పర్వతాలు పిలిచాయి

Shalini Singh becomes the first female NCC cadet to complete mountaineering course - Sakshi

ఫస్ట్‌ టైమ్‌

‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్‌ మ్యూర్‌. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్‌....

లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్‌ పీజీ కాలేజీలో శాలిని సింగ్‌ బీఏ స్టూడెంట్‌. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని.  19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్‌ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు.

ఎన్‌సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్‌ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్‌ సీనియర్‌ వింగ్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌. అడ్వాన్స్‌డ్‌ మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్‌ మౌంటెనీరింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

జమ్ములోని పహల్‌గామ్‌లో గత సంవత్సరం బేసిక్‌ మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్‌డ్‌ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్‌ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు.

కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్‌ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని.  ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్‌. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్‌ పునీత్‌ శ్రీవాస్తవ.

‘శాలిని విజయం ఎన్‌సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్‌ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్‌. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని.

ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్‌ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top