మరుగుదొడ్లకు పార్టీ రంగులు

Samajwadi Party Color To Railway Toilets In UP - Sakshi

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా, ఉద్రిక్తంగా ఉన్న 2009– 2014 మధ్యకాలంలో కాలేజీలలో, ఆఫీస్‌లలో ఎవరైనా పింక్‌ డ్రెస్‌లో కనిపిస్తే చాలు.. ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించేది. సమైక్య ఉద్వేగ అసంకల్పిత శుభాభివందన అది. చనువున్నా లేకున్నా, మనిషికి మనిషి తెలియకున్నా గులాబీ రంగు ఒకే జాతి, ఒకే మతం, ఒకే వర్ణం అన్నంత స్ట్రాంగ్‌గా ప్రత్యేక భావనతో ప్రజల్ని ఏకం చేసింది. అది ఒక పార్టీ జెండా రంగు అయినప్పటికీ ఒక ప్రత్యేక రాష్ట్ర జాతీయ రంగు అన్నంతగా మనుషుల్లో, మనసుల్లో కలిసిపోయింది. రాజకీయ, ఉద్యమ పార్టీలకు జెండా రంగు, లేదా జెండాలోని రంగులు ఇంతటి ఘనమైన ఐడెంటిటీని కల్పిస్తాయి. పవిత్రతను కూడా. ఆ రంగు ఉన్న మెట్లను ఎక్కవలసి వచ్చినా సంకోచిస్తాం. మెట్లంటే సరే. పార్టీ అధినాయకుడిని దర్శించుకోడానికి అవి గుడి మెట్ల వంటివి అనుకోవచ్చు. కానీ, గోరఖ్‌పుర్‌లోని లలిత్‌ నారాయణ్‌ మిశ్రా రైల్వే హాస్పిటల్‌ మరుగు దొడ్లకు కూడా ఎవరో రంగులు వేయించారు. ఎరుపు, ఆకుపచ్చ!! అవి సమాజ్‌ వాది పార్టీ జెండాలోని రంగులు. మూడుసార్లు (ములాయం రెండుసార్లు, అఖిలేష్‌ ఒకసారి) ఉత్తర ప్రదేశ్‌ని ఏలిన రంగులు అవి. 

మరుగుదొడ్లకు వేసిన ఆ రంగుల్ని వెంటనే మార్చాలని సమాజ్‌ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్‌ నగీనా సాహిని రైల్వే వాళ్లకు లెటర్‌ పెట్టారు. మరుగుదొడ్లకు ఆ రంగుల్ని ఎంపిక చేసిన వారి పై చర్య తీసుకోవాలని కూడా కోరారు. ఎరుపు, ఆకుపచ్చల్ని వేయించిన వారు అంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. వేయించాకైనా అలోచించేందుకు అవకాశం ఉంది. రంగులే కనుక మార్చవచ్చు. రైల్వే వాళ్లు పొరపాటు చేసినా, ప్రమాద రహితమైన పొరపాటునే చేశారు. ఆకుపచ్చ, ఎరుపు కాకుండా.. ఆకుపచ్చ, ఆరెంజ్‌ వేయించి ఉంటే విషయం సీఎం యోగి ఆదిత్య నాథ్‌ వరకు వెళ్లేది. కొన్ని కార్మిక ఉద్యోగాలు ఊడేవి. చివరికి వాళ్లే కదా పై అధికారులకు దొరికేది! ఏమైనా రంగులు, మనోభావాలు తేలికగా మండే స్వభావం కలిగినవి. వాటితో జాగ్రత్తగా ఉండాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top