
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ మలేషియాలోని ఒక భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఆశీర్వాదం నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అనుచితంగా తాకాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. దీంతో నెట్టింట ఎవరీమె అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ లిషల్లిని కనారన్ తెలుసుకుందామాం.
లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేతగా నిలిచింది. ఆమె టీవీ నటి, మోడల్. మలేషియాలోని సెలంగోర్‌కు చెందిన లిషల్లిని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రెహమాన్ (UTAR)లో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాలేజీ విద్యార్థినిగా ఉన్నపుడే మిస్ గ్రాండ్ సెలంగోర్ 2020 టైటిల్ గెలుచుకుందిట. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత, లిషా పేదరికం , పిల్లల విద్య కోసం పనిచేయాలని భావించింది. అలాగే 2023లో విడుదలైన మలేషియా టీవీ సిరీస్ జీయుమ్ నీయుమ్‌లో కనిపించింది. స్థానిక ప్లాట్‌ఫామ్ ఆస్ట్రో విన్మీన్‌లో ప్రసారం అవుతున్న థిగిల్ అనే వెబ్ షోలో కనిపించింది. లిషల్లినికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు
పూజారిపై ఆమె ఆరోపణలు
తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో, తాను పూర్తిగా పూజారిని నమ్మినట్టు పేర్కొంది. "నేను వీటన్నింటికీ కొత్త. ఆచారాల గురించి పెద్దగా తెలియదు తన వేధింపుల పర్వాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. "ఆ రోజు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూంకు పిలిచిన పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, రక్షణ దారం అంటూ నీటిని తనపై పోశాడని వెల్లడించింది. తనను బట్టలు విప్పమని చెప్పాడని, పైగా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నాఅన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించినందుకు పూజారి తనను దూషించాడని కూడా వెల్లడించింది. దీంతో తాను స్తంభించి పోయాననీ, ఏం జరుగుతుందో అర్థం కాలేదని వాపోయింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వెల్లడించింది. మరోవైపు నిందితుడు పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.