ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి! | Saylee Padwal Therapy Dolls How to Use for Depression in Childrenin Effective way | Sakshi
Sakshi News home page

Saylee Padwal ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!

Jul 12 2025 10:34 AM | Updated on Jul 12 2025 11:55 AM

Saylee Padwal Therapy Dolls How to Use for Depression in Childrenin Effective way

బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న  పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్‌లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’  అంటుంది 34 ఏళ్ల శైలీ  పాడ్వాల్‌ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే  అంటున్న శైలీ పరిచయం. 

‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్‌. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్‌ మార్ట్‌ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్‌... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్‌.

ఫ్యాషన్‌ డిజైనర్‌గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి.  ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.

ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ  ప్యాకెట్‌ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్‌డాల్‌ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.

అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్‌ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.

చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్‌ గ్రాండ్‌ మలేషియా సంచలన ఆరోపణలు!

పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్‌ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.

‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.

ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement