న్యూస్‌మేకర్‌..: ఎవరెస్ట్‌కు హలో చెప్పింది

Ten year old girl Rhythm Mamania from Mumbai summits Everest base camp - Sakshi

పదేళ్ల అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే కన్నేసి పెడతాం. స్కూల్‌ నుంచి వచ్చే వరకూ ఎదురు చూస్తాం. పార్క్‌కు వెళ్తానంటే తోడు వెళ్తాం. కాని ఎవరెస్ట్‌ వరకూ వెళ్తానంటే? ముంబై చిన్నారి పదేళ్ల రిథమ్‌ మమానియా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరిన చిచ్చర పిడుగుగా రికార్డు సృష్టించింది. నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు కాలి నడకన ఎక్కి దిగిన రిథమ్‌మొత్తం 128 కిలోమీటర్లను చిట్టి పాదాలతో గెలిచేసింది. ఊరు దాటడానికి కూడా బద్దకించే వారిని చూసి పకపకా నవ్వింది.

సాహసం ఎవరి సొత్తూ కాదు... భయాన్ని దాటి విజయాన్ని సాధించడం మాకూ చేతనవును అని ఇటీవల ఎందరో భారతీయ స్త్రీలు ఎవరెస్ట్‌ను అధిరోహించి, బేస్‌ క్యాంప్‌ వరకూ చేరుకుని నిరూపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో, అనూహ్యమైన వాతావరణంలో, బృందాలుగా లేదా ఒకరిద్దరి సహాయంతో వారు ఈ సాహసాలు చేస్తున్నారు. కేరళ నుంచి నుంచి కశ్మీర్‌ వరకూ ఈ దారిలో ఉన్న వనితలు ఎందరో ఉన్నారు.

1983లో బచేంద్రి పాల్‌ ఎవరెస్ట్‌ అధిరోహించిన మొదటి భారతీయ వనితగా ఖ్యాతి గడించినప్పటి నుంచి ఆ స్ఫూర్తిని ఎందరో కొనసాగిస్తున్నారు. మన ఖమ్మంకు చెందిన పూర్ణ అతి తక్కువ వయసులో ఎవరెస్ట్‌ అధిరోహించిన అమ్మాయిగా రికార్డు సాధిస్తే ఇటీవల భువనగిరికి చెందిన అన్విత రెడ్డి ఎవరెస్ట్‌ను అధిరోహించి తెలుగువారి ఘనతను మరోసారి చాటింది. 53 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ ఎక్కిన సంగీత భెల్‌ స్ఫూర్తినిస్తే 10 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వరకూ వెళ్లి తనదైన రికార్డు సాధించింది రిథమ్‌ మమానియా.

స్కేటింగ్‌ నుంచి
రిథమ్‌ మమానియాకు ముంబై వండర్‌కిడ్‌గా పేరు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న రిథమ్‌కు ఎవరెస్ట్‌ గురించి తల్లిదండ్రులు చెప్పినప్పుడల్లా అక్కడకు వెళ్లాలన్న కుతూహలం కలిగేది. ఆటపాటల్లో, స్కేటింగ్‌లో ఎంతో ప్రతిభ చూపే రిథమ్‌ను తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్‌ ఆమెను నిరుత్సాహ పరచలేదు. ఎనిమిదేళ్లు వచ్చాక ఆమెను తరచూ సహ్యాద్రి పర్వతాలలోకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లేవారు. ‘దూద్‌సాగర్‌’కు అలసట లేకుండా రిథమ్‌ నడిచినప్పుడు ఎవరెస్ట్‌ కలను నిజం చేయడానికి సహకరిద్దాం అని నిశ్చయించుకున్నారు. మొన్నటి ఏప్రిల్‌ చివరి వారంలో అందుకు శ్రీకారం చుట్టారు.

నేపాల్‌ లుక్లా నుంచి
నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకునేవారు, ఎవరెస్ట్‌ను అధిరోహించేవారు ఉంటారు. రిథమ్‌ కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంది. లుక్లా సముద్ర మట్టానికి 9,318 అడుగులు ఉంటే అక్కడి నుంచి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ 8,280 అడుగులు ఉంటుంది (బేస్‌ క్యాంప్‌ సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తు). కురిసే మంచు, మైనస్‌ 10 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ కొరత ఇలాంటి రిస్క్‌లు ఎన్ని ఉన్నా లుక్లా నుంచి కాలిమార్గాన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు తల్లిదండ్రుల తోడుతో ఏప్రిల్‌ 25న బయలుదేరింది రిథమ్‌.

ఇందుకు నేపాల్‌లోని ఒక అడ్వంచర్స్‌ సంస్థ గైడ్‌గా వ్యవహరించింది. పోను 64 కి.మీ రాను 64 కి.మీ. దూరాన్ని మే 6న 11 రోజుల్లో పూర్తి చేసింది రిథమ్‌. ఆమెతో కలిసి వెళ్లిన బృందం తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నా రిథమ్‌ నడక ద్వారానే తిరిగి లుక్లా చేరుకుంది. అంటే సంపూర్ణంగా తను ఆ దారిలోని కష్టనష్టాలను భరించింది. ఇంత చిన్న వయసులో ఇదంతా సాధించడం సామాన్యం కాదు.

అనుకున్నది సాధించండి
అనుకున్నది సాధించాలని గట్టిగా అనుకోండి. మీ కలలను ఆపవద్దు. వాటిని నెరవేర్చుకోండి అంది రిథమ్‌. మన వల్ల అవుతుందా మనం చేయగలమా అనే సందేహాలు ఉన్న ఎందరో ఈ మాట నుంచి స్ఫూర్తి పొందాలి. అనుకున్నది సాధించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top