
నగరంలో పెరుగుతున్న ఇంపోర్టెడ్ శునకాలు
ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకత
స్టేటస్ సింబల్‌గా చూస్తున్న సెలబ్రిటీలు
రూ.లక్షలు లెక్కచేయడం లేదు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్‌స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్‌లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్‌లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్‌గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్‌లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట.
చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి.
లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు.
వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి.