Ruchi Varma Success Story: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..

Ruchi Varma: woman entrepreneur make 5 crore selling womens wear - Sakshi

సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది,

కాబోయే తల్లులకు డ్రెస్‌ డిజైన్స్‌ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్‌ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్‌ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది.

► అమ్మ కోరుకున్నదని..
ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్‌ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్‌ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను.

► ఫ్యాషన్‌ పరిశ్రమ వైపు మనసు
దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్‌ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్‌ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్‌ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను.

► ప్రతి నిర్ణయమూ కష్టమే
నిఫ్ట్‌ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్‌పోర్ట్‌ హౌజ్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్‌ డిజైన్‌ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్‌ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్‌ నేర్చుకున్నాను. ఆ వర్క్‌ నాకు చాలా ఉపయోగపడింది.

► ఎక్కడో ఏదో లోటు.
2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్‌ నుండి సీనియర్‌ డిజైనర్‌ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్‌ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్‌ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్‌ క్లాస్‌ వచ్చేనాటికి ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు.

► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు...
2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్‌ లైఫ్‌ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్‌ వర్క్‌ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్‌అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది.

► చులకనగా మాట్లాడేవారు..
ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్‌లో ఏ సెక్షన్‌ కు డిమాండ్‌ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్‌ మ్యాన్‌ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్‌ వర్క్‌ మాత్రమే చేశాను.

కానీ ఇప్పుడు ప్రొడక్షన్‌ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్‌లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్‌ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్‌ డిజైన్స్‌ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్‌ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు.

రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు
కోవిడ్‌ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్‌ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్‌ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్‌లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్‌ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్‌లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్‌ అన్ని ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ సేల్‌ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top