ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ!

What Is The Relation Between Abnormal Menstruation And Unhealthy Heart In Women - Sakshi

రెగ్యులర్ పీరియడ్స్ మంచి ఆరోగ్యానికి సంకేతమని తెలుసా? అవును.. హార్మోన్ల సమతౌల్యం, అసమతౌల్యం, సంతానోత్పత్తికి, మానసిక ఆరోగ్య స్థితికి కూడా ఇది ముందస్తు సూచనగా వ్యవహరిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రానివారిలో పోలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) సమస్య తలెత్తుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా యుక్తవయసు బాలికల్లో, మహిళల్లో సాధారణంగా కనిపించే రుగ్మత. బెంగళూరులోని లా ఫెమ్ హాస్పిటల్‌ డైరెక్టర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాజ్‌పాల్ సింగ్ ఏం చెబుతున్నారంటే..

పోలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ లక్షణాలు
మెటబాలిక్‌ సిండ్రోమ్‌లో పీసీఓఎస్‌ ఒక భాగం. ఇది ఇన్సులిన్‌ విడుదలను నిరోధించడం, మేల్‌ ఆండ్రొజెన్‌ హార్మోన్‌ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మరీ అంతప్రమాదమా అంటే ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడేవారిలో రెగ్యులర్‌గా పీరియడ్స్‌ రాకపోవడం, జుట్టు రాలడం, సంతాన సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం.. వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, డిప్రెషన్‌, అధిక రక్తపోటు ఉండేవారిలో సాధారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మన దేశంలో సగటున 20 నుంచి 30 శాతం మంది మహిళలు పిల్లల్నికనే వయసులో పీసీఓఎస్‌ బారిన పడుతున్నారు. మహిళల్లో సంతానవైఫల్యానికి ఇది కూడా ఒక కారణమే!

గుండె సంబంధిత సమస్యలు రెండింతలు ఎక్కువ..
అసహజ జీవక్రియ కలిగిన మహిళల్లో హృదయసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం రెండింతలు ఎక్కువ. ఏదిఏమైనప్పటికీ పీసీఓఎస్‌పై అవగాహన కలిగి ఉండటం మాత్రం అవసరమనే చెప్పాలి. మెట్‌ఫార్మిన్, ఎసిఇ/ఎఆర్‌బి ఇన్‌హీబిటర్స్‌, ఆస్పిరిన్‌ వంటి మందులు వాడే రోగుల్లో గుండె సంబంధిత సమస్యలు ముడిపడి ఉ‍న్నాయని డా. రాజ్‌పాల్‌ వెల్లడించారు.

సమస్య తగ్గాలంటే..
ఈ సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడం, ఆహార భద్రతలు, శారీరక వ్యాయామం, పొగతాగడానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా గైనకాలజీ చెక్‌అప్‌లు చేయించుకోవడం.. వంటి కొద్దిపాటి మార్పులు జీవనశైలిలో భాగంగా పాటించాలి.  అంతేకాకుండా గుండె, న్యూరోలాజికల్ సంబంధమైన లక్షణాలు బయటపడినప్పుడు ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టును సంప్రదించడం మరచిపోకూడదని డా. రాజ్‌పాల్‌ సూచించారు.

చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్‌ చేస్తాయట.. ఆశ్యర్యం!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top