బాల అవధాన సరస్వతి
పన్నెండేళ్లకే 1200 శ్లోకాల రచన
8వ తరగతిలోనే సంస్కృత అష్టావధానాలు
అవధాన బాల సరస్వతిగా బిరుదులు
ఇదంతా నరసింహ దేవర జయలక్ష్మి
సాధన చేస్తూ సాధిస్తున్న ప్రగతి.
హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ బాల అవధాని ‘మన మూలాలను తెలుసుకోవాలంటే సంస్కృతం వచ్చి ఉండాలి, సంస్కృత సేవ చేయాలన్నదే నా లక్ష్యం’ అంటూ వివరించింది..
‘‘సంస్కృతం పట్ల ఉన్న ఇష్టంతో సాధన చేస్తూనే, మిగతా అకడమిక్ విద్యనూ నేర్చుకుంటున్నాను. ఒకప్పుడు భారతదేశం సంస్కృతంలో విశ్వగురువుగా విరాజిల్లింది. మళ్లీ అలాంటి పూర్వ వైభవం రావాలి. ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో సంస్కృతం మార్మోగాలి. వృత్తి, ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయ్యాక సంస్కృతం నేర్చుకోవాలి అనుకోకూడదు. మా వయసు పిల్లలు సంస్కృతం నేర్చుకోవాలి. వారి పెద్దలూ ఆ దిశగా పిల్లలను గైడ్ చేయాలన్నది నా ఆకాంక్ష... ఇక నా విషయానికొస్తే... బెంగళూరులో ఆధునిక అకడమిక్ విద్యతోపాటు సంస్కృతం కూడా నేర్పే స్కూల్లో చదువుకుంటున్నాను.
శ్లోక రచన: మా నాన్న మైథిలీనాథ్‌కు సంస్కృతం అంటే చాలా ఇష్టం. ‘మన మూలాలు సంస్కృతంలో ఉన్నాయి. కానీ, అన్నీ అనువాదాలు చదువుకుంటున్నాం. నేరుగా సంస్కృతంలోనే చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి’ అంటారు. నాలుగున్నరేళ్ల వయసులో సంస్కృత శ్లోకం రాయడం చూసి అమ్మ కిరణ్మయి, తాతగారు ఉమామహేశ్వరరావు ప్రోత్సహించడంతో నా అడుగులు సంస్కృతం నేర్చుకునే దిశగా పడ్డాయి. ఆరేళ్లుగా శ్లోక రచనలో ఉన్నాను. గురువు ధూళిపాళ మహదేవమణిగారి ఆశీస్సులతో ‘పిబరే రామరసం’ శీర్షికతో వందశ్లోకాలు, వ్యాసావతరణం, గంగావతరణం, శమంతకోపాఖ్యానం.. ఇలా 1200 శ్లోకాలు రాశాను. శతావధానం, సహస్రావధానం దిశగా సాధన కొనసాగిస్తాను. ఆధునిక విద్యలో రాణిస్తూనే సంస్కృత సేవ చేయడమే నా లక్ష్యం’’ అని వివరించారు ఈ బాల అవధాని.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


