breaking news
well future
-
యద్భావం తద్భవతి
వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా పండింది?’ అని అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని ప్రార్థన చేశావో నాకు చెప్పు!’ అన్నాడు.నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. ‘మనం మంచిగా ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి : చదువుతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సేవాసమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ విద్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఉంటే ఏదైనా సాదిం^è వచ్చన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చదువు దారి చూపిస్తుందన్నారు. విద్యాభివృద్ధికి విశ్వ కర్మ ఉద్యోగులు చేయూతనందించడం అభినందనీయమన్నారు. విశ్వకర్మ భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన విద్యార్థులకు బ్రిలియంట్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్య నాలుగు సంవత్సరాల పాటు ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. ఎవరూ దోచుకోలేనిది విద్య అని చెప్పారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. విశ్వకర్మలు నిర్మించుకునే భవనానికి బోరు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగ సేవాసమితి అధ్యక్షుడు యాదగిరాచారి, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్చారితో పలువురు పాల్గొన్నారు.


