ఇప్పటికీ సమాజం మనిషి ధరించే వేషధారణతోనే అంచనా వేసేస్తుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే "డోంట్ జడ్జ్ బై కవర్" అన్న నానుడిని విస్మరిస్తుంటారు ఎందుకనో. ఒక వ్యక్తి తనకు సౌకర్యవంతమైన వస్త్రధారణలో ఉండటం అనేది అతడు లేదా ఆమె హక్కు. దాంతోనే అనాగరికులను ఎలా నిర్ణయించేస్తారు అని ప్రశ్నిస్తున్నారు రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపుకుడి భార్య సుధామూర్తి. చీర ధరించడంతో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారామె. మనం ధరించే దుస్తులు మనిషి తెలివితేటలు, సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయా? అని నిలదీస్తూ..తన అనుభవాన్ని పంచుకున్నారు ఇలా..!.
ఇన్‌ఫ్లుయెన్సర్ ఐశ్వర్య డీకేఎస్ హెగ్డేతో జరిగిన సంభాషణలో వృత్తిపరమైన స్మార్ట్‌గా, శక్తిమంతంగా కనిపించాలంటే సూట్లు ధరించాల్సిన పనిలేదని సవాలు విసురుతూ తన అనుభవాలను పంచుకున్నారు సుధామూర్తి. చాలామంది మహిళలు బోర్డురూమ్‌కి చీరలు ధరించే వెళ్లాలని కోరుకుంటున్నా అని అన్నారామె. ఈ మేరు హెగ్డే చీరలు ధరించడంలో తన సొంత అనుభవం గురించి కూడా మాట్లాడిందామె. మహిళలు తమ శరీరాకృతితో సంబంధం లేకుండా సులభంగా ఎంచుకోగల వస్త్రధారణ చీర అని అన్నారమె.
తనకు సరిపోయే దుస్తుల సెట్ దొరక్కపోతే..అమ్మ చీర కనిపించినా కట్టుకుంటానని అన్నారామె. ఎందుకంటే చీర సార్వత్రికమైనదని, దానికి సైజుతో సంబంధం ఉండదు. ఎవ్వరైనా ఇట్టే ధరించి, ఆత్మవిశ్వాసంతో బయటకెళ్లొచ్చు అని అన్నారామె. కానీ కార్పొరేట్ వాతావరణంలో తరుచుగా పాశ్చాత్య ఫార్మల్ దుస్తులను అధికారంతో ఎందుకు ముడిపెడతారని ప్రశ్నించింది కూడా. దానికి మూర్తి ఇలా సమాధానమిచ్చారు. ఎందుకంటే సూట్ వేసుకుంటే స్మార్ట్‌గా కనిపిస్తారు. అదే చీర కట్టుకున్నా..స్మార్ట్‌గా ఉన్నానంటే ఎవ్వరు ఒప్పుకోరు.
పైగా ఆ క్రమంలో తనకెదురైన అనుభవం గురించి కూడా మాట్లాడారామె. తాను చాలాసార్లు చీర కట్టుకుని విమానాశ్రయానికి వెళ్తే..ప్రజలంతా తనను బెహన్‌జీ అని వ్యగ్యంగా పిలుస్తారని అన్నారామె. తన వేషధారణతోనే తనకు ఇంగ్లీష్ రాదని, జ్ఞానం లేదని నిర్ణయించేస్తారని చెప్పారామె. ప్రజలు తన సామర్థ్యాలను అంచనా వేసే విధానంపై ఎందుకు ప్రభావితమవ్వాలని కూడా ప్రశ్నించారామె. తన దృష్టిలో జ్ఞానం, వస్త్రధారణ అనేవి వేర్వేరు విషయాలని, తనకున్న జ్ఞానానికి ధరించే దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారామె.
చీర ఎప్పటికీ ఎవర్ గ్రీన్ . అది చూడముచ్చటగా కనిపిస్తుంది కూడా అని అన్నారామె. అదీగాక ఎంతో కాలంగా మనతో ముడివేసుకున్న సంస్కృతి కూడా అని అన్నారామె. నెటిజన్లు కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ..నిజమైన స్ఫూర్తి మీరే మేడమ్!.. మీరు అంతరంగీకంగా, బాహ్యంగా స్మార్టే మేడమ్ అని ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. దీంతోనైనా ప్రజలెప్పుడూ దుస్తులు, రూపం ఆధారంగా అంచనావేసే అలవాటు మానుకుంటారన్నారు.
ఇదీ చదవండి: ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగాన్ని వద్దని పీతలు అమ్ముతూ..రోజుకి రూ. 14 లక్షలు!


