మెంటల్‌ హెల్త్‌ యాక్టివిజం

Neerja Birla says mental health a subjective-driven science - Sakshi

మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్‌ హెల్త్‌’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్‌ హెల్త్‌ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు.

‘ఎంపవర్‌’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్‌లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్‌ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం.

‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని.

ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్‌ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా.

ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్‌’ (మైండ్‌ పవర్‌) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు

ఇద్దరు జర్నలిస్టులు
ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్‌’ ఆవిర్భావం గురించి ప్రెస్‌మీట్‌ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్‌గా ఉంది, డిప్రెషన్‌గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ.

పిల్లల స్థాయి నుంచి
‘ఎంపవర్‌’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్‌ సిలబస్‌ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్‌ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్‌ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్‌షాప్స్‌ నిర్వహించారు.

‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్‌ డిజార్డర్స్‌... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు.

ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్‌ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి.

నగరాల్లో క్లినిక్‌లు
‘ఎంపవర్‌’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్‌లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్‌కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్‌లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు.

యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ .

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top