స్క్వాడ్‌ దిగుతోంది..

Prepare For The Womens T Twenty Challenge Tournament - Sakshi

సూపర్‌ నోవాస్‌.. మిరుమిట్ల బ్యాట్‌ల మోత. ట్రయల్‌ బ్లేజర్స్‌.. వికెట్‌ల కుప్ప కూల్చివేత. వెలాసిటీ.. ఇన్నింగ్స్‌ వెన్ను విరిచివేత. విధ్వంసానికి మహిళల జట్లు సిద్ధం.  మీరు ఎవరి వైపు? మిథాలీ! మంధాన! హర్మన్‌! ముగ్గురు యోధుల మహా సంగ్రామం! మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీకి రంగం సిద్ధం.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న పురుషుల ఐపీఎల్‌ ముగియడానికి వారం ముందే అక్కడి క్రికెట్‌ మైదానాలలో మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ ప్రారంభం కాబోతోంది. పురుషుల ఐపీఎల్‌లో 8 జట్లు ఉంటే, మహిళల చాలెంజ్‌ టోర్నీలో 3 జట్లు ఉంటున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్తాన్‌ ∙రాయల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌. ఇవి పురుషుల జట్లు. ప్రాంతం పేరు లేకుండా పురుషుల జట్టు పేరే లేదు. మహిళల మూడు జట్ల పేర్లు ఇందుకు భిన్నమైనవి. సూపర్‌ నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ! సూపర్‌ నోవాస్‌ అంటే నవ్యోజ్వల తారలు. నక్షత్ర భారీ విస్ఫోటన కాంతులు. ట్రయల్‌ బ్లేజర్స్‌ అంటే నవపథ యోథులు. కొత్తపుంతలు తొక్కించేవారు. వెలాసిటీ అంటే గమన వేగం. 2008లో పురుషుల ఐపీఎల్‌ మొదలైన పదేళ్లకు 2018లో మహిళల కోసం టి20 చాలెంజ్‌ టోర్నీ ప్రారంభం అయినప్పటికీ సూపర్‌ నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ అనే ఈ మూడు శక్తిమంతమైన పేర్లతో మహిళా జట్లు క్రీజ్‌లోకి దిగాయి. సూపర్‌ నోవాస్‌కి హర్మన్‌ప్రీత్‌ కౌర్, ట్రయల్‌ బ్లేజర్స్‌కి స్మృతి మంధాన, వెలాసిటీకి మిథాలీ రాజ్‌ కెప్టెన్‌లు. తొలి ఏడాది సూపర్‌ నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్‌ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీ రాజ్‌ సూపర్‌ నోవాస్‌లో భాగంగా ఉన్నారు. రెండో ఏడాదికి మిథాలీ కెప్టెన్‌గా వెలాసిటీ టీమ్‌ వచ్చింది. ఇప్పుడు జరగబోతున్నది మూడో  టి20 చాలెంజ్‌ టోర్నీ. 

నవంబర్‌ 4న సూపర్‌ నోవాస్‌–వెలాసిటీ మధ్య... 5న వెలాసిటీ–ట్రయల్‌æబ్లేజర్స్‌ మధ్య... 7న ట్రయల్‌ బ్లేజర్స్‌–సూపర్‌ నోవాస్‌ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. టాప్‌–2లో నిలిచిన జట్ల మధ్య 9న ఫైనల్‌ ఉంటుంది. మొదటి రెండేళ్ల విజేత సూపర్‌ నోవాస్‌. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీ. ఈసారి కూడా హర్మన్‌ప్రీతేనా లేక మంధానా లేదా మిథాలీలలో ఒకరు కప్పును చేజిక్కించుకుంటారా అనే ఆసక్తి పెరుగుతూ వస్తోంది. మహిళా మినీ ఐపీఎల్‌గా పేరున్న ఈ టి20 చాలెంజ్‌ టోర్నీలో జట్ల పేర్ల కన్నా, టీమ్‌ల కెప్టెన్‌ల పేర్లపైనే క్రీడాభిమానుల ఫోకస్‌ ఎక్కువగా ఉండటానికి కారణం సూపర్‌ నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ అనే పవర్‌ నేమ్‌కి హర్మన్, స్మృతి, మిథాలీల ఆట తీరు స్పష్టమైన ప్రతీకగా కనిపించడమే. 

సూపర్‌ నోవాస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆల్‌ రౌండర్‌. రైట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌ఉమన్‌. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్‌. వంద అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఇండియన్‌ క్రికెటర్‌ కూడా హర్మనే. ఆమె ఆటతీరు కళ్లు మిరుమిట్లుగొల్పేలా ఉంటుంది. బహుశా అందుకే ఆమె ఉన్న జట్టుకు సూపర్‌ నోవాస్‌ అని బీసీసీఐ పేరు పెట్టినట్లుంది. 
మొదటి మ్యాచ్‌లో సూపర్‌ నోవాస్‌ తలపడబోతున్న వెలాసిటీ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌ఉమన్‌. మెరుపు వేగంతో వచ్చే బంతినైనా బెరుకు లేకుండా ఫేస్‌ చేసి రన్స్‌ని కుప్పలుపోసే ‘వెలాసిటీ’ ఆమె బ్యాట్‌కు ఉంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు తీసిన ప్లేయర్‌. ఏడు వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన రికార్డు ఉంది. క్రికెట్‌ మగవాళ్ల ఆట అనే అపోహను తన వేగవంతమైన రన్‌ రేట్‌తో పోగొట్టారు మిథాలీ. అందుకే ఆమె టీమ్‌కు ‘వెలాసిటీ’ అనే పేరు సరైనది అనిపిస్తుంది. 

ఇక ట్రైల్‌బ్లేజర్స్‌ జట్టు కెప్టెన్‌ స్మృతీ మంధాన ఎడంచేతి వాటం బ్యాట్స్‌ఉమన్‌. మీడియం పేస్‌ బౌలింగ్‌ కూడా చేయగలదు. స్మృతి ఇన్‌స్పిరేషన్‌ మిథాలీ రాజ్‌. ఈ చాలెంజ్‌ టోర్నీ రెండో రోజు తన ఇన్‌స్పిరేషన్‌ మీదనే పోటీపడబోతున్నారు స్మృతి. ఈ మూడు జట్ల నాలుగు మ్యాచ్‌ల టి20 చాలెంజ్‌ టోర్నీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ ప్లేయర్స్‌ కూడా తమ తమ టీమ్‌ల తడాఖాను చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. 

సూపర్‌ నోవాస్‌ జట్టు..
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (వైస్‌–కెప్టెన్‌), చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనూజా పాటిల్, రాధాయాదవ్, తాన్యా భాటియా (వికెట్‌ కీపర్‌), 
శశికళా సిరివర్థనే, పూనమ్‌ యాదవ్, షకేరా సేల్మన్, అరుంధతీ రెడ్డి, పూజా వస్త్రాకర్, అయుషీ సోని, ఆయాబోంగా ఖాక, ముస్కాన్‌ మాలిక్‌. 

ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టు
స్మతి మంధాన (కెప్టెన్‌), దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), పూనమ్‌ రౌత్, రిచా ఘోష్, డి.హేమలత, నుఝాత పర్వీన్‌ (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్‌ డియోల్, జులన్‌ గోస్వామి, సిమ్రాన్‌ దిల్‌ బహదూర్, సల్మా ఖాటున్, సోఫీ ఎకిల్‌స్టోన్, నథకన్‌ ఛంతమ్, డియాండ్రా డోటిన్, కష్వీ గౌతమ్‌. 

వెలాసిటీ జట్టు
మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), 
వేద కృష్ణమూర్తి (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, సుష్మా వర్మ (వికెట్‌ కీపర్‌), ఏక్తా బిస్త్, మాన్సి జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దివ్యదర్శిని, మనాలీ దక్షిణి, లే కాస్పెరెక్, డానియెలా వ్యాట్, సనీలెస్, జహనారా ఆలమ్, ఎం. అనఘ.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top