్సరంలో, మొత్తం 8.6 మిలియన్ల మంది టీబీ బారిన పడగా, 1.3 మిలియన్ల మంది మరణించారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, వివిధ స్వచ్ఛంద  సంస్థలు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882లో TBకి కారణమయ్యే బాసిల్లస్ మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ను కనుగొన్నట్లు ప్రకటించిన తేదీకి గుర్తుగా,  ప్రజల్లో అవగాహన పెంచేందుకు  ప్రతి  ఏడాది  మార్చి 24న ప్రపంచ టీబీ  దినోత్సవాన్ని జరుపుకుంటాం

అయితే క్షయవ్యాధికి పూర్తి నివారణ ఉన్నప్పటికీ, సరైన అవగాహన, చికిత్స తీసుకోకపోవడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వేధించిన కరోనా తరువాత టీబీ ముప్పు మరింత పెరిగింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘‘టీబీని అంతం చేయడానికి పెట్టుబడులు పెట్టండి, ప్రాణాలను కాపాడండి’’  అనే థీమ్‌తో 2022 ప్రపంచ టీబీ డే నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

టీబీని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాల ఫలితంగా 2000 సంవత్సరం నుండి సుమారు 66 మిలియన్ల మంది ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే ఈ పోరాటాన్ని, ఇన్నేళ్ల  పురోగతిని కోవిడ్‌-19 మహమ్మారి తారు మారు చేసింది.  దశాబ్దంలో తొలిసారిగా, 2020లో టీబీ మరణాలు మళ్లీ పెరిగాయి.

ఊపిరితిత్తులకు మాత్రమే టీబీ వస్తుందా?
టీబీ వ్యాధి  సాధారణంగా ఊపిరితిత్తులను పట్టి పీడించేది అయినప్పటికీ  లింఫ్ నోడ్ టీబీ అంటే  మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథుల‌కు, వెన్నెముక‌, మెద‌డు, గుండెకు, ఎముక‌ల‌కు, కీళ్లకు ఇలా శ‌రీరంలో ఏ అవ‌య‌వానికైనా రావ‌చ్చు. ఇరుకైన జీవన పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పారిశుధ్యం లోపం, అవగాహనా లేమి  ప్రధానంగా పేదరికం లాంటి కారణాలు టీబీ వ్యాప్తికి కారకాలు.

సాధారణంగా కనిపించే లక్షణాలు
క్షయవ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అంటే  కనీసం 3 వారాల పాటు  తీవ్రమైన దగ్గు , దగ్గినపుడు కఫంతోపాటు రక్తం కనిపించడం మరో ప్రధాన లక్షణం. దీంతోపాటు చలితో కూడిన జ్వరం, ఆకలి మంద గించడం, బరువు తగ్గడం ఇతర లక్షణాలున్నపుడు టీబీ వ్యాధిగా అనుమానించి తగిన వైద్య పరీక్షలు చేయించు కోవాలి. అలాగే రాత్రి పూట చెమటలు ఎక్కువగా పట్టడంతోపాటు, ఛాతీ నొప్పిగా ఉంటే అప్రమత్తం కావాలి. సుదీర్ఘ కాలం కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, మూర్ఛలు, తలనొప్పి వేధిస్తున్నా  వైద్యడిని  సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే 100 శాతం నివారణ సాధ్యం. ఏ రకమైన టీబీ సోకింది అనేదానిపై చికిత్స అధారపడి ఉంటుంది. లేటెంట్‌ టీబీవేరియంట్‌కు యాంటీ బయాటిక్స్, యాక్టివ్‌ TB సోకినవారు దాదాపు తొమ్మిది నెలల పాటు పలు రకాల మందులను వాడాలి.  ఒకవేళ డ్రగ్-రెసిస్టెంట్ అంటే మందుల‌కు లొంగ‌ని టీబీ అని తేలితే వారికి ప్రత్యేక చికిత్స  అందించాల్సి  ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top