ఖైదీల పిల్లల కోసం ఒక హోమ్

 Odisha Activist Runs a Hostel for the Children of Prisoners - Sakshi

యశోద ఉండటం వల్ల కృష్ణుడు చెరసాలలో కాకుండా ఆమె వొడిలో పెరిగాడు. మరి శిక్షలు పడ్డ ఖైదీలందరి పిల్లలకు ఈ యోగం ఉందా? ఎందుకు ఉండదు.. అమ్మను నేనున్నాను అంటుంది నిరోజ లక్ష్మి. 48 ఏళ్ల ఈ టీచరమ్మ ఒరిస్సాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్‌లో ఒక హోమ్‌ నడుపుతోంది. 2003లో మొదలైన ఈ హోమ్‌ ఇప్పటికి 200 మందిని సాకి సంతరించి ప్రయోజకుల్ని చేసింది. కన్న తల్లిదండ్రుల మీద ఏ పిల్లలకూ ప్రేమ పోదు. కాని ఈ పిల్లలకు మాత్రం నిరోజ మాత్రమే తల్లి తండ్రి దైవం.

ఆ అమ్మాయి వయసు 12 ఏళ్లు ఉంటాయి. త్వరలో పరీక్షలు ఉన్నాయట. స్కూలుకు వెళ్లను అని హోమ్‌లోనే చదువుకుంటోంది. లెక్కల బుక్కు తీసి కిందా మీదా అవుతోంది. ఆ అమ్మాయి శ్రద్ధ చూస్తే తప్పక ఏదో పెద్ద చదువు చదివేలా ఉంది. ఆ పెద్ద చదువు ఆ హోమ్‌లో కాకుండా మరెక్కడ ఉన్నా ఆ అమ్మాయి చదవలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి జీవితఖైదు పడి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆవేశంలో హత్య చేశాడతడు. తల్లికి మతి స్థిమితం సరిగా ఉండదు. ‘అందుకని మా హోమ్‌కు తెచ్చాను’ అంటుంది నిరోజ లక్ష్మి. పూర్తి పేరు నిరోజ లక్ష్మి మహాపాత్ర. భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ జైలుకు సమీపంలోనే గత 17 సంవత్సరాలుగా నడుపుతున్న హోమ్‌ ఉంది. దాని పేరు ‘మధుర్‌మయి ఆదర్శ శిక్షానికేతన్‌’. దేశంలోనే బహుశా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా నడిచే ఇలాంటి హోమ్‌ మరొకటి లేకపోవచ్చు.

పిల్లలకు యశోదై
పురుషులు జైలుకెళితే తల్లులు పిల్లలను చూసుకుంటారు. కాని కొన్ని కేసుల్లో స్త్రీలు జైలుకు వస్తారు. ఆ సమయంలో పురుషులు వారిని వారి ఖర్మానికి వొదిలి మరో పెళ్లి చేసుకుంటారు. అలాంటి తల్లుల పిల్లలను ఎవరు చూసుకుంటారు. జైలులో తల్లితో పాటు 8 ఏళ్ల వరకూ పిల్లలు ఉండే వీలు ఉన్నా ఐదేళ్ల వయసున్న పిల్లల దగ్గరి నుంచి తెచ్చి తన హోమ్‌లో సంరక్షిస్తుంది 48 ఏళ్ల నిరోజ. ‘ఒరిస్సాలో 18 జైళ్లు ఉన్నాయి. వీటిలో శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లల్లో ఎవరికైతే ఆలనా పాలనా ఉండదో వారిని మా హోమ్‌కు తెచ్చుకుంటాను.

జైలు అధికారుల అనుమతితో ఈ హోమ్‌ నడుస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. అందరు పిల్లలకు మల్లే వారికి కూడా సమగ్ర పోషణ అవసరమంటుంది’ నిరోజ. 2003లో మొదలైన ఈ హోమ్‌కు ఒరిస్సాలోని ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తోంది. ఇప్పటి వరకూ ఈ హోమ్‌ నుంచి 200 మంది బాల బాలికలు చదువుకున్నారు. కొందరు ఇంజనీర్లు అయ్యారు. ఎం.సి.ఏ చదివారు. కొందరు సాంకేతిక కోర్సుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ‘ఏ సందర్భంలో చూసినా మా హోమ్‌లో 50 మంది బాల బాలికలు ఉంటారు’ అంటుంది నిరోజ.

ఆమే అమ్మ ఆమే నాన్నా...
నిరోజది జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి టీచర్‌ గా కొన్ని స్కూళ్లలో పని చేసింది. ‘తల్లిదండ్రులు ఉన్న పిల్లల చదువుకు ఆటంకం లేదు. కాని జైళ్లల్లో ఉన్నవారి పిల్లల సంగతేమిటి అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభుత్వ ప్రతినిధులను, జైళ్ల శాఖను కలిసి హోమ్‌ ప్రతిపాదనను చేశాను. జైళ్లల్లో అకారణంగా పిల్లలు ఉండిపోవడం కన్నా ఇలా హోమ్‌లో ఉండి చదువుకోవడం మేలని వారు సహకరించారు. ఈ హోమ్‌ కోసం 3 ప్రభుత్వ స్కూళ్లను లింక్‌ చేశారు. ఇక్కడి పిల్లలు అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు. ప్రతి ఆదివారం లేదా వీలున్న సమయంలో ఆ పిల్లలను తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపించి వస్తాం. వారు నిజంగా చాలా సంతోషిస్తారు’ అంటుంది నిరోజ.

హోమ్‌లో పిల్లల బాగోగులు నిరోజే చూసుకుంటుంది. వారికి పాఠాలు చెబుతుంది. డాన్స్, ఆర్ట్‌ ఇవన్నీ ఉంటాయి. ‘పిల్లలు చాలా సంతోషం గా ఉండి తల్లిదండ్రుల బెంగను మర్చిపోతారు’ అంటుంది నిరోజ.
ఆమె ఇంతటితో ఆగలేదు. భువనేశ్వర్‌లో బధిర పిల్లల కోసమే జూనియర్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేసింది. ‘దీంట్లో ఎవరూ చేరరు’ అని ఆమె ఫ్రెండ్స్‌ ఆమెకు చెప్పారు. కాని ఇప్పుడా కాలేజీలో రాష్ట్ర వ్యాప్త బధిర విద్యార్థులు దఖలు అవుతున్నారు.

హోమ్‌లోని పిల్లలకు నిరోజ చాలా ఇష్టం. మాకు అమ్మైనా నాన్నైనా నిరోజే అంటారు. ఇలాంటి తల్లులే ఎందరో అభాగ్య బాలలకు చల్లని ఒడిలా నిలుస్తారు. నిరోజ లాంటి వాళ్లు ప్రతి రాష్ట్రంలో ఉంటే ఖైదీల పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది.

– సాక్షి ఫ్యామిలీ
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top