
ఆధునికత వైపు రైతన్నల అడుగులు
డ్రోన్లతో పంటలకు మందుల పిచికారి
ఎకరాకు కేవలం పది నిమిషాల్లో పూర్తి
టెక్నాలజీ బాటలో ఉమ్మడి శామీర్‌పేట రైతులు
యంత్రం.. సాగుకు తంత్రం అన్న విషయాన్ని ఉమ్మడి శామీర్‌పేట రైతులు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేలైన దిగుబడులను రాబడుతున్నారు. ఎకరాకు గంటల సమయం పట్టే మందుల పిచికారీకి డ్రోన్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దుక్కుల నుంచి మొదలు కోతల వరకూ అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లకు రైస్ ట్రాన్స్ ప్లాంటర్, డ్రమ్ సీడర్, మందు పిచికారీకి డ్రోన్‌లు, స్ప్రేయర్లు వంటివి వినియోగిస్తున్నారు. – శామీర్‌పేట
ఉమ్మడిశామీర్‌పేట మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయల సాగు పెరిగింది. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటకు కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తున్నాయి.
చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందులు కూడా వృథా కావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కూలీలు చేసే పని ఒక్క డ్రోన్ చేస్తుంది. దీంతో ఇటు సమయం.. ఆటు డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఎకరాకు 10 నిమిషాలు..
డ్రోన్ సహాయంతో ఎకరా పంటకు 10 నిమిషాల్లో మందులు పిచికారి పూర్తవుతుంది. నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. దీనికి యూరియా స్ప్రే చేయించాలంటే ఇద్దరు కూలీలు ఒక రోజంతా కష్టపడాలి. డ్రోన్ సాయంతో నాలుగు ఎకరాలకు గంటలో పూర్తిచేశాం. ఎకరాకు డ్రోన్ అద్దె రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. – సంజీవరెడ్డి, రైతు, అలియాబాద్
వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. పొరుగు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలపై అధారపడాల్సి వస్తోంది. డ్రోన్ స్ప్రే ద్వారా ఎకరాకు 10 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదాతో పాటు కూలీల సమస్య తీరుతుంది. డ్రోన్ అద్దెకు తీసుకోవడంతో ఖర్చులు తగ్గుతాయి. – రమేష్ వ్యవసాయ అధికారి, శామీర్‌పేట