
శ్రావణ మాసం అంటేనే పండుగలు, కళ్యాణ వైభోగాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉండే మన ఆచార వ్యవహారాలు సైన్సుకే అందని విషయాలను వివరిస్తాయి. ప్రతిదాంట్లో సంప్రదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంల వరాలిచ్చే వరలక్ష్మీ దేవిని కొలిచే మహిళల కట్టు, బొట్టు, తినే ఆహారం ఇలా ప్రతిదాంట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలా ఎందుకో సవివరంగా తెలుసుకుందామా.!.
శ్రావణ మాసంలో భారతీయ వివాహితలు ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. ఇది వారి సంతోషకరమైన, సుసంపన్నమైన వైవాహిక స్థితిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభప్రదమని, సంతానోత్పత్తికి సంబంధించినదని వారి నమ్మకం. అంతేకాదు, తమ శ్రేయస్సుకు, అదృష్టానికి, ప్రకృతి పునరుద్ధరణకు ప్రతీకగా ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు.
వర్షాకాలంలో వాతావరణం ప్రశాంత శక్తితో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగ సమతౌల్యతను కలిగిస్తుంది. అన్యోన్యతకు సూచికగా, సంప్రదాయం, ఆరోగ్యం, భక్తిని ఒకే వరసక్రమంలో పరిచయం చేసే శక్తి ఆకుపచ్చ రంగుకు ఉంటుంది. గాజుల శబ్దం ప్రతికూలతను దూరం చేస్తుందని నమ్మకం. శివ–శక్తి దైవిక ఐక్యతను ప్రతిబింబించే సామరస్యాన్ని కూడా సూచిస్తుందనే భావన దీనిలో ఇమిడి ఉంది.
ఫలవంతమైన ఎంపిక
శ్రావణ మాసం వర్షాకాలం కనుక అలెర్జీలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సి–విటమిన్ సమృద్ధిగా లభించే పండ్లు తీసుకోవాలి. అలాగే, జీర్ణక్రియకు మేలు చేసేవీ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. నారింజలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అయితే, రసాయనాల గాఢత లేని వాటిని ఎంచుకోవడం మేలు. అరటిపండు శక్తినిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయపడుతుంది. ఈ మాసంలో అరటిపండు వాడకం విరివిగా కనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి మలబద్ధక నివారిణిగా కూడా పనిచేస్తుంది.