ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి

Retired Couple Gift Free Education to 1000 plus Underprivileged Kids - Sakshi

నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్‌ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్‌వర్క్‌ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్‌ హోంవర్క్‌ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు.

కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్‌ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్‌గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్‌గా పిల్లలకు ట్యూషన్‌ చెబుతున్నారు. అలా ఈ సెంటర్‌లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.

చదువుతోపాటు...
పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్‌ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్‌ క్యాంప్‌లు, టూర్‌లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్‌ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్‌ ట్రైనింగ్‌ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్‌ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్‌ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్‌ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా.

చదువునుంచి దృష్టి మరల్చకుండా...
నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్‌ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్‌ చెప్పడం ద్వారా వారి భవిష్యత్‌ మారుతుందని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’
–  శివస్వామి, మహాలక్ష్మి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top