రికార్డ్‌: నజియ విజయం

Thiruvananthapuram girl Najiya enters India Book of Records for Warli paintings - Sakshi

ఎక్కడి కేరళ, ఎక్కడి మహారాష్ట్ర! కానీ కళకు దూరం ఎప్పుడూ భారం కాదు అని నిరూపించింది నజియ నవస్‌. తిరువనంతపురం(కేరళ)కు చెందిన నజియ ఇంటర్నెట్‌లో ఒకసారి వర్లీ పెయింటింగ్‌లను చూసి అబ్బురపడింది. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన వర్లీ ఆర్ట్‌ తనను ఎంత ఆకట్టుకుందంటే ఎలాగైనా సరే ఆ ఆర్ట్‌ నేర్చుకోవాలి అనుకునేంతగా!
అనుకోవడానికేం... ఎన్నయినా అనుకుంటుంటాం.

మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వర్లీ నేర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే అంతర్జాలాన్నే గురువుగా భావించి సాధన మొదలు పెట్టింది. దానికి ముందు ఎన్నో విషయాలను చదివి తెలుసుకుంది.
వర్లీ కళ అనేది అసామాన్య చిత్రకారుల సృష్టిలో నుంచి వచ్చింది కాదు. సామాన్య గిరిజనులే దాని సృష్టికర్తలు. మట్టిగుడిసెలను తమకు తోచిన కళతో అలంకరించేవారు. నిత్యం అందుబాటులో ఉన్న వస్తువులనే పెయింటింగ్స్‌ కోసం వాడేవారు. తరాలు మారుతున్న కొద్దీ ఈ కళ మరింత విస్తృతి పొందింది.
విశేషం ఏమింటే వర్లీ చిత్రాలలో ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను అవి చిత్రీకరిస్తాయి.

వర్లీ కళకు సంబంధించి రకాల విషయాలు తెలుసుకునే క్రమంలో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల నజియాలో పదింతలైంది. ఎట్టకేలకు తనకు ఇష్టమైన కళలలో పట్టు సాధించింది. ఇప్పటివరకు వందకు పైగా వర్లీ పెయింటింగ్స్‌ వేసింది. డిగ్రీ పూర్తి చేసిన నజియాకు తన అభిరుచి ఆదాయ మార్గంగా కూడా మారింది. ఆన్‌లైన్‌లో తన వర్లీ పెయింటింగ్‌లు అమ్ముతుంది.
తాజాగా 5 అంగుళాల పొడవు, వెడల్పైన వర్లీ పెయింటింగ్‌తో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది నజియ. గతంలో ఉన్న పది అంగుళాల పొడవు, వెడల్పయిన వర్లీ పెయింటింగ్‌ రికార్డ్‌ను నజియ బ్రేక్‌ చేసింది. ‘నేర్చుకున్నది చాలు’ అని అనుకోవడం లేదు నజియ. ముంబైకి వెళ్లి ఆ కళలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకుంటుంది.
‘కళను పట్టుదలగా నేర్చుకోవాలి. ఉదారంగా పంచాలి’ అంటారు.
వర్లీ కళను సొంతంగా నేర్చుకున్న నజియ ఇప్పుడు ఆ కళను ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగా నేర్పించడానికి రెడీ అవుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top