గోల్డెన్‌ లేడీ | Special Story About Flight Lieutenant Shivangi Singh | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ లేడీ

Sep 25 2020 4:41 AM | Updated on Sep 25 2020 4:41 AM

Special Story About Flight Lieutenant Shivangi Singh - Sakshi

మహిళా పైలటా!! రఫేల్‌ యుద్ధ విమానానికి!! వ్హారెవా.. ఎవరామె? అవని? భావన? మోహన? ఫస్ట్‌ బ్యాచ్‌ ఫైటర్స్‌ ఈ ముగ్గురేగా! వీళ్లలో ఎవరో ఎయిర్‌ ఫోర్స్‌ చెప్పలేదు. ఎన్నాళ్లని దాస్తుంది?! శివాంగిని  ఎన్నాళ్లని దాస్తుంది? ఎస్‌.. శివాంగీ సింగ్‌!! సెకండ్‌ బ్యాచ్‌ ఫైటర్‌ పైలట్‌. ‘గోల్డెన్‌ యారోస్‌’ స్థావరానికి.. శిక్షణ కోసం వెళ్తున్న ఫస్ట్‌ లేడీ. 

ఆడపిల్లపై ఖర్చు పెట్టడానికి ఎన్ని కూడికలు, తీసివేతలు! చదువుకింత. ఓ మై గాడ్‌. కోచింగ్‌కి ఇంత. దేవుడా! చేసే ఖర్చంతా పోయేది గానీ.. వచ్చేదా, వడ్డీ తెచ్చేదా? ఇప్పుడెవరూ ఇలా ఆలోచించడం లేదనకండి. మీరు నయం కావచ్చు. మీకు తెలిసినవాళ్లు ఆడపిల్లల్ని చక్కగా చదివిస్తుండొచ్చు. ఆడపిల్లపై ఖర్చు పెట్టలేని, పెట్టాలనిపించని ఇళ్లు నేటికీ ఉన్నాయి. ధైర్యం లేకపోవడం కాదు. అమ్మాయిపై నమ్మకం లేకపోవడం. బాగా చదవకపోతే?! కోచింగ్‌ తీసుకున్నా ర్యాంక్‌ రాకపోతే?! అప్పు చేసి చదివిస్తున్నవారికి ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలి మరి? ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడా అరువు తీసుకోవాలి. వీటినెవరిస్తారు? ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ని చూడండి. ధైర్యం, నమ్మకం రెండూ వస్తాయి. ఫ్రాన్స్‌ నుంచి భూతాల్లాంటి పెద్ద యుద్ధ విమానాల్ని తెప్పించుకున్నాం కదా! వాటిని నడపడానికి ఓ అమ్మాయికి ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ ఇవ్వబోతోంది భారత వైమానిక దళం. ఆ అమ్మాయే శివాంగీ సింగ్‌. ఆమె శిక్షణకు అయ్యే ఖర్చెంతో తెలుసా?15 కోట్ల రూపాయలు. ఆడపిల్లల సామర్థ్యంపై నమ్మకం ఉంటే డబ్బు ఒక లెక్కలోకి రాదు.. ఇళ్లకైనా, దేశానికైనా. 

హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరంలో (మారుపేరు: గోల్డెన్‌ యారోస్‌)లో ఉన్నాయి రఫేల్‌ యుద్ధ విమానాలు. శిక్షణ కోసం అక్కడికి పంపిస్తున్నారు శివాంగీ సింగ్‌ని. అంతకన్నా ముందు ఆమెకు ‘కన్‌వర్షన్‌ ట్రైనింగ్‌’ ఇస్తారు. శివాంగి ఇప్పటివరకు మిగ్‌–21 ‘బైసన్‌’ విమానాల్ని నడిపారు. పాతకాలపు యుద్ధ విమానాలవి. కానీ అత్యంత సామర్థ్యం కలవి, నడపడంలో నైపుణ్యం అవసరమైనవి. గత ఏడాది వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ నడిపిన మోడల్‌ ఇదే. ల్యాండింగ్‌లో, టేకాఫ్‌లో గంటకు 350 కి.మీ అత్యంత వేగంతో క్షణాల్లో శక్తిని పుంజుకుని, నియంత్రించుకోగల ఈ మిగ్‌ 21 లనే ప్రస్తుతం రాజస్థాన్‌ వైమానిక స్థావరంలో ఆపరేట్‌ చేస్తున్నారు శివాంగి.

పురాతనమైన మిగ్‌లోంచి దిగి, అత్యాధునికమైన రఫేల్‌ని ఎక్కడానికి ప్రాథమిక శిక్షణ కొంత అవసరం. అదయ్యాక రఫేల్‌ను నడిపే శిక్షణ ప్రారంభం అవుతుంది. రఫేల్‌కు తొలి మహిళా పైలట్‌గా తన కూతురు ఎంపికైన సంతోషం సీమా సింగ్‌లో అంతకన్నా ముందే ప్రారంభం అయింది. యుద్ధ వాతావరణంలా, యుద్ధ విమానాన్ని మన అమ్మాయి నడపబోతోందన్న ఉద్వేగ పూరిత వాతావరణం ప్రస్తుతం వారణాసిలో నెలకొని ఉంది. అంబరాన్ని అంటిన సంబరం అంటుంటారు. అలాంటిదే. శివాంగి తండ్రి కుమరేశ్వర్‌ సింగ్‌ పుత్రికోత్సాహంతో మేఘాల్లో ఉన్నారు. శివాంగి తమ్ముడు మయాంక్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. కాలేజ్‌లో ఇప్పుడతడు రఫేల్‌ను డీల్‌ చేయబోతున్న ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ శివాంగి తమ్ముడు. ఆ ఇల్లే కాదు.. రఫేల్‌ తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించబోతున్న శివాంగిని చూసి దేశం కూడా గర్విస్తోంది. 

శివాంగి ఎయిర్‌ ఫోర్స్‌లోకి రెండో బ్యాచ్‌ ఫైటర్‌ పైలట్‌గా వచ్చారు. మొదటి బ్యాచ్‌ 2016లో అవని, భావన, మోహనలది. అంతకు ముందువరకు ఎయిర్‌ ఫోర్స్‌లో ఫైటర్‌ పైలట్‌లుగా మహిళలు లేరు. ఆ ముగ్గురు అమ్మాయిలదే రికార్డు. అదే ఏడాది శివాంగి హైదరాబాద్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ కోసం చేరారు. అప్పటికే నాలుగేళ్ల క్రితమే ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ టీమ్‌లో ఆమె ఉన్నారు. మూడేళ్లు బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఎన్‌.సి.సి. క్యాడెట్‌గా ఉన్నారు. ఇదంతా బియస్సీ చదువుతున్నప్పుడు. డిగ్రీ అయ్యాక, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొంది 2017 డిసెంబర్‌ 16న ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా బయటికి వచ్చారు. పాఠశాల చదువంతా వారణాసిలోనే. ప్రస్తుతం వైమానిక దళంలో పదంటే పదేమంది మహిళా ఫైటర్‌ పైలట్‌లు ఉండగా వాళ్లందరి చుట్టూ తిరిగి శివాంగి చేతికి రఫేల్‌ రావడం అపురూపమైన అవకాశమే.  

 ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ శివాంగీ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement