
ముంబైలోని మార్వేలో జరిగిన జాతీయ జూనియర్ టోర్నీ
4 స్వర్ణాలు మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటిన రాష్ట్ర సెయిలర్లు
ఆకట్టుకున్న హైదరాబాద్ బాలికల సెయిలింగ్ నైపుణ్యాలు
సాక్షి, సిటీబ్యూరో: గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు బంగారు పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్‌పురాలోని ఉద్భవ్ స్కూల్‌కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్–16 సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం గెలిచింది. మొత్తం 9 రేసుల రెగెట్టాలో 4 రేసుల్లో మొదటి స్థానం, రెండు రేసుల్లో రెండో స్థానంతో 13 పాయింట్లతో 2025 జాతీయ చాంపియన్‌గా నిలిచింది. అదే స్కూల్‌కు చెందిన తనూజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్‌లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో చివరి రోజు రెండు రేసులను గెలిచి నేషనల్ చాంపియన్స్ అయ్యారు.
ఇదీ చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
అండర్–15 బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ బంగారు పతకం నెగ్గగా, రిజ్వాన్ మహమ్మద్ రజతం, రవి కుమార్ కాంస్యం గెలిచారు. ఒక ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన ముగ్గురు సెయిలర్లు పోడియంపైకి రావడం ఇదే తొలిసారి. ఉద్భవ్ స్కూల్‌కు చెందిన చంద్రలేఖ తట్టారి తొలిసారి కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా అండర్–16 సబ్ జూనియర్స్ పోడియంపైకి వచ్చిన ఆరుగురు సెయిలర్లలో ఐదుగురు తెలంగాణ క్రీడాకారులే కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్ యాచ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహీమ్ షేక్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో
గతేడాది నుంచి తాము చేసిన ఫిట్‌నెస్, న్యూట్రిషన్, సైద్ధాంతిక శిక్షణ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. నేషనల్స్‌లో టాప్–14లో ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రం వాళ్లే ఉండటం తమ శిక్షణ ఫలితమని, ఇది ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపాడు. జూన్‌లో జరిగే లాంగ్‌కవి ఇంటర్నేషనల్ టోర్నీ కోసం ఎంపికైన సెయిలర్స్ జాబితా త్వరలో విడుదల కానుంది. తెలంగాణ నుంచి కనీసం ఏడుగురు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సెయిలర్స్ షిల్లాంగ్‌లో జరిగే జాతీయ ర్యాంకింగ్ రెగెట్టాలో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో జరిగే మాన్‌సూన్ రెగెట్టా ట్రోఫీలోనూ బరిలో నిలవనున్నారు.