‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా?’ | Sakshi Special Yakub Pasha Humaramaraalu | Sakshi
Sakshi News home page

నరక ‘లోకల్‌’ కాల్‌

May 16 2026 2:39 PM | Updated on May 16 2026 2:48 PM

Sakshi Special Yakub Pasha Humaramaraalu

AI representation image

అది నరకలోకం. ఆరోజు ఇద్దరు వ్యక్తులు భూలోకం నుంచి కొత్తగా నరకానికి వచ్చారు. అందులో మన దేశానికి చెందిన చెంబయ్య కూడా ఉన్నాడు. ఆ ఇద్దరికి ఒక మూలన ఓ రెడ్‌ ఫోన్‌ కనిపించింది. ‘ఏమిటది?’ అని డ్యూటీలో ఉన్న యమభటుడిని అడిగారు.

‘ఈ ఫోన్‌ నుంచి మీ దేశానికి హాయిగా ఫోన్‌ చేసుకోవచ్చు. ఫ్రీగా కాదు. కక్షలు చెల్లించాల్సి ఉంటుంది’  అని చెప్పాడు యమభటుడు. ‘కక్షలు ఏమిటి?’ ఆశ్చర్యంగా అడిగాడు మన చెంబయ్య.

‘మీ లోకంలో లక్షలు అంటారు కదా... మా లోకంలో కక్షలు అంటారు’ అని వివరణ ఇచ్చాడు యమభటుడు. ‘మా దేశానికి ఫోన్‌ చేసుకోవడానికి ఎన్ని కక్షలు అవుతాయి?’ అడిగాడు  చెంబయ్య.
‘అరవై కక్షలు అవుతాయి’ అని చెప్పాడు యమభటుడు.

‘ఎన్ని గంటలు మాట్లాడవచ్చు?’ అడిగాడు చెంబయ్య.
‘గంటలు కాదు... అరగంట మీద ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడాలి’  అని రూల్ చెప్పాడు యమభటుడు. ‘సరేలే...ఆ రెడ్‌ ఫోన్‌ ఇలా ఇవ్వు’ అని అరవై కక్షలు చెల్లించాడు చెంబయ్య.

‘నా భార్య మంగతాయారుకు ఫోన్‌ చేస్తాను’ అనుకున్న చెంబయ్య అర క్షణంలోనే మనసు మార్చుకొని తన క్లోజ్‌ఫ్రెండ్‌ కోటేశ్వర్రావుకు ఫోన్‌ కలిపి... ‘హలో కోటిగా... ఎలా ఉన్నావురా?’ అని ఆప్యాయంగా అడిగాడు. ‘ఎవరు?’ అని గంభీరంగా అడిగాడు అటునుంచి కోటేశ్వర్రావు.

‘ ఒక్కరోజుకే నన్ను మరిచిపోయావా... తెలివి తక్కువ దద్దమ్మ... వెస్ట్‌ ఫెలో... ఈస్ట్‌ఫెలో, నార్త్‌ ఫెలో, ఇడియెట్‌... రాస్కెల్‌.... సచ్చినోడా...’ అనడం మొదలు పెట్టాడు చెంబయ్య. కోటేశ్వర్రావుని ప్రేమగా, ఆప్యాయంగా, అనుబంధంగా వేస్ట్‌ ఫెలో, ఇడియెట్, రాస్కెల్, సచ్చినోడా... అని పిలిచే ఏకైన వ్యక్తి శ్రీ చెంబయ్య. దీంతో ఆ తిట్లకు కోటేశ్వర్రావు వెంటనే కనెక్ట్‌ అయ్యాడు.

‘ఒరే చెంబిగా నువ్వట్రా ఫోన్‌ చేసింది! గుర్తు పట్టలేదు సుమీ...సారీ’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు కోటేస్వర్రావు. అంతలోనే అతడికి తెలుగు నవలలో లాగా భృకుటి ముడిపడింది. దవడ కండరం బిగుసుకుపోయిది. అతడి గుండెల్లో భయం అనే గుండె రాయి పడింది.

‘ఒరే చెంబిగా.... నువ్వు నిన్ననే కదరా  సచ్చింది..’ భయం భయంగా అడిగాడు కోటేశ్వర్రావు.
‘యూ ఆర్‌ ఆబ్‌సొల్యూట్లీ కరెక్ట్‌ మై డియర్‌ ఫ్రెండ్‌’ అని చెంబయ్య బదులు ఇచ్చాడో లేదో...
‘వామ్మో దెయ్యం’ అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నాడు కోటేశ్వర్రావు.
‘పిరికి వెధవ’ అని ఫ్రెండ్‌ను తిట్టుకున్న కోటేశ్వర్రావు తన భార్యకు ఫోన్‌ చేశాడు...
‘ఎలా ఉన్నావు నా బంగారం’ అని భార్య మంగతాయారును ప్రేమగా, గోముగా అడిగాడు.

‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు. ఎందుకో తెలుసా...’ అంటూ నాన్‌స్టాప్‌గా చెప్పడం మొదలుపెట్టింది మంగతాయారు. ‘మంగా, అసలు నేను ఎవరనుకుంటున్నావు?’ కోపంతో ఉరిమాడు చెంబయ్య. ‘మీరెవరో నాకెలా తెలుస్తుంది? చెప్పండి’ అని విసుగ్గా అడిగింది శ్రీమతి మంగతాయారు.

‘స్వయానా నీ భర్త చెంబయ్యను’ అని తనను తాను పునఃపరిచయం చేసుకున్నాడు చెంబయ్య.
అంతే...‘యావండీ.. నన్ను విడిచి వెళ్లిపోవడానికి మీకు కాలేయం ఎలా వచ్చింది’ అంటూ అర క్షణం గ్యాప్‌ ఇవ్వకుండా ఏడ్వడం మొదలుపెట్టింది మంగతాయారు. ఆమె ఏడుపు పుణ్యమా అని అరగంట మీద ఆరు నిమిషాల టైమ్‌ గ్యాస్‌ స్టవ్‌ మీది కొవ్వొత్తిలా స్పీడ్‌గా కరిగిపోయింది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఎలాస్కిన్‌ టేలర్‌ తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.

‘అదేమిటి? నా దగ్గర అరవై కక్షలు తీసుకున్నావు. ఈ అమెరికా వాడి దగ్గర ఆరు కక్షలే తీసుకున్నావు?!’ యమభటుడిని అడిగాడు చెంబయ్య. ‘లోకల్‌ కాల్‌కు అంతే అవుతుంది’ అన్నాడు యమభటుడు.
 
‘అమెరికా లోకల్‌ ఏమిటి... అక్కడెక్కడో ఉంటే’ కోపంగా అన్నాడు చెంబయ్య. 
‘ట్రంప్‌ వార్‌ మొదలు పెట్టినప్పటి నుంచి అమెరికన్‌ల జీవితం నరక‌ప్రాయం అయింది. సో... ఇప్పుడు అమెరికా లోకల్‌ కాల్‌ పరిధిలోకే వస్తుంది’ శాంతంగా బదులిచ్చాడు యమభటుడు!

– యాకుబ్ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement