యద్భావం తద్భవతి | Think well on nature helps improve to your health | Sakshi
Sakshi News home page

యద్భావం తద్భవతి

Mar 23 2026 12:13 AM | Updated on Mar 23 2026 12:20 AM

Think well on nature helps improve to your health

తాత్త్వికథ

వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల  ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా  పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును  సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన  జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.

అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. 

వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.

ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి  వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.

‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా  పండింది?’ అని  అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని  ప్రార్థన చేశావో  నాకు చెప్పు!’ అన్నాడు.

నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. 

‘మనం మంచిగా  ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు  అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

Advertisement
 
Advertisement
Advertisement