
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్‌ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్‌ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.
’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్‌బంక్‌ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.
రాష్ట్రంలోనే మూడోది...
మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.
రైతుల ముంగిట్లోకి ఎరువులు
వానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.
అద్దెకు ఆర్టీసీ బస్సులు
మహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.
ఇక సోలార్ పవర్
పెట్రోల్ బంక్‌లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి.
– అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల
ఉపాధి పొందుతున్నాం
మేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.
– పందిర్ల సునీత, ఆవునూర్
ఎంతో గర్వంగా ఉంది
పెట్రోల్ బ్యాంక్‌ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్‌గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం.
– సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేట
మహిళా శక్తిని చాటారు
ఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్‌మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం.
– సందీప్‌కుమార్ ఝా, జిల్లా కలెక్టర్