మీసం మెలేసిన మహిళ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?

Pcos Victim Women Inspire To Others - Sakshi

మానవ రూపురేఖలను పోల్చేటప్పుడు ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, స్వరంలో, రూపంలో ఇరువురి మధ్య వ్యత్యాసం ఉండి తీరాలి.. అనే కొన్ని బలమైన ఆలోచనలు, తీర్మానాలు.. అందుకు భిన్నమైన జీవితాలను బలిపెట్టేలానే ఉంటాయి. అలాంటి భిన్నమైన వ్యక్తే ‘హర్మాన్‌ కౌర్‌’. ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి, గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమె!!

బ్రిటన్‌లో నివసించే హర్మాన్‌ కౌర్‌.. గడ్డం ఉన్న అమ్మాయి. ఆమెకు 11 ఏళ్ల వయసు వచ్చేసరికి.. పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు, మీసాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ చిన్న వయసులోనే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంది. చదువుకునే చోట, చుట్టుపక్కలా ఎన్నో అవమానాలు భరించింది. వ్యాక్సింగ్‌ చేయించుకున్నప్పుడల్లా నరకమే. ప్రతి ఐదురోజులకి బలంగా, దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది. ముట్టుకుంటే నొప్పిపుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధను తట్టుకోలేక   ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించింది. లోపాన్ని అవమానంగా భావించి జీవితాన్ని అంతం చేసుకునేకంటే దాన్నే గుర్తింపుగా మలచుకొని ధైర్యంగా బతకడం కరెక్ట్‌ కదా అని! 


అంతే..
వాక్సింగ్‌ చేయించడం ఆపేసి, గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేప్‌ చేసుకుని, తలకు స్టయిల్‌గా క్లాత్‌ చుట్టి ప్రత్యేకమైన రూపాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే గడ్డం ఉన్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది. తన రూపాన్ని తన ఎడమ కాలిపై టాటూగా వేయించుకుంది. 2014లో ఆమె లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసి, గడ్డంతో ఉన్న మహిళా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు, ఆమె అనేక బ్రాండ్లకు మోడల్‌గా మారింది. నేటికీ తన జీవితాన్ని పలు మాధ్యమాల సాయంతో ప్రపంచానికి తెలియజేస్తూ.. ఎన్నో మోటివేషన్‌ క్లాసులు ఇస్తూంటుంది. పరిష్కారం లేని సమస్యకు.. సమస్యనే పరిష్కారంగా మార్చుకోగల గుండె ధైర్యం ఎంతమందికి ఉంటుంది! అందుకే ఆమె అంటుంది.. ‘నా గడ్డానికి ఒక ప్రత్యేకతుంది. ఇదొక మహిళ గడ్డం’ అని.
చదవండి: చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!!
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top