ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..

You Must Know The Most Common Causes of Body Aches And Their Symptoms - Sakshi

అనేక వ్యాధుల్లో అత్యంత సాధారణ ప్రాథమిక లక్షణం ఒళ్లునొప్పులు. ఓ వయసు దాటాక అప్పుడప్పుడూ ఒళ్లునొప్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి మామూలుగానే వచ్చే ఒళ్లునొప్పులా లేక ఏదైనా వ్యాధి కారణంగానా అని  రోగనిర్ధారణ చేయడం డాక్టర్‌కు ఎప్పుడూ సవాలే. ఎందుకంటే... అది జ్వరంగానీ, జలుబుగానీ లేదా ఏదైనా వైరల్, బ్యాక్టీరియల్, ఇతరత్రా ఇన్ఫెక్షన్‌లన్నింటిలోనూ  చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి కాబట్టే ఆ ఇబ్బంది. అలాగే మనం సాధారణంగా వాడే కొలెస్ట్రాల్‌ మందులు మొదలుకొని అత్యంత తీవ్రమైన వ్యాధి వల్ల కూడా కావచ్చు. మామూలుగానైతే ఒళ్లునొప్పులు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగని నిర్లక్ష్యమూ తగదని చెబుతూ... ఏయే సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించే కథనమిది.  

కండరాల నొప్పుల్లో చాలా రకాలుంటాయి. కండరాల నొప్పుల్ని మయాల్జియా అని, కీళ్ళనొప్పుల్ని ఆర్థ్రాల్జియా అని, కీళ్ళలో వాపు ఉంటే ఆర్థ్రరైటిస్‌ అని, మృదుకణజాలం (సాఫ్ట్‌ టిష్యూ)లో నొప్పులు/ఇన్‌ఫెక్షన్లు ఉంటే టెండనైటిస్‌ అని, నరాల్లో నొప్పులుంటే న్యూరాల్జియా అని, ఎముకల్లో నొప్పులుంటే బోన్‌ పెయిన్స్‌ అంటాం. నొప్పులకు చాలా కారణాలుంటాయి. ఇందులో కొన్ని... 

►ఇన్ఫెక్షన్లు... ∙వైరల్‌ జ్వరాల్లో : 
సాధారణ ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా), అప్పట్లో చికున్‌ గున్యా  మొదలుకొని ఇటీవల చాలా ఎక్కువగా ప్రబలుతున్న డెంగీ వరకు. అలాగే హెపటైటిస్‌–బి, హెచ్‌ఐవీ వంటి ఇన్ఫెక్షన్లలో.

►ప్రోటోజోవన్‌ ఇన్ఫెక్షన్లు : 
మలేరియా, పిల్లి వల్ల వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్‌ వంటి ఏకకణజీవి ఇన్ఫెక్షన్లలో. 

►బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు: 
టైఫాయిడ్, రికెట్సియల్‌ వంటి జ్వరాల్లో, బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్‌ డిసీజ్‌ వంటి జబ్బుల్లో. 

►ఇరతత్రా ఇన్ఫెక్షన్లు :  
ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్‌ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్‌ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల ఇన్ఫెక్షన్‌లలో. 

ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన కండిషన్లు... 
డెంగీ : ఇటీవల అనుమానించాల్సిన జబ్బు ఇది. డెంగీలో ఒళ్లునొప్పుల తీవ్రత చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘బోన్‌ బ్రేకింగ్‌ ఫీవర్‌’ అని కూడా అంటారు. ఇలాంటి నొప్పులతో పాటు విపరీతమైన నడుమునొప్పి ఉంటే దాన్ని ‘డెంగీ’గా  అనుమానించాలి. 

ఫ్లూ. ఇతర జ్వరాలు: ఫ్లూ జ్వరం ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల వల్ల వస్తుంది. ఇందులో ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్‌ఫ్లుయెంజా బి’, ‘ఇన్‌ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలున్నాయి. వీటన్నింటిలో తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. చాలామందిలో అవి వాటంతట అవే తగ్గుతాయి. లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్‌ తీసుకుంటే చాలు. చాలా అరుదుగా కొందరిలో నిమోనియా, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. 

చికున్‌గున్యా: ఇదీ వైరల్‌ జ్వరమే అయినా ఇందులో మిగతా వైరల్‌ ఇన్ఫెక్షన్ల కంటే కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పుల కారణంగా రోగి  నడవలేక పూర్తిగా ఒంగిపోతాడు. దీనికి ఉపశమనం కోసం పారాసిటమాల్‌ వాడి, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.  

లెప్టోస్పైరోసిస్‌ : ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరమిది. ప్రస్తుత వర్షాకాలంలో మురుగునీటివల్ల, ఎలుకల ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ. ఇందులోనూ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్‌) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్‌ను ముందే తెలుసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్‌ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు.  

క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌: ఈ జబ్బులో త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్‌ ఇన్‌ఫెక్సియస్‌ మోనోన్యూక్లియోసిస్‌ అనే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌కు కారణం కావచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 

మందులతో : కొన్ని జబ్బులకు మనం వాడే మందులతో కూడా ఒళ్లునొప్పులు రావచ్చు. ఇందులో కొలెస్టరాల్‌ తగ్గించడానికి సాధారణంగా వాడే స్టాటిన్స్‌ వంటివీ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్‌ని సంప్రదిస్తే మందులు మార్చడమో, మోతాదు తగ్గించడమో చేస్తారు. కొన్ని విషసర్పాలు కాటు వేసినప్పుడు కండరాల మీద కనిపించే దుష్ప్రభావం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తాయి. అలాగే మనకు తెలియకుండా మన దేహంలోకి వెళ్లే విషాల వల్ల కూడా కండరాల నొప్పులు రావచ్చు. 

కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులతో నొప్పులు...
కీళ్లనొప్పులతో వచ్చే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో, జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్‌ లూపస్‌ అరిథమెటోసిస్‌లో, పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), పాలీమయోసైటిస్, జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌ వంటి కీళ్లవ్యాధుల్లో 

నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులు: – మయోపతి, మయస్థేనియా గ్రేవిస్,  ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో. 

ఎండోక్రైన్‌ వ్యాధులు : – హైపోథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం వంటి వాటితోపాటు... ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్‌లలో. పారానియోప్లాస్టిక్‌ సిండ్రోమ్‌ వల్ల: శరీరంలో ఎక్కడ క్యాన్సర్‌ సోకినప్పటికీ... ఇతర కండరాలపై దాని ప్రభావం వల్ల వచ్చే కండిషన్‌ అయిన ‘పారానియోప్లాస్టిక్‌ సిండ్రోమ్‌’లో.  

మల్టిపుల్‌ మైలోమా: ప్లాస్మాకణాల క్యాన్సర్లలో ఇలా ఒకింత తీవ్రమైన కారణాల్లోనే కాకుండా... సాధారణంగా అంతగా అపాయం లేని సమస్యల్లోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అవి... ∙తీవ్రమైన అలసటతో వచ్చే క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌లో 

మందులు, విషపదార్థాలు: డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్‌ వంటి మందులతోపాటు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఉపయోగించే మందుల వల్ల కూడా ఒళ్లునొప్పులు వస్తుంటాయి. ∙ఒక్కోసారి ఆల్కహాల్‌ మితిమీరి తీసుకున్న మర్నాడు కూడా.

►క్యాన్సర్‌ రోగుల్లో కీమో థెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటాయి. 

చేయించాల్సిన పరీక్షలు: 
పైన మనం చెప్పుకున్నట్లుగా ఎన్నెన్నోరకాల సమస్యల వల్ల ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఏ కారణం వల్ల అవి వస్తున్నాయో కనుగొనడం ప్రధానం. అందుకే చేయించాల్సిన కొన్ని సాధారణ పరీక్షలివి... 
►మూత్రపరీక్ష
►ఈఎస్‌ఆర్
►హీమోగ్రామ్ 
►కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు
►సీరమ్‌ ప్రోటీన్‌ ఎలక్ట్రోఫోరోసిస్‌ (ఎస్‌పీఈపీ
►స్కెలెటల్‌ సర్వే
►బోన్‌ స్కాన్
►సీరమ్‌ క్యాల్షియమ్‌ ఫాస్ఫరస్ 
►ఆల్కలైన్‌ ఫాస్ఫోటేజ్‌ పరీక్షలు 
►25 హైడ్రాక్సీ వైటమిన్‌ డి లెవెల్స్ 
►సీరమ్‌ పారాథోర్మోన్‌ లెవెల్స్ 
►బోన్‌మ్యారో (ఎముక మూలగ) పరీక్ష 
►యాంటీన్యూక్లియర్‌ యాంటీబాడీస్‌ పరీక్ష
►రుమటాయిడ్‌ ఫ్యాక్టర్ 
►హెచ్‌ఐవీ
►హెచ్‌బీఎస్‌ఏజీ
►హెచ్‌సీవీ పరీక్షలు
►మజిల్‌ బయాప్సీ
►ఈఎంజీ... ఒక్కోసారి అన్ని పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలో అందుకు కారణం యాంగై్జటీ, డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. అలాంటివారికి సైకియాట్రిస్ట్‌లతో తగిన మందులు, సలహాలతో మంచి ఫలితం ఉంటుంది. 

చాలా సందర్భాల్లో నిరపాయకరమైన కారణాల వల్లనే ఒళ్లునొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం సాధారణంగా ఉపయోగించే నొప్పినివారణ పూత మందులు వాడితే చాలు. అయితే ఇవి ఉపయోగిస్తున్నప్పటికీ రెండుమూడు వారాల తర్వాత కూడా తగ్గకుండా ఒళ్లునొప్పులు కనిపిస్తూనే ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

- డాక్టర్‌ కె. శివ రాజు
సీనియర్‌ ఫిజీషియన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top