Tips To Healthy Pregnancy: మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్‌ నిల్‌.. డోనర్‌ స్పెర్మ్‌ వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా?

Venati Shobha Suggestions Over Pregnancy Gynecology Doubts - Sakshi

సందేహాలు సమాధానాలు

థైరాయిడ్‌ మందులతో పాటు హెయిర్‌ఫాల్‌ తగ్గడానికి మందులు వాడొచ్చా?

సమస్యను బట్టి చికిత్స

►నా వయసు 26 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లల్లేరు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, నాకు అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్‌ నిల్‌ అని వచ్చింది. డోనర్‌ స్పెర్మ్‌ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చని డాక్టర్‌ చెప్పారు. దీనివల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా?
– వందన, చోడవరం

స్పెర్మ్‌కౌంట్‌ నిల్‌ అంటే వీర్యంలో వీర్యకణాలు అసలు లేవు అని అర్థం. దీనినే అజోస్పెర్మియా అంటారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డాక్టర్‌ కౌంట్‌ నిల్‌ అని నిర్థారించారని అనుకుంటున్నాను. కొందరిలో వృషణాలలో తయారయ్యే వీర్యకణాలు,అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా అడ్డంకులు ఉండటం వల్ల వీర్యంలో వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే టీసా, మీసా వంటి పద్ధతి ద్వారా టెస్టిక్యులార్‌ బయాప్సీ చేసి అసలు వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ కొన్ని అయినా వీర్యకణాలు ఉంటే, వాటిని ఐసీఎస్‌ఐ, ఐవీఎఫ్‌ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన చికిత్స. అన్ని విధాల స్పెర్మ్‌కౌంట్‌ నిల్‌ ఉన్నప్పుడు, డోనర్‌ స్పెర్మ్‌ ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు.

ఇందులో స్పెర్మ్‌ బ్యాంక్‌ నుంచి డోనర్‌ నుంచి సేకరించిన వీర్యకణాలను శుభ్రపరచి, వేరుచేసి, భద్రపరచిన వాటిని తెప్పించుకుని, ఆడవారిలో అండం విడుదలయ్యే సమయంలో యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ఈ డోనర్‌ వీర్యకణాలను చిన్న ప్లాస్టిక్‌ కెన్యూలాలో ఐయూఐ పద్ధతి ద్వారా ప్రవేశింపబడుతాయి. అలా ప్రవేశించిన వీర్యకణాల ఫెలోషియన్‌ ట్యూబ్‌లోకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ అండాశయం నుంచి విడుదలైన అండంలోకి చొచ్చుకుపోయి దానిని ఫలదీకరణ చెయ్యడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చేరి అక్కడ అడ్డుకుని నిలబడటం ద్వారా గర్భం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరిగితే గర్భం రాదు. డోనర్‌ స్పెర్మ్‌ని తీసుకునేటప్పుడు, స్పెర్మ్‌ బ్యాంకులో డోనర్‌కు ఏమైనా ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నాయా అని హెచ్‌ఐవీ, వీడీఎఫ్‌సీ, హెచ్‌సీవీ వంటి అనేక పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి డోనర్‌ ఐయూఐ పద్ధతి ద్వారా పెద్దగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు.

►గత ఏడాది చివర్లో నాకు లెప్ట్‌ సైడ్‌ ట్యూబ్‌ ప్రెగ్నెన్సీ లాపరోటమీ ఆపరేషన్‌ అయింది. ఆపరేషన్‌ జరిగిన మూడు నెలల తర్వాత ఎడమవైపు– అంటే ఎడమ కంటి నుంచి ఎడమ కాలి వరకు విపరీతంగా నొప్పి, మంట సెగలుగా వస్తే గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి, ఇది గైనిక్‌ సమస్య కాదన్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత పీరియడ్స్‌లో సమస్యలు మొదలయ్యాయి. పదిరోజులు వరుసగా బ్లీడింగ్, మళ్లీ పదిహేను రోజులకు పీరియడ్స్‌ రావడం జరుగుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– రమణి, చిత్తూరు

మీ లాపరోటమీ ఆపరేషన్‌కు మీ లక్షణాలకు ఏ సంబంధం లేదు. పదిరోజులు వరుసగా బ్లీడింగ్‌ అవ్వటానికీ అండాశయంలో నీటి కంతులు, నీటి బుడగలు, ఇన్‌ఫెక్షన్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, థైరాయిడ్‌ వంటి హోర్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పదిరోజుల బ్లీడింగ్‌ తర్వాత పదిహేను రోజులకు పీరియడ్స్‌ రావటం అంటే 25 రోజులకొకసారి పీరియడ్స్‌ వస్తున్నాయి అన్నమాట. మీ ఎత్తు, బరువు రాయలేదు.

కొన్నిసార్లు ఆపరేషన్‌ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరగటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి, యోగా, వాకింగ్, వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సలహా మేరకు థైరాయిడ్‌ వంటి రక్తపరీక్షలు, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ చెయ్యించుకుని గర్భాశయంలో అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని.. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది.

►నా వయసు 23ఏళ్లు. ఎత్తు 5.3 అడుగులు, బరువు 76 కిలోలు. నాకు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నాయి. విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. డాక్టర్‌ సలహా మేరకు థైరాయిడ్‌ మందులు వాడుతున్నాను. థైరాయిడ్‌ మందులతో పాటు హెయిర్‌ఫాల్‌ తగ్గడానికి మందులు వాడొచ్చా? హోమియో మందులు వాడొచ్చా?
– అనుపమ, బలిజిపల్లి

థైరాయిడ్‌ సమస్య వల్ల, పీసీఓడీ సమస్య వల్ల, ఆండ్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువగా స్రవించడం వల్ల, రక్తహీనత వల్ల, పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, జన్యుసమస్యలు వంటి అనేక కారణాల వల్ల విపరీతంగా జుట్టు ఊడిపోవచ్చు. థైరాయిడ్‌ మాత్రలు వాడుతున్నారు కాబట్టి, దానివల్ల సమస్య లేదు. మీకు పీసీఓడీ ఉండటం వల్ల మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పీసీఓడీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక హార్మోన్‌ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు ఉండటం జరుగుతుంది. మీ ఎత్తు 5.3 అడుగులకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 76 కిలోల బరువు ఉన్నారు.

పీసీఓడీ వల్ల జుట్టు ఊడుతుంటే, వాకింగ్, వ్యాయామాలతో పాటు మితమైన పోషకాహారం తీసుకుంటూ, జంక్‌ఫుడ్‌ తీసుకోకుండా, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గడం వల్ల పీసీఓడీ వల్ల జరిగే హార్మోన్ల అసమతుల్యత సరిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్‌ సమస్య కూడా అదుపులో ఉంటుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, అవసరమైతే బయోటిన్‌తో కూడిన మల్టీవిటమిన్‌ మాత్రలు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మొదట బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ , హోమియో మందులు వాడుకోవచ్చు.
-డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌.

చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top