మళ్ళీ మన ముందుకు... అలనాటి ఆ మహామహులు! | Sakshi Special Story About History of Telugu Drama and great dramatists | Sakshi
Sakshi News home page

మళ్ళీ మన ముందుకు... అలనాటి ఆ మహామహులు!

Mar 17 2026 10:44 PM | Updated on Mar 17 2026 10:44 PM

Sakshi Special Story About History of Telugu Drama and great dramatists

పది గంటల శ్రవ్య – దృశ్య రూపకంగా ‘అలనాటి నాటక ప్రస్థానం’

నాటి నాటక మహామహుల అభినయాన్ని నవతరం కళ్ళ ముందుంచే అపూర్వ ప్రయత్నం

నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు.

రంగస్థలం, ఆ వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన ‘అలనాటి నాటక ప్రస్థానం’పై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే ‘అలనాటి నాటక ప్రస్థానం’.

పరిశోధన, పరిశ్రమల మేళవింపు
గమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా ‘అజో... విభో... కందాళం ఫౌండేషన్’ ఈ అరుదైన కానుకను సమర్పించింది.

అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.

మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషి
కొద్దిగా వెనక్కి వెళితే... ‘అజో-విభొ- కందాళం ఫౌండేషన్’ వారే మూడేళ్ళ క్రితం ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.

ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ బృహత్ ప్రయత్నాన్ని అక్షర రూపంలో అందించిన ఆయన ఈసారి ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ అనే ఈ కొత్త ప్రయత్నానికి ఆడియో – విజువల్ పద్ధతిని ఎంచుకున్నారు. బుక్ కల్చర్ కన్నా లుక్ కల్చర్ లోకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న నవతరాన్ని ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. 

అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.

కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభ
బళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి ‘అజో- విభొ- కందాళం ఫౌండేషన్’ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.

యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.


తొలిసారిగా... జంట నగరాల్లో!
ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. ‘అజో-విభొ-కందాళం ఫౌండేషన్’, ప్రముఖ రంగస్థల వేదిక ‘రసరంజని’ సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. 

హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్‌లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం.  

“ఉజ్జ్వలమైన మన గత చరిత్ర, కళారంగంలో మనవాళ్ళు చేసిన ఘనమైన కృషి... నేటికీ సరైన రీతిలో రికార్డు కాలేదు. మన తెలుగు నాటక రంగ పరిణామ క్రమాన్ని వివరిస్తూ, మన సాంస్కృతిక ఘన వారసత్వాన్ని తరువాతి తరాలకు పదిలంగా అందించడం కోసం చేయాల్సింది చాలా ఉంది. ఆ భగీరథ ప్రయత్నంలో నా వంతుగా కళాసరస్వతికి సభక్తికంగా సమర్పించిన చంద్రునికో నూలుపోగు... ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకం” అని రంగస్థలంపై అనేక పరిశోధనాత్మక రచనలు చేసిన కందిమళ్ళ సాంబశివరావు వివరించారు.

ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, మన రంగస్థల కళా చరిత్రను దృశ్యరూపంలో ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement