శుభ ముహూర్తాలకు తాత్కాలిక విరామం | Wedding Muhurthams End on May 13 Auspicious Ceremonies to Resume from June 19 | Sakshi
Sakshi News home page

శుభ ముహూర్తాలకు తాత్కాలిక విరామం

May 16 2026 11:56 AM | Updated on May 16 2026 12:57 PM

Wedding Muhurthams End on May 13 Auspicious Ceremonies to Resume from June 19

ఈ ఏడాది మే 13తో శుభ ముహూర్తాలు ముగిశాయి. సుమారు 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం. జ్యేష్ఠమాసం కారణంగా ఈ విరామం ఏర్పడింది. ఈ నెలలో దైవ కార్యాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, శుభ కార్యాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు చేయటం శాస్తోక్తంగా అనుకూలంగా భావించరు. ఈనెల 18 నుంచి వచ్చే నెల 18 వరకు జ్యేష్ఠ మాసం(మూఢమి) కావటంతో వివాహాలకు బ్రేక్‌ పడనుంది. ఈ క్రమంలో చివరి ముహూర్తం మే13న పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. మళ్లీ జూన్‌ 19 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.  

వ్యాపారాలపై ప్రభావం... 
శుభ ముహూర్తాలకు బ్రేక్‌ పడటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు ఇతర శుభ కార్యాలు నిలిచి పోయాయి. ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, బ్యాండ్స్, డెకరేషన్‌ రంగాల వారికి దాదాపుగా పనులు నిలిచిపోయాయి. వీరంతా మళ్లీ జూన్‌ 19 నుంచి బిజీ కానున్నారు.   

శుభ ముహూర్తాలు... 
జూన్‌లో 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో అనుకూలంగా ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలలో 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీల్లో వరుసగా శుభ కార్యాలు జరగనున్నాయి. నెల రోజుల విరామం తరువాత పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలతో వ్యాపార వర్గాలు, ఫంక్షన్‌ హాళ్లకు భారీగా బుకింగ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కుటుంబాలు తమ పిల్లల వివాహాల కోసం తేదీలను ఖరారు చేసుకునేందుకు పండితులను సంప్రదిస్తున్నారు. ఫంక్షన్‌ హాల్స్, డెకరేషన్స్, క్యాటరింగ్, తదితర వాటికి అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. నెల రోజుల విరామం తాత్కాలిక ప్రభావం చూపినా జూన్‌ 19 తరువాత మళ్లీ శుభ ముహూర్తాల సీజన్‌ ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.  

జ్యేష్ఠ మాసం కారణంగా... 
జ్యేష్ఠ మాసం మూఢం కారణంగా మే 18 నుంచి జూన్‌ 18 వరకు వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాల ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఈనెల 14 నుంచి శుభ కార్యాలకు విరామం ఏర్పడింది.  
–శివరాంభొట్ల పవన్‌శర్మ, ఆలయ పురోహితుడు, శ్రీతిరుపతమ్మవారి దేవస్థానం

 

Advertisement
 
Advertisement
Advertisement