పెళ్లి అయితే బరువు పెరుగుతారా?

Weight Gain After Marriage Is Common Know Why - Sakshi

పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు చాలా మంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కనిపించేది కాదని, మానవ సమాజాల్లో ఎక్కడైనా పెళ్లి తర్వాత బరువు పెరగడం చాలా సాధారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత బరువు పెరగడం అనేది మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో కొంచెం ఎక్కువ అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 8000 మందిపై జరిపిన పరిశోధన ప్రకారం పెళ్లైన ఐదేళ్ల తర్వాత ఆడవాళ్లు సరాసరిన 11 కిలోలు బరువు పెరగగా, పెళ్లి కాని ఆడవారు ఐదేళ్లలో సరాసరిన 7 కిలోలు మాత్రమే బరువు పెరిగారు.

ఇదే సమయంలో పెళ్లైన మగవారు దాదాపు 7–8 కిలోలు మేర బరువు పెరిగినట్లు తెలిసింది. పైగా పెళ్లైన జంటలో ఒకరు బరువు పెరిగితే మరొకరు బరువు పెరిగే అవకాశాలు 37 శాతం అధికమని తేలింది. ఇందుకు కారణం జంటలో ఒకరి అలవాట్లు మరొకరికి తొందరగా సోకడమే. అంటే ఒకరికి ఎక్కువ తినే అలవాటుంటే వారి భాగస్వామిలో కూడా తినే అలవాటు బాగా పెరుగు తుందన్నమాట. అలాగే పెళ్లి తర్వాత బంధువుల ఇళ్లలో విందులు, సొంతింట్లో కొసరి కొసరి తినిపించుకోవడాలు.. ఇలా తెలియకుండానే జంట బరువు పెరుగుతారు. 

పెళ్లి కానంత వరకు శరీర సౌందర్యం పై శ్రద్ధ పెట్టిన వాళ్లు జంటగా మారిన తర్వాత ఇద్దరిలోనూ పెరిగే భద్రతా భావం కారణంగా శరీరంపై కొంతమేర అశ్రద్ధ వహించడం జరుగుతుంది, దీనితోపాటు పైన చెప్పినట్లు తినడం పెరగడం వల్ల కూడా క్రమంగా లావవుతారు.  ఈ ప్రక్రియను అడ్డుకోవాలంటే కలిసి తిన్నట్లే కలిసి ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top