Dorothy Jane Scott Unsolved Mystery: డోరతి జేన్‌ హత్య.. ఇప్పటికీ మిస్టరీ గానే..!

The Tragic assassination Of Dorothy Jane Scott - Sakshi

కొన్ని పరిచయాలు నివురుగప్పిన నిప్పులై.. 
నీడలా వెంటాడుతూ.. 
నిర్దాక్షిణ్యంగా ఉసురు తీసేస్తాయి.
నిండు జీవితాన్ని నిలువునా కాల్చేస్తాయి. 
‘డోరతి జేన్‌ స్కాట్‌’ అనే సింగిల్‌ మదర్‌ హత్య కేసు కూడా అలాంటిదే. 

అది 1980 మే 28, రాత్రి 9 గంటలు. కాలిఫోర్నియాలో యు.సి. ఇర్విన్‌ మెడికల్‌ సెంటర్‌లోని వెయిటింగ్‌ హాల్లో డోరతి జేన్‌ స్కాట్‌(32) చాలా టెన్షన్‌ పడుతూ వెయిట్‌ చేస్తోంది. డాక్టర్‌ బయటికి ఎప్పుడు వస్తాడా? ఎలాంటి వార్త చెబుతాడా? అనేదే ఆమె భయం. ఎందుకంటే తన సహోద్యోగి బోస్ట్రాన్‌.. ఎమర్జెన్సీ వార్డ్‌లో చికిత్స పొందుతున్నాడు.

కాలిఫోర్నియాలోని స్టాంటన్‌లో తన నాలుగేళ్ల కొడుకు, అత్తతో కలసి జీవించేది డోరతి. తల్లిదండ్రులు ఉండే అనాహైమ్‌లోనే ఒక స్టోర్‌లో సెక్రటరీగా పని చేసేది. కొన్ని సార్లు తను పనికి వెళ్లేటప్పుడు తన బాబుని తల్లిదండ్రుల దగ్గరే వదిలి వెళ్లేది. తను డ్యూటీలో ఉండగానే బోస్ట్రాన్‌ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మరొక సహోద్యోగి పామ్‌ హెడ్‌ సాయంతో తన కారులోనే బోస్ట్రాన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చింది డోరతి. మొత్తానికి డాక్టర్‌ బయటికి వచ్చాడు. ‘భయపడాల్సిన పని లేదు.. బ్లాక్‌ విడో స్పైడర్‌ కరవడం వల్లే బోస్ట్రాన్‌ అస్వస్థతకు గురయ్యాడు.. చికిత్స పూర్తి అయ్యింది.

ఓ అరగంట తర్వాత ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు’ అని చెప్పాడు. ఊపిరి పీల్చుకుంది డోరతి. రాత్రి 11 దాటింది. బోస్ట్రాన్‌ చాలా నీరసంగా ఉండటంతో.. డిశ్చార్జ్‌ సమ్మరీ పూర్తి చేసేలోపు కారు తీసుకొస్తానని డోరతి పార్కింగ్‌ ఏరియాకి వెళ్లింది. అయితే సమ్మరీ పూర్తి అయ్యి.. చాలా సేపు అయినా డోరతి కారు తీసుకుని రాకపోవడంతో.. బోస్ట్రాన్, పామ్‌ హెడ్‌ పార్కింగ్‌ దగ్గరకు వెళ్లారు.

అప్పుడే డోరతి కారు వేగంగా వారి ముందు నుంచే దూసుకుపోయింది. కారు హెడ్‌లైట్స్‌ డైరెక్ట్‌గా వాళ్ల కళ్లల్లో పడటంతో.. డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్నదెవరో చూడలేదు. అయితే.. బాబుకి అత్యవసర పరిస్థితి వచ్చి డోరతి అంత వేగంగా తమని వదిలి వెళ్లి ఉంటుందని వాళ్లు భావించారు. మరునాడు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డోరతి కారు ఆసుపత్రికి పది మైళ్ల దూరంలో ఉన్న సందులో కాలిపోతున్నట్లు కనిపెట్టారు పోలీసులు. దాంతో డోరతి కిడ్నాప్‌ అంటూ కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

డోరతి నిబద్ధత కలిగిన క్రైస్తవురాలని.. సాయం చేయడంలో ముందుంటుందని, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లేవీ ఆమెకు లేవని సహోద్యోగులు, ‘డోరతికి అసలు బాయ్‌ఫ్రెండ్‌ కూడా లేడు’ అని డోరతి తండ్రి జాకబ్‌ చెప్పారు. తల్లి మాత్రం ఓ అజ్ఞాత కాలర్‌ గురించి వణుకుతూ చెప్పింది. నెల రోజులుగా ఏవో బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పింది. గట్టిగా అడిగితే ‘ఒక వ్యక్తి డోరతికి చాలాసార్లు కాల్‌ చేసి.. ‘‘నిన్ను ప్రేమిస్తున్నా, త్వరలో నిన్ను చంపేస్తా’’ అనేవాడట. ఆ మాటలను పట్టించుకోని డోరతి.. ఒక్కసారి మాత్రం చాలా భయపడింది.

ఎందుకంటే.. ఒకరోజు సడన్‌గా ఫోన్‌ చేసి ‘‘నీ కోసం బయట ఒకటి వెయిట్‌ చేస్తోంది.. వెళ్లు’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడట. వెళ్లి చూస్తే.. కారు విండ్‌షీల్డ్‌ పైన.. వాడిపోయిన గులాబీ ఉందట. ఆ రోజు నుంచే డోరతి భయపడటం మొదలుపెట్టింది. అప్పుడే నాకు ఆ వ్యక్తి ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్న విషయం చెప్పింది’ అంటూ జరిగింది రివీల్‌ చేసింది డోరతి తల్లి. ఆ భయంతోనే.. డోరతి తుపాకీ కొనాలని కూడా నిర్ణయించుకుందని, కిడ్నాప్‌కి వారం ముందే.. కరాటే క్లాసుల్లో చేరిందని ఆమె స్నేహితులు చెప్పారు.

అయితే కిడ్నాప్‌ అయిన వారం తర్వాత.. డోరతి తల్లికి చాలాసార్లు ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్స్‌ వచ్చాయి. ‘ఐ హావ్‌ హర్‌’ అని చెప్పి ఫోన్‌ పెట్టేసేవాడు. డోరతి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాల్స్‌ వచ్చేవి. ఒకవేళ డోరతి తండ్రి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఫోన్‌ కట్‌ అయ్యేది. క్రమం తప్పకుండా డోరతి తండ్రే ఫోన్‌ లిఫ్ట్‌ చేయడంతో ఆ వ్యక్తి కాల్‌ చేసి వేధించడం మానేశాడు. అయితే అధికారులు అతడి లొకేషన్‌ను ట్రాక్‌ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ.. ఆ వ్యక్తి అతి తక్కువ సేపే ఫోన్‌ మాట్లాడేసరికి ఆ ఫోన్‌ కాల్‌ ట్రాక్‌ చేయడానికి పోలీసులకు వీలు కాలేదు. ఇతర ప్రయత్నాలు ఎన్ని చేసినా డోరతి ఆచూకీ దొరకలేదు. నాలుగేళ్లు గడిచింది.

1984 ఆగష్టు 6న.. శాంటా అనా కాన్యన్‌ రోడ్‌ నుంచి ముప్పై అడుగుల దూరంలో మనిషి ఎముకలు ఉన్నాయని పోలీసులకు  చెప్పాడు ఓ వ్యక్తి. 1982లో ఆ ప్రాంతాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో దేహం పాక్షికంగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటితో పాటు ఒక ఉంగరం, వాచ్‌ దొరకడంతో ఆ అస్థిపంజరం డోరతిదేనని గుర్తించారు. శవ పరీక్షలో ఆమె మరణానికి గల కారణం తేలలేదు. అయితే ఎవరు చంపారు అనేది తెలియకపోయినా.. కచ్చితంగా ఫోన్‌ కాల్స్‌ చేసిన వ్యక్తే చంపి ఉంటాడని నమ్మారు చాలామంది. అందుకు బలమైన సాక్ష్యం లేకపోలేదు.

డోరతి మిస్సింగ్‌ తర్వాత ఎన్నో ప్రత్యేక కథనాలను ప్రచురించిన.. ‘ఆరెంజ్‌ కౌంటీ రిజిస్టర్‌’ అనే న్యూస్‌ పేపర్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌కి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్‌ చేశాడట. ‘నేను డోరతి స్కాట్‌ను చంపేశాను. ఆమె నా ప్రియురాలు. కానీ ఆమె నన్ను మోసం చేసింది. వేరొక వ్యక్తితో ఆమె ఉండటం నేను చూశాను. అలాంటిదేం లేదని ఆమె ఖండించింది. అయినా నేను ఆమెను చంపేశాను’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడట. 

అయితే ‘మే 28 రాత్రి బోస్ట్రాన్‌ను స్పైడర్‌ కరచిన విషయం ఆ కాలర్‌కి ముందే తెలుసు’ అనేది ఆ మేనేజింగ్‌ ఎడిటర్‌ ఉద్దేశం. అదీ నిజమై ఉండొచ్చు. ఏదిఏమైనా.. డోరతి మరణానికి కారణం ఎవరో? ఆ అజ్ఞాత వ్యక్తి పేరేంటో నేటికీ తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top