మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?

What are the warning signs of obesity - Sakshi

మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్‌ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్‌ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్‌)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్‌తో మరోసారి కొలవండి.

ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్‌ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్‌ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము  కొలత, హిప్స్‌ భాగం కొలత  కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. 

సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ  0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్‌ఆర్‌ (వేయిస్ట్‌ బై హిప్‌ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో  0.86  కంటే ఎక్కువగానూ, పురుషులలో  0.95  కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత  ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి.

అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్‌ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్‌ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్‌ ఒబేసిటీ లేదా సెంట్రల్‌ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్‌ బై హిప్‌ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్‌ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top