సదా మీ సేవలో... ఆతిథ్య రంగంలో రోబోలు | Sakshi Funday Special Story: Hotels use robots | Sakshi
Sakshi News home page

సదా మీ సేవలో... ఆతిథ్య రంగంలో రోబోలు

Mar 29 2026 12:26 AM | Updated on Mar 29 2026 12:26 AM

‘రండి రండి రండి... దయచేయండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’ అంటూ అతిథులకు స్వాగతం పలుకుతుంది ఒక రోబో ‘డిన్నర్‌కి ఏం కావాలో ఆర్డర్‌ చెప్పండి బాస్‌’... అంటూ వినయంగా అడుగుతుంది ఇంకో రోబో మరో రోబో ముందుకొచ్చి మీ లగేజీని అందుకుంటుంది మీకు కేటాయించిన గదిలో చక్కగా సర్దిపెట్టేస్తుంది... పర్యటనలో భాగంగా మీరు హోటల్‌లో అడుగుపెట్టినది మొదలుకొని, తిరుగు ప్రయాణానికి బయలుదేరే వరకు సదా మీ సేవల్లో రోబోలు అడుగడుగునా ముందుంటాయి. ఆతిథ్యరంగం ఏఐ సాంకేతికతతో నానాటికీ స్మార్ట్‌గా మారుతోంది. రోబోలను సేవల్లోకి దించి అతిథి సేవలకు హైటెక్‌ హంగులద్దుతోంది.

మన దేశంలో రోబోల వాడకం అంతగా పెరగలేదు గాని, అగ్రరాజ్యాల్లో రోబోలు ఆతిథ్యరంగ సేవలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హోటళ్లు, రెస్టరెంట్లు, బార్‌లలో రిసెప్షన్‌ నుంచి రూమ్‌ సర్వీస్‌ వరకు; కిచెన్‌ నుంచి ఫుడ్‌ డెలివరీ వరకు రోబోలు సేవలందిస్తున్నాయి. అమెరికా, జపాన్‌ వంటి దేశాలలో గత పదేళ్లుగా రోబోల సేవలు విస్తృతం కావడం మొదలైంది. ‘కోవిడ్‌–19’ తర్వాత ఆతిథ్య రంగంలో రోబోల సేవలు మరింతగా వేగం పుంజుకున్నాయి. తొలితరం రోబోలు వెయిటర్లుగా సేవలందించడం ప్రారంభిస్తే, ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న ఇప్పటి రోబోలు ఆతిథ్య రంగానికి చెందిన దాదాపు అన్నిరకాల సేవలనూ నిరంతరాయంగా అందించగలుగుతున్నాయి.

మనుషులు అందించే సేవల్లో తేడాలు ఉండవచ్చేమో గాని, రోబోలు అందించే సేవల్లో ఎలాంటి తేడాలూ ఉండవని వీటి సేవలు అందుకుంటున్న అతిథులు కితాబునిస్తున్నారు. మనుషులు చేసే పనులను రోబోలు సునాయాసంగా చేసేస్తుండటంతో హోటళ్ల యాజమాన్యాలకు కూడా లాభసాటిగా ఉంటోంది. రోబోలను రంగంలోకి దించిన హోటళ్లకు కాసులపంట పండుతోంది. ఇటీవలి కాలంలో రోబోలు హోటళ్లలో ఎలాంటి సేవలను అందిస్తున్నాయో తెలుసుకుందాం...

రోబో రిసెప్షనిస్ట్‌
పలు దేశాల్లోని స్టార్‌ హోటళ్లు ఇప్పుడు రిసెప్షనిస్టులుగా రోబోలను వినియోగించు కుంటున్నాయి. మొదటగా జపాన్‌లోని నాగసాకి నగరానికి చెందిన ‘హెన్‌ నా హోటల్‌’ దాదాపు పదేళ్ల కిందట రిసెప్షనిస్టు స్థానంలో హ్యూమనాయిడ్‌ రోబోను రంగంలోకి దించింది. తొలినాళ్లలో జనాలు దీనిని విచిత్రంగా చూసేవారు. క్రమంగా అలవాటైపోయారు. కాలం గడిచే కొద్ది సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి. అచ్చంగా మనుషులను పోలి ఉండే హ్యూమనాయిడ్‌ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఏఐ సాంకేతికత తోడైంది.

ఇటీవలి కాలంలోని హ్యూమనాయిడ్‌ రోబోలు మనుషుల కంటే మిన్నగా పనిచేస్తుండటంతో అగ్రదేశాల్లోని పలు హోటళ్లు అమ్మాయిల రూపంలో ఉండే హ్యూమనాయిడ్‌ రోబోలను రిసెప్షనిస్టులుగా ఉపయోగిస్తున్నాయి. ఇవి కస్టమర్లను సాదరంగా స్వాగతించి, పలకరించడం, వారి అవసరాలను కనుక్కుని, వారికి కావలసిన సమాచారాన్ని అందించడంలోను, ఎల్లవేళలా అతిథులకు అందుబాటులో ఉండటంలోను విజయవంతంగా పనిచేస్తున్నాయి.

రోబో రిసెప్షనిస్టులు ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో, వీటిని ఏర్పాటు చేసుకున్న హోటళ్లకు అతిథుల రాక కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటోంది. రోబో రిసెప్షనిస్టులు లాభసాటిగా ఉండటంతో పలు అంతర్జాతీయ హోటల్‌ బ్రాండ్లు వీటిని తమ ప్రధాన శాఖలన్నింటికీ విస్తరించుకుంటూ వస్తున్నాయి.

కేర్‌ టేకర్‌ రోబోలు
హోటల్‌లో అడుగుపెట్టే అతిథులకు అవసరమైన సమాచారం అందించడం మొదలుకొని అన్ని రకాలుగా సహాయపడే రోబోలు ఇవి. ఈ కేర్‌ టేకర్‌ రోబోలను ‘కోనీ’రోబోలు అని కూడా అంటున్నారు. ప్రముఖ టెక్‌ కంపెనీ ఐబీఎం పదేళ్ల కిందట తొలి కోనీ రోబోను రూపొందించింది. తర్వాత మరిన్ని టెక్‌ సంస్థలు వీటి రూపకల్పనకు రంగంలోకి దిగాయి. ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికతతో కోనీ రోబోలను మరింతగా అభివృద్ధి చేశాయి.

ఇవి హోటల్‌కు వచ్చే అతిథులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతాయి. స్థానిక సందర్శనీయ స్థలాలు, తదితర అంశాలపై సమాచారం అందిస్తాయి. లోకల్‌ టూర్‌ బుకింగ్స్‌కు, తిరుగు ప్రయాణాల టికెట్‌ బుకింగ్స్‌కు సులువైన మార్గాలు చెబుతాయి. ప్రస్తుతం హోటళ్లు వినియోగించే పలు కేర్‌ టేకర్‌ రోబోలు బహు భాషా సామర్థ్యాలతో పనిచేస్తున్నాయి.

రిలే డెలివరీ రోబోలు
అంతర్జాతీయ హోటళ్లు కొన్ని రోబోలను రిసెప్షన్‌ సేవలకు మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. పలు ఇతర సేవలకూ వినియోగించుకుంటున్నాయి. బహుళ అంతస్తుల స్టార్‌ హోటళ్లలో కొన్ని రిలే డెలివరీ రోబోలను ఉపయోగించుకుంటున్నాయి. ఇవి రూమ్‌ నుంచి ఆర్డర్‌ ఇచ్చే అతిథులకు కావలసిన ఆహార పానీయాలను అందించడం; రూమ్‌ సర్వీస్‌ వస్తువులను అవసరమైన గదుల వద్దకు మోసుకెళ్లడం; హోటల్‌కు వచ్చే అతిథులను వారి గది వరకు తోడ్కొని వెళ్లడం; వారి లగేజీని మోసుకెళ్లడం వంటి పనులు సమర్థంగా చేయగలుగుతున్నాయి. వీటిని ‘బట్లర్‌బో’ అని కూడా అంటున్నారు.

ఆతిథ్య రంగంలో రోబోల తొలి అడుగు
ఆతిథ్యరంగంలో రోబోల వాడకం ఇటీవలి కాలంలో పెరిగింది కాని, నిజానికి వీటి ప్రస్థానం 1983 నుంచే మొదలైంది. తొలిసారిగా అమెరికాలో ఒక రెస్టరెంట్‌ జపాన్‌లో తయారైన ‘టాన్‌బో ఆర్‌–1’, ‘టాన్‌బో ఆర్‌–2’ అనే రెండు రోబోలను అప్పట్లోనే 20 వేల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వీటిని బేరర్ల స్థానంలో అతిథులకు పదార్థాలతో నిండిన ప్లేట్లు, పానీయాలతో నిండిన గ్లాసులు వంటివి అందించడానికి ఉపయోగించింది. ఇటీవలి కాలంలో డైనర్‌ రోబోలుగా పిలిచే రోబో బేరర్లు చాలా దేశాలకు విస్తరించాయి. మన దేశంలో కూడా ‘ది యెల్లో హౌస్‌’ హోటల్‌ చెయిన్‌ ఉత్తరాదిలోని కొన్ని నగరాల్లో ఉన్న తన రెస్టరెంట్లలో రోబో బేరర్లను ఉపయోగించుకుంటోంది. అంతర్జాతీయ నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి ఆతిథ్యరంగంలో 25 శాతం ఉద్యోగుల స్థానాలను రోబోలే పూర్తిగా భర్తీ చేస్తాయి.

లగేజ్‌ హ్యాండ్లింగ్‌ రోబోలు
హోటల్‌లో దిగేటప్పుడు కొందరు అతిథులు భారీ లగేజీలతో వస్తుంటారు. వారు తీసుకొచ్చే భారీ లగేజీని వాహనం నుంచి దించి, హోటల్‌లో వారికి కేటాయించిన గది వరకు మోసుకొచ్చే పని ఇదివరకు రూమ్‌ సర్వీస్‌ సిబ్బంది చేసేవారు. లగేజీ మరీ ఎక్కువగా ఉంటే, ఒకరికిద్దరు మనుషులు అవసరమయ్యేది. అంత లగేజీని రూమ్‌ వరకు మోసుకొచ్చినందుకు వారికి టిప్పు ముట్టజెప్పాల్సి వచ్చేది. కొన్ని అంతర్జాతీయ హోటళ్లు ఇప్పుడు ఈ పనికోసం లగేజ్‌ హ్యాండ్లింగ్‌ రోబోలను ఉపయోగిస్తున్నాయి. ఎంత లగేజీనైనా ఇవి అవలీలగా మోసుకొచ్చి, జాగ్రత్తగా సర్దిపెట్టేస్తాయి. 

మనుషులు శక్తికి మించిన లగేజీ మోసేటప్పుడు ఏదో ఒకటి జారిపోవడం, లోపలి వస్తువులు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. లగేజ్‌ హ్యాండ్లింగ్‌ రోబోలతో అలాంటి సమస్యలేవీ ఉండవు. వాటికి టిప్పులివ్వాల్సిన అవసరం కూడా లేదు. తొలిసారిగా న్యూయార్క్‌లోని ఒక హోటల్‌ పదిహేనేళ్ల కిందటే ‘యోబో’ పేరుతో లగేజ్‌ హ్యాండ్లింగ్‌ రోబోను ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో లగేజ్‌ హ్యాండ్లింగ్‌ రోబోలు మరింతగా అభివృద్ధి చెందాయి. హోటళ్లతో పాటు పలుచోట్ల విమానాశ్రయాలు, కర్మాగారాలలో కూడా వీటి వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది.

రూమ్‌ సర్వీస్‌ రోబోలు
హోటళ్లలో గదులు, బాత్‌రూమ్‌లు శుభ్రం చేయడం వంటి రూమ్‌ సర్వీస్‌ పనులను సాధారణంగా హౌస్‌కీపింగ్‌ సిబ్బంది చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ స్టార్‌ హోటళ్లు ఈ పనుల కోసం రూమ్‌ సర్వీస్‌ రోబోలను ఉపయోగించుకుంటు న్నాయి. ఒక అమెరికన్‌ హోటల్‌ తన శాఖలు కొన్నింటిలో రూమ్‌ సర్వీస్‌ రోబోలను తొలిసారిగా పన్నెండేళ్ల కిందటే ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో మరిన్ని హోటళ్లు ఇదే దారిని అనుసరిస్తున్నాయి. వీటిలో అమర్చిన కెమెరాలు, సెన్సర్ల ఆధారంగా ఇవి గదుల మూలల్లో ఉన్న దుమ్ము ధూళిని కూడా చిటికెలో తొలగించేస్తాయి.

హోటళ్ల కారిడార్లు, లాబీలు వంటి ప్రదేశాలలోని చెత్తను, దుమ్ము ధూళిని వాక్యూమ్‌తో తొలగిస్తాయి. హోటళ్లతో పాటు వీటిని పలుచోట్ల కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు. రూమ్‌ సర్వీస్, క్లీనింగ్‌ రోబోలలో పలు రకాల వాటిని అంతర్జాతీయ హోటళ్లు ఉపయోగిస్తున్నాయి. వీటిలో కొన్ని వాక్యూమ్‌ క్లీనింగ్, ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ వంటి పనులు మాత్రమే చేస్తుంటే, మరింత అధునాతనమైనవి సర్ఫేస్‌ స్క్రబ్బింగ్, మాపింగ్, వాటర్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వంటి పనులు కూడా చేయగలుగుతున్నాయి. 

సెక్యూరిటీ రోబోలు
హోటళ్లు, రెస్టరెంట్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు– ఇలా ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. సెక్యూరిటీ గార్డులు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ హోటళ్లు, కార్యాలయాలు సెక్యూరిటీ గార్డులకు బదులుగా సెక్యూరిటీ రోబోలను ఉపయోగించు కుంటున్నాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తాయి. జపాన్‌లో సెక్యూరిటీ రోబోలను పదిహేనేళ్ల కిందట ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు.

తర్వాతి కాలంలో వీటిని మరింతగా అభివృద్ధి చేశారు. ‘కోవిడ్‌–19’కాలంలో పలు అభివృద్ధి చెందిన దేశాలలో సెక్యూరిటీ రోబోల వినియోగం పెరిగింది. వీటిలో అమర్చే థర్మల్‌ కెమెరాల సాయంతో ఇవి నిరంతరం పరిసరాలను గమనిస్తూ ఉంటాయి. హోటల్‌ పరిసరాల్లోను, పార్కింగ్‌ ప్రదేశాల్లోను, లాబీల్లోను కలియదిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులను గుర్తించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తాయి. 

ఫుడ్‌ డెలివరీ రోబోలు
‘కోవిడ్‌–19’ దరిమిలా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. చాలా చోట్ల ఇప్పటికీ మనుషులే ఫుడ్‌ డెలివరీ సేవలను అందిస్తున్నారు. హోటళ్లు, రెస్టరెంట్లకు అనుసంధానమై పనిచేసే యాప్స్‌ ద్వారా వినియోగదారులు తమకు కావలసిన ఆహార పదార్థాలను ఇళ్ల వద్దకు తెప్పించుకుంటున్నారు. యాప్స్‌కు చెందిన సంస్థల్లో పనిచేసే ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వీటిని ఇళ్లకు తెచ్చి అందిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్లు ఈ సేవల కోసం ఫుడ్‌ డెలివరీ రోబోలను ఉపయోగించుకుం టున్నాయి.

చిన్నసైజు వాహనాల్లా కనిపించే ఈ రోబోలు కోరుకున్న చోటుకు ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. మనుషులు నడిపే వాహనాల కంటే ఇవి చిన్నగా ఉండటంతో కిక్కిరిసిన ట్రాఫిక్‌లో కూడా ఇవి వేగంగా ముందుకు పోగలుగుతున్నాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చి తయారు చేసిన ఫుడ్‌ డెలివరీ రోబోలు డ్రైవర్‌తో పనిలేకుండానే ఎలాంటి దారుల్లోనైనా సులువుగా ప్రయాణించగలవు. అగ్రరాజ్యాల్లో ఫుడ్‌ డెలివరీ రోబోలకు ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరలోనే ఇవి భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా అందుబాటులోకి రాగలవని అంచనాలు ఉన్నాయి.

డైనర్‌ రోబోలు
టిఫిన్‌ చేయడానికో, భోజనం చేయడానికో హోటల్‌ లేదా రెస్టరెంట్‌లోకి అడుగుపెడితే, మనం కూర్చున్న టేబుల్‌ వద్దకు సర్వర్లు వచ్చి ఆర్డర్లు తీసుకుంటారు. కొద్దిసేపు నిరీక్షణ తర్వాత మనం ఆర్డర్‌ చేసిన పదార్థాలను తీసుకొచ్చి టేబుల్‌ మీద పెడతారు. మనం వెళ్లే చోట రద్దీ ఎక్కువగా ఉంటే, మనం ఆర్డర్‌ చేసిన పదార్థాల రాక కోసం ఎదురుచూడాల్సిన సమయం సహజంగానే పెరుగుతుంది. సర్వర్లు రెండు చేతులతోనూ వీలైనన్ని ప్లేట్లను బ్యాలెన్స్‌ చేస్తూ వచ్చినా, ఒక్కోసారి సర్వీస్‌లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి పరిష్కారంగానే డైనర్‌ రోబోలు అందుబాటులోకి వచ్చాయి.

దాదాపు నాలుగు అడుగుల ఎత్తుండే ఈ రోబోలు చక్రాల మీద వేగంగా తిరుగుతూ సేవలు అందించగలవు. అంతేకాదు, వీటికి రెండువైపులా అరడజను చొప్పున ట్రేలు అమర్చడం వల్ల ఏకకాలంలో దాదాపు నలభై కిలోల బరువు ఉండే ఆహార పదార్థాలను టేబుళ్ల వద్ద ఆగుతూ కస్టమర్లకు అందించగలవు. కీనన్‌ రోబోటిక్‌ సంస్థ పదేళ్ల కిందట తొలిసారిగా డైనర్‌ రోబోను రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటివి రూపొందిస్తున్నాయి. పలు దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్ల నుంచి వీటికి ఆదరణ కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. 

రోబో బార్‌టెండర్లు
పలు స్టార్‌ హోటళ్లలోను, బార్‌లలోను బార్‌టెండర్లు పనిచేస్తుంటారు. రకరకాల మద్యాలను అతిథుల అభిరుచులకు అనుగుణంగా అందించడం బార్‌టెండర్ల పని. రకరకాల ద్రవాల సమ్మేళనంతో, వాటికి తగిన అలంకరణతో అతిథులకు అందించే పనికి చాలా నైపుణ్యం కావాలి. బార్‌టెండర్లు ఒక పానీయాన్ని సిద్ధం చేయడానికి దాని సంక్లిష్టతను బట్టి కొద్ది నిమిషాల సమయం తీసుకుంటారు. ఇటీవలి కాలంలో వచ్చిన రోబో బార్‌టెండర్లు నిమిషంలోనే ఎలాంటి పానీయాన్నైనా ఇట్టే సిద్ధం చేయగలుగుతున్నాయి.

ఏఐ సాంకేతికతతో రూపొందించిన రోబో బార్‌టెండర్లు అతి సంక్లిష్ట పానీయ సమ్మేళనాలను సైతం ఏమాత్రం రుచి తగ్గకుండా శరవేగంగా చేయగలుగుతున్నాయి. తొలితరం రోబో బార్‌టెండర్లు రంగప్రవేశం చేసి, పుష్కరం పైనే గడిచింది. తొలినాళ్లలో వచ్చిన ‘టోనీ’ వంటి రోబో బార్‌టెండర్లు పానీయాలు తయారు చేసేటప్పుడు ఒక్కోసారి ఐస్‌ ముక్కలు, పానీయాలు కొంత నేల మీద చిందేవి. వీటిని మరింతగా అభివృద్ధి చేశాక ఇప్పుడు ఈ సమస్యలేవీ లేకుండా సమర్థంగా పనిచేయగలుగుతున్నాయి.

రోబో కిచెన్‌ అసిస్టెంట్లు
రోబోలు ఇటీవలి కాలంలో వంటింటి పనులనూ చక్కబెడుతున్నాయి. చేయితిరిగిన షెఫ్‌లలా వంటకాలు వండేస్తున్నాయి. అంతేకాకుండా, వంటింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఎక్కడి వస్తువులను అక్కడ క్రమపద్ధతిలో సర్దిపెట్టేస్తున్నాయి. కూరలు, సూప్‌లు కలపడం, కూరగాయలు తరగడం, వంటకానికి తగిన ఉష్ణోగ్రతను నియంత్రించడం, రొట్టెలు కాల్చడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. వీటిలో కొన్ని ‘రోబో ఆర్మ్స్‌’గా దొరుకుతున్నాయి. ఇవి మనిషి చేతి ఆకారంలో ఉండి, మనిషి చేతితో చేయగలిగే వంటింటి పనులన్నీ సునాయాసంగా చేయగలుగుతాయి.

ఇంకొన్ని పూర్తిస్థాయిలో మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్‌ రోబోలు. ఇవి షెఫ్‌లతోనే పోటీపడే స్థాయిలో వంటకాలను సిద్ధం చేయగలవు. వీటిలోని మరో సౌలభ్యం ఏమిటంటే, వీటిలో చాలా రోబోలు ‘సెల్ఫ్‌ క్లీనింగ్‌’. పని ముగిశాక ఇవి తమను తాము శుభ్రం చేసేసుకుంటాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లతో తయారైన ఈ రోబో కిచెన్‌ అసిస్టెంట్లు ఏఐ సాయంతో నలభీముల్లాంటి షెఫ్‌లకు దీటుగా హోటళ్లు, రెస్టరెంట్ల వంట పనిని సులభతరం చేస్తున్నాయి.

∙ పన్యాల జగన్నాథదాసు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement