ఇంటి పంట: రూఫ్‌టాప్‌ పొలం.. 5.7 ఎకరాలు! 

Urban Agriculture: City Dwellers Are Very Fond Of Healthy Green Activity - Sakshi

సిటీ ఫార్మింగ్‌.. నగరవాసులు ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్న హెల్దీ గ్రీన్‌ యాక్టివిటీ! అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలన్న తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు తామర తంపరగా విస్తరిస్తున్న నేపథ్యంలో సిటీ ఫార్మింగ్‌ ఊపందుకుంది. కాంక్రీటు అడవిలో మనోల్లాసాన్నిచ్చే పచ్చదనం ఉంటే చాలని గతంలో అనుకునే వారు. రసాయన అవశేషాల్లేని ఆహారం కూడా నగరంలోనే పండించుకొని తాజా తాజాగా వండుకు తినటం అలవాటు చేసుకుంటున్నారు. పర్యావరణ స్పృహతో పాటు అమృతాహార స్పృహ తోడైందన్నమాట!

సిటీ ఫార్మింగ్‌ అనేది ఒక పట్టణ/నగరంలో ఖాళీ స్థలాల్లో, మేడలపైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పెంచడం. సాధారణంగా పెరటి తోటలు, కంటైనర్‌ గార్డెనింగ్, వర్టికల్‌ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్‌ ద్వారా పండించి.. ఇంటిపట్టున వండుకోవటం లేదా ఆ దగ్గర్లో వారికి అందించటం దీని లక్ష్యం. అయితే, న్యూయార్క్‌ నగరంలో సిటీ ఫార్మింగ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆరోగ్యాభిలాషులు వేలాదిగా తమ సొంత మేడల పైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటి పంటలు పండించుకుంటున్నారు. న్యూయార్క్‌ నగరపాలకులు నాలుగేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ను పసిగట్టి ప్రోత్సాహానికి చట్టాలు చేశారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి ఔత్సాహికులకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నారు. వేలాది వ్యక్తిగత, కమ్యూనిటీ కిచెన్‌ గార్డెన్స్‌ పుట్టుకురావడానికి ఈ చర్యలు దోహదపడ్డాయి.

అంతేకాదు.. సిటీ ఫార్మింగ్‌ ద్వారా అమృతాహారోత్పత్తి భారీ వ్యాపారావకాశంగా మారిపోయింది. భారీ వాణిజ్య సముదాయ విస్తారమైన బహుళ అంతస్తుల సువిశాల భవనాలపైన ఎకరాలకు ఎకరాల్లోనే ‘అత్యాధునిక అర్బన్‌ పొలాలు’ మట్టితో సహా ప్రత్యక్షమవుతున్నాయి. ఎడాపెడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సైతం సేంద్రియంగా పండించేసి.. అక్కడికక్కడే ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లలో వండి వార్చుతున్నారు. చిల్లర దుకాణదారులకు విక్రయిస్తున్నారు. మేడల మీద మట్టి పొలాలను సృష్టించే సర్వీస్‌ ప్రొవైడర్లూ పుట్టుకొచ్చాయి. అటువంటి సంస్థల్లో ముఖ్యమైనది ‘బ్రూక్లిన్‌ గ్రేంజ్‌ రూఫ్‌టాప్‌ ఫామ్‌’.

ఎంతో గౌరవం.. థ్రిల్‌ కూడా!
నగరాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రకృతితో సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పులు విసిరే పెను సవాళ్లను ఎదుర్కోవడంలో.. మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పట్టణంలోని ఆకుపచ్చని ప్రదేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్బన ఉద్గారాలు, అధిక ఉష్ణోగ్రతలు, మురుగు నీరు వంటి సమస్యలతో సతమతమవుతున్న మన నగరాలకు సిటీ ఫామ్స్‌ ఊరటనిస్తాయి. అంతేకాదు, మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ పనిచేయడం మాకు ఎంతో గౌరవం, థ్రిల్‌ కూడా!
– గ్వెన్‌ షాంట్జ్, సహ వ్యవస్థాపకురాలు, క్రియేటివ్‌ డైరెక్టర్, బ్రూక్లిన్‌ గ్రేంజ్‌ రూఫ్‌టాప్‌ ఫామ్స్, న్యూయార్క్‌  

బ్రూక్లిన్‌ గ్రేంజ్‌ ద గ్రేట్‌!
బ్రూక్లిన్‌ గ్రేంజ్‌ సంస్థ బ్రూక్లిన్, క్వీన్స్‌లో గత పన్నెండేళ్లలో మూడు భారీ వాణిజ్య భవనాలపైన రూఫ్‌టాప్‌ ఫామ్‌లను నెలకొల్పి కూరగాయలు, ఆకుకూరలను పండిస్తోంది. ఇవి చిన్నా చితకా ఫామ్స్‌ కాదండోయ్‌.. మూడూ కలిపి 5.7 ఎకరాలు! బ్రూక్లిన్‌ గ్రేంజ్‌ సంస్థ ఆరంతస్థుల ‘లాంగ్‌ ఐలాండ్‌ సిటీ’ వాణిజ్య భవనంపై ఎకరం విస్తీర్ణంలో 2010లో తొలి సిటీ ఫామ్‌ను నిర్మించింది.

ప్రత్యేకంగా తయారు చేసుకున్న టన్నులకొద్దీ సేంద్రియ మట్టి మిశ్రమాన్ని భవనం శ్లాబ్‌పై పరిచి.. ఎత్తుమడులపై ఉద్యాన పంటలు పండిస్తోంది. వాన నీటి మొత్తాన్నీ వొడిసిపట్టుకొని, ఆ నీటితోనే పంటలు పండిస్తున్నారు. 2012లో 12 అంతస్తుల బ్రూక్లిన్‌ నేవీ యార్డ్‌ భవనంపై 1.5 ఎకరాల్లో సిటీ ఫామ్‌ను నెలకొల్పింది. 2019లో విస్తారమైన సన్‌సెట్‌ పార్క్‌ భవనంపై ఏకంగా 3.2 ఎకరాల్లో మట్టి పోసి పంటలు పండిస్తోంది. ఏటా 22,000 కిలోల సేంద్రియ కూరగాయల దిగుబడి పొందటం విశేషం. న్యూయార్క్‌  మాదిరిగానే అనేక ప్రపంచ నగరాలు నవతరం  ఆహారోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి!
– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com

చదవండి: భారీ వర్షాలు.. ఇంటి పంటలు.. ఎత్తు మడులు ఎంతో మేలు! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top