
కరీంనగర్‌కల్చరల్: శ్రావణం..సకల సౌభాగ్యాలు, సకల శుభాలు ప్రసాదించే మాసం. లక్ష్మీ కటాక్షం ఉంటే అన్నింటా అభివృద్ధి, అంతులేని సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాలక్ష్మి ప్రాణనాథుడు శ్రీమహావిషు్టవు జన్మనక్షత్రమైన శ్రావణం పేరుతో శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శని వారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. మంగళగౌరీ వ్రతం, నాగులపంచమి, భానుసప్తమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహజయంతి, వరలక్ష్మీవ్రతం, జంధ్యాలపౌర్ణమి, పొలాల అమావాస్య పండుగలు జరుపుకుంటారు
ప్రకృతి మాసం
ప్రకృతిమాసమైన శ్రావణమాసంలో వర్షరుతువు ప్రభావం వల్ల ఎక్కడ చూసిన జలకళ కనిపిస్తుంది. ప్రకృతి మాత నిండుగ పచ్చదనంతో పరవశించి పోతుంది. భూమిపై ఉన్న మలినాలు, క్రిములు, కీటకాలు, వర్షపు నీటికి కొట్టుకుపోయి శుభ్రంగా కనిపిస్తోంది. చెట్లు పచ్చగా చూపరులకు కనువిందు చేస్తుంటాయి. పర్వదినాలతో పాటు నోములు, వత్రాలకు అనూకులమైన మాసం కావడటంతో మహిళలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.
శివునికి ప్రతీకరమైన మాసం
శ్రావణ మాసంలో ప్రతీ సోమవారం శివునికి ప్రతీకరమైనది. శివ భక్తులు ఈ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు ఉపవాస దీక్ష ఉండి అభిషేకం, నమక చమక రుద్రాభిషేకం శివపురాణం, శివలింగానికి ఫల,పంచామృత,క్షీరాభిషేకాలు చేస్తారు.
సమస్త శుభకార్యాలు చేసుకోవచ్చు
ఆధ్యాత్మిక జీవనంలో విజ్ఞాన శాస్త్రం కలిసి ఉంటుంది. ప్రతీ వ్యక్తి శ్రావణమాసంలో హిందూ, వెదిక, సనాతన సంప్రదాయాన్ని, ఆచారాలు పాటిస్తే ఆధ్యాత్మిక, ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు. ఈ మాసంలో సమస్త శుభకార్యాలు జరుపుకోవచ్చు.
– నమిలికొండ రమణాచార్యులు, ప్రముఖ ఆగమశాస్త్ర పండితుడు
ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, మామిడి తోరణాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. మొదటి శ్రావణ శుక్రవారం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అలాగే చైతన్యపురి మహాశక్తి ఆలయం, నగునూరి దుర్గాభవానీ ఆలయాల్లో శ్రావణ మాసం ఏర్పాట్లు చేశారు.