బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్‌స్పైర్‌ చేసిన ఇంట్రస్టింగ్‌ కథనం | National Doctors day special chit chat with Dr C Mallikarjuna Chief Urologist | Sakshi
Sakshi News home page

బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్‌స్పైర్‌ చేసిన ఇంట్రస్టింగ్‌ కథనం

Jul 1 2025 1:22 PM | Updated on Jul 1 2025 4:11 PM

National Doctors day special chit chat  with Dr C Mallikarjuna Chief Urologist


అడ్మిరేషన్‌

కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే... ఇలా నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందా అన్నట్టుగా ఉంటాయి. అవి 1990 ల నాటి తొలి రోజులు. ఓ చిన్నారి బాబును వాళ్ల అమ్మగారు నా దగ్గరికి తీసుకొచ్చారు. మహా అయితే ఆ బాబుకు అప్పటికి ఓ ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో...  అంతే! 

ఆ బాబుకు వాళ్ల నాన్నకు ఉండే మూత్రపిండాల (కిడ్నీ) జబ్బే వచ్చింది. అదేమిటంటే... కిడ్నీలో చాలా గడ్డలు రావడం. మూత్రపిండాల్లో మల్టిపుల్‌ ట్యూమర్స్‌ వస్తూ జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అది. తండ్రికీ ఉండటంతో కొడుకుకూ వచ్చింది. ఆ బాబు తల్లిదండ్రులిద్దరూ చాలా సంస్కారవంతులూ, ఉన్నత విద్యావంతులూ, కాస్త ధనవంతులు కూడా. 

తండ్రికి ఆ జబ్బు ఉండటంతో అతడి తల్లి తన భర్తకు కిడ్నీ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాన్స్‌ప్లాంట్‌ శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు నేనూ అక్కడ ఉన్నా. ఆ తర్వాత ఐదేళ్లలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రెండుమూడేళ్లకు అనుకుంటా... అతడి అమ్మగారు హార్ట్‌ అటాక్‌తో లోకం విడిచి వెళ్లారు. ఈ ప్రపంచంలో ఇప్పుడా బాబు పూర్తిగా అనాథ. 

అయితే అతడు చాలా చిన్నవయసు నుంచే సమర్థంగా బిజినెస్‌ చేస్తుండేవాడు. బిజినెస్‌లో ఎక్స్‌పర్ట్‌ కావడంతో తానో పెద్ద కంపెనీ పెట్టి విజయాన్ని చవిచూసిన ఓ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌ అతడు. తన వ్యాపారంలో అతడెంత ఉన్నతిని సాధించాడంటే... తన కంపెనీ ద్వారా వందల సంఖ్యలో వ్యక్తులకు ఉపాధిని కల్పించాడు. కొన్నేళ్ల తర్వాత దాదాపు 2000 సంవత్సరం ప్రాంంతాల్లో అతడు మళ్లీ కిడ్నీ సమస్యతో మరోసారి నా దగ్గరికి వచ్చాడు. గుర్రపునాడా ఆకృతిలో (హార్స్‌ షూ షేప్‌లో) ఉన్న అతడి కిడ్నీలోంచి ఈసారి సగభాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సర్జరీ నేనే చేశా. 

కాలక్రమంలో ఈసారి పూర్తిస్థాయి కిడ్నీ ఫెయిల్యూర్‌తో అతడు మళ్లీ నా దగ్గరికి వచ్చాడు. ట్రాన్స్‌ప్లాంట్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కిడ్నీ ఇవ్వడానికి అతడికి ఈలోకంలో రక్తసంబంధీకులెవ్వరూ లేరు. 

వాస్తవానికి వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే ఓ చిన్నారి బాబును ఇంట్లో పెట్టుకున్నారు. ఒకరి ఆత్మబంధువుగా మరొకరు గత రెండు దశాబ్దాలుగా వాళ్లిద్దరూ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో అతడి వ్యక్తిగత సహాయకుడూ, సెక్రటరీ అన్నీ అతడే. అతడు కిడ్నీ ఇస్తానన్నాడుగానీ... నిబంధనల ప్రకారం రక్తసంబంధీకులో... లేదా రక్తసంబంధం లేనివాళ్లైతే భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇవ్వాలి. తనకు ఈ లోకంలో అతడు తప్ప మరెవ్వరూ లేరనే కారణంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. అతడి ఇంట్లో గత  20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి కిడ్నీ ఇవ్వవచ్చంటూ అతడి కేసులో మాత్రం కోర్టు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అతడి ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స కూడా నేనే చేశా.

ఇదీ  చదవండి: ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా! ఇకనైనా మారండి!

 ఈ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. అంటే... దాదాపు గత 30కి పైగా ఏళ్ల నుంచి అతడు నా పేషెంట్‌. వాళ్ల అమ్మగారు చనిపోయాక ప్రతి చికిత్సకూ అతడొక్కడే వచ్చేవాడు. ఇన్‌పేషెంట్‌గా చేరేప్పుడూ... డిశ్చార్జ్‌ అయి వెళ్లేటప్పడూ ఇలా ప్రతి ప్రతికూల పరిస్థితిలోనూ అతడొక్కడే. ఏ పరిస్థితుల్లోనూ అతడు తన చిరునవ్వును వీడలేదు. ఇక్కడ ఓ డాక్టర్‌గా నా గొప్పదనం ఏమీ లేదు. గొప్ప చికిత్స జరిగినప్పుడు పేషెంట్‌  అదృష్టాలూ, డాక్టర్‌ ప్రయత్నాలూ, పరిస్థితులు కలిసిరావడాలూ... ఇలా ఇవన్నీ అనుకూలించడంతో డాక్టర్‌ గొప్పగా, సమర్థంగా చికిత్స చేశాడనే పేరొస్తుంది. కానీ ఈ కేసులో పరిస్థితి వేరు. ఆ పేషెంట్‌ తాలూకు సంకల్పబలం, గొప్పదనంతో డాక్టర్‌కూ గొప్పదనాన్ని ఆపాదించినట్లయ్యింది. 

చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్‌ వీడియో

ఇప్పుడతడి వయసు దాదాపు 40 ఉండవచ్చు. ఈ వయసుకే అతడో సక్కెస్‌ఫుల్‌ వాణిజ్యవేత్త. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరక, బెదరక ఎంతోమందికి అన్నం పెడుతున్న బెస్ట్‌ బిజినెస్‌మేన్‌. సాధారణంగా డాక్టర్లంటే పేషెంట్లకు అడ్మిరేషన్‌ ఉండటం సహజం. కానీ... చిన్నప్పట్నుంచీ... ఓ చిన్నారిగా ఉన్నప్పట్నుంచీ అతడిని చూస్తూ ఉన్నప్పటికీ, గత 30 ఏళ్ల నుంచి అతడికి చికిత్స అందిస్తున్నప్పటికీ... అతడంటే నాకెంతో అడ్మిరేషన్‌.  
 

డాక్టర్‌ సి. మల్లికార్జున,చీఫ్‌ యూరాలజిస్ట్, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ – యూరాలజీ 
(AINU), హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement