మనసు చలించి జడ దానం.. గ్రేట్‌ కదా..!

Sravya Manasa Hair Donation to Cancer Patients - Sakshi

కీమో థెరపితో జుత్తు కోల్పోయిన క్యాన్సర్‌ రోగులకు ఊరట

నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్‌ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్‌డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పేరొందింది.

బీటెక్, ఎంటెక్‌ తర్వాత మాస్టర్‌ ఇన్‌ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్‌ డొనేషన్‌ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

సుమధుర ఆర్ట్‌ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని  ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు.
– పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top