నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’

Neena Gupta talks about her autobiography Sach Kahu To - Sakshi

తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్‌ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది.

పెంగ్విన్‌ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్‌ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు:

సతీష్‌ కౌశిక్‌తో పెళ్లి
‘నటుడు సతీష్‌ కౌశిక్‌ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్‌ రిచర్డ్స్‌తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్‌ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్‌ మదర్‌గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా.

బయటపడ్డ ప్రాణాలు
‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్‌ ఆఫ్‌ టిపూ సుల్తాన్‌ సీరియల్‌లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్‌ ఖాన్‌ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్‌ బయట మసాబా ఉందప్పుడు.  తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె.

సుభాష్‌ ఘాయ్‌ ‘చోలీ’
‘ఖల్‌ నాయక్‌ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్‌ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్‌ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్‌ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్‌ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్‌ ఘాయ్‌ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి.                      ∙

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top