ఫస్ట్‌ టైమ్‌: ఇక పాలన పాఠాలు

Nilofer Khan: First woman Vice Chancellor of Kashmir University - Sakshi

ప్రొఫెసర్‌ నీలోఫర్‌ఖాన్‌ ‘యూనివర్శిటీ ఆఫ్‌ కశ్మీర్‌’కు వైస్‌–చాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఫలితంగా ఆ యూనివర్శిటీ తొలి మహిళ వైస్‌–చాన్స్‌లర్‌గా చారిత్రక గుర్తింపు పొందారు. పాఠాలు చెప్పడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఖాన్‌కు విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆమె పాఠాలు వినడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతారు.

‘ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా, సులభంగా అర్థమయ్యేలా చెబుతారు’ అంటారు విద్యార్థులు. పాఠాలలోనే కాదు పాలన సంబంధిత విషయాలలోనూ ఆమెకు అపారమైన అనుభవం ఉంది. యూనివర్శిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే యూనివర్శిటీ కౌన్సిల్, యూనివర్శిటీ సిండికేట్, అకాడమిక్‌ కౌన్సిల్‌... మొదలైన విభాగాలలో పనిచేశారు.

 ఆస్ట్రేలియా, మలేషియాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్శిటీల పనితీరును అధ్యయనం చేశారు. ఆమె రచనలు దేశ, విదేశ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 20 పీహెచ్‌డీ స్కాలర్స్‌కు పర్యవేక్షకురాలిగా వ్యవహరించారు.
‘ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఖాన్‌కు యూనివర్శిటీ సమస్యల గురించి లోతైన అవగాహన ఉంది.
విద్యార్థుల సంక్షేమం, యూనివర్శిటీని మరో స్థాయికి తీసుకువెళ్లడం తన ప్రాధాన్యత అంశాలుగా చెబుతున్నారు నీలోఫర్‌ఖాన్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top