
అప్పు చేసి ఇ–రిక్షా కొన్నాడు సుమిత్ తండ్రి. ఆ అప్పు తీరకుండానే ఆయన మంచం పట్టాడు.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్ ప్రజాపతి( Sumit Prajapati) కు ఇ–రిక్షాయే దిక్కు అయింది. దిక్సూచి అయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 22 సంవత్సరాల సుమిత్ ప్రజాపతి ఇ–రిక్షాను సోషల్ మీడియా సెంటర్‌గా చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు...
గ్యాస్‌స్టవ్ వెలిగించే క్రమంలో సుమిత్ తండ్రి అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం వల్ల అతడు రిక్షా నడపలేని పరిస్థితి. మరోవైపు రిక్షా కోసం చేసిన అప్పులు. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తూనే ‘ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
పేదరికం వల్ల చిన్నప్పుడు పొలం పనులు, కూలీ పనులు చేశాడు సుమిత్. కార్లు కడిగాడు. కూరగాయలు అమ్మాడు. తన పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదని ఎన్నో పనులు చేశాడు. ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అయితే విధి నిర్ణయం మరోలా ఉంది’ అంటాడు సుమిత్.
తండ్రికి ఆసరాగా ఉండడానికి ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరాడు. చెప్పిన జీతంలో సగం జీతం కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగం మానేయ్యడమే కాదు ఇక ఎప్పుడూ ఉద్యోగం చేయకూడదనుకున్నాడు. చాలామంది యువకులలాగే సుమిత్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు. తండ్రి ప్రమాదానికి గురి కావడంతో ఇ–రిక్షా నడపాలనుకున్నాడు సుమిత్. ‘ఇ–రిక్షా, సోషల్ మీడియాను ఒకేచోట చేరిస్తే’ అనే దిశలో ఆలోచించాడు. కార్లు, బైక్‌లపై కంటెంట్‌ను క్రియేట్ చేసేవారు ఉన్నారు. ఇ–రిక్షాపై ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది అనుకున్నాడు.
‘నా రిక్షాను స్టార్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను’ నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుమిత్. కంటెంట్ క్రియేటర్‌గా అతడి వైరల్ మూమెంట్ గురించి చెప్పుకోవాలంటే...తన కుటుంబసభ్యులు ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ వచ్చాయి.
‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వీడియోలు ఏమిటి! నిన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వెక్కిరిస్తారు’ అని తండ్రి అన్నాడు. కొన్ని అనుభవాల తరువాత ఆయన మాటలు వాస్తవం అనే విషయం అర్థమైంది. ‘ప్రజలు చిన్న చూపు చూడకుండా, అభిమానించేలా కంటెంట్ క్రియేషన్ చేయాలి’ అనుకున్నాడు. నవ్వించడానికి ఒకప్పుడు ఏవేవో వీడియోలు చేసిన సుమిత్ ఆ తరువాత రూట్ మార్చాడు. వ్యక్తిత్వవికాస వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రాండ్‌లకు సంబంధించి రిక్షాలో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.
‘ఏ పనీ చిన్నది కాదు. మనం చేసే ప్రతి పని పెద్దదే. గౌరవనీయమైనదే’... ఇలాంటి మాటలెన్నో తన వ్యక్తిత్వ వికాస వీడియోల్లో వినిపిస్తుంటాడు సుమిత్. తాజా విషయానికి వస్తే...తనకు వచ్చే ఆదాయంతో సుమిత్ కుటుంబ అప్పులన్నీ తీర్చాడు. చెల్లిని చదివిస్తున్నాడు. సుమిత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 87వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
చదవండి : ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
మొదట చిన్న లక్ష్యాలు... ఆ తరువాత పెద్ద లక్ష్యాలు
ఇక నా పనిఅయిపోయినట్లే’ అని నేను ఎప్పుడూ నిరాశపడలేదు. నిలదొక్కుకోవడం కోసం ఎంత చిన్న పనైనా చేయాలనుకున్నాను. కూలి పనులు కూడా చేశాను. ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాను. అప్పుల భారంతో మా సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి ఆ ఇంటిని కొనాలనేది నా కల. – సుమిత్ ప్రజాపతి