Monkeypox Virus: కలవరపెడుతున్న మంకీ పాక్స్‌.. కోవిడ్‌లా మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా..? 

Monkeypox Outbreak Turning Into Another Pandemic - Sakshi

కరోనా తర్వాత కాస్తంత అదే స్థాయిలో హల్‌చల్‌ చేస్తున్న వైరస్‌ ‘మంకీపాక్స్‌’. ఇది అప్పుడెప్పుడో మూడు నాలుగు తరాల ముందు జనాన్ని భయభ్రాంతుల్ని చేసిన మశూచీ (స్మాల్‌పాక్స్‌) కుటుంబానికి చెందింది. కోవిడ్‌ తర్వాత ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని అదే స్థాయిలో గడగడలాడిస్తుందన్న వార్తల నేపథ్యంలో దీని గురించి అవగాహన కోసం ఈ కథనం. 

దీన్ని మొట్టమొదటిసారి 1958లో కనుగొన్నారు. కోతులు ఎక్కువగా ఉండే కాలనీల్లో బయటపడటం వల్ల దీనికి ‘మంకీ పాక్స్‌’ అని పేరొచ్చింది. అయితే మానవుల్లో మొదటి కేసును 1970వ పడిలో కనుగొన్నారు. అప్పట్లో మశూచీ నిర్మూలన కోసం పెద్దఎత్తున క్యాంపెయిన్‌ జరుగుతుండే కాలంలో దీన్ని ఆఫ్రికా ఖండంలోని ‘కాంగో’ (డెమక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో)లో కనుగొన్నారు.

అప్పట్లో ఆఫ్రికా ఖండంలోనే లైబీరియా, నైజీరియా, సియారాలియోనీ లాంటి ప్రాంతాల్లోనూ కొన్ని కేసులు చూసినా అత్యధికంగా కనబడ్డది కాంగోలోనే. కానీ ఇప్పుడు తాజాగా ఒకేసారి 226కు పైగా కేసులిప్పుడు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలోని అనేక దేశాల్లో కనబడుతుండటంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. ఇది వైరస్‌తో వచ్చే జబ్బు కావడం... అందునా ఒకసారి యూఎస్, యూరప్‌లలో కనిపించిందంటే ఇక మిగతా దేశాలకు చేరడానికి పెద్ద సమయం పట్టకపోవడం లాంటి అంశాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే దీని విషయంలో అప్రమత్తత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటోంది.  

లక్షణాలు: జ్వరం , ఒళ్లునొప్పులు, వీపునొప్పి, తీవ్రమైన అలసట, రాత్రిళ్లు చలిజ్వరంతో వణుకు,  లింఫ్‌ గ్లాండ్స్‌లో వాపు, ఒళ్లంతా దద్దుర్లు

మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వ్యక్తికి తొలుత తీవ్రమైన జ్వరం వస్తుంది. కొందరిలో దగ్గు, తీవ్రమైన నిస్సత్తువ, జబ్బుగా ఉన్నప్పుడు అనిపించేలా ఏదో ఇబ్బందికరమైన భావన (మలేసీ) వంటి లక్షణాలూ ఉంటాయి. దాంతోపాటు ఒళ్లునొప్పులు, వీపునొప్పి, తీవ్రమైన అలసట, రాత్రిళ్లు చలిజ్వరంతో వణుకు, లింఫ్‌గ్లాండ్స్‌లో వాపు వంటి లక్షణాలూ ఉండవచ్చు. మనలోకి వైరస్‌ ప్రవేశించాక దాన్ని ఎదుర్కొనడానికి మన దేహం సమాయత్తమవుతుంది.

ఇందుకు నిదర్శనమే ఇలా లింఫ్‌గ్లాండ్స్‌లో వాపు రావడం. జ్వరం వచ్చి తగ్గాక 2 – 4 రోజుల్లో ఒళ్లంతా దద్దుర్లలాంటి ర్యాష్‌ వస్తుంది. ఆ దద్దుర్లు పెరిగి పుండ్లలాగా మారవచ్చు. అవి ముఖం మీద, వీపు మీద... ఇలా శరీరంలోని ఏ భాగం మీదైనా... అంటే కొన్ని సందర్భాల్లో నోరు, ముక్కులోని మ్యూకస్‌ పొరల్లోనూ రావచ్చు. అలా అవి 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పచ్చిగా ఉండి, క్రమంగా ఎండిపోతాయి. దాదాపు నాలుగు వారాల తర్వాత వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.  కానీ చర్మంపై మచ్చలు మాత్రం చాలా రోజుల పాటు అలాగే ఉండిపోతాయి. మొదట్లో బాగా డార్క్‌గా కనిపించే ఈ మచ్చలు కాలం గడిచే కొద్దీ చర్మం రంగులోకి కలిసిపోతున్నట్లుగా క్రమంగా పలచబడతాయి. 

వ్యాప్తి: ఇది కోతుల నుంచి కొన్ని పెంపుడు జంతువుల్లోకి... అక్కణ్ణుంచి తన జన్యుపటలాన్ని మనుషులకు వ్యాప్తించెందేలా మార్చుకుని మనుషులకు వ్యాపించినట్లుగా భావిస్తున్నారు. ఒకసారి మనుషుల్లోకి వచ్చాక... మాట్లాడుతున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు వెలువడే డ్రాప్‌లెట్స్‌తో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే బాధితులు వాడిన పడక లేదా ఇతర దుస్తులను తాకినప్పుడు... అంటే డ్రాప్‌లెట్స్‌ కారణంగా వ్యాపించవచ్చు. 

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు
∙ప్రధానంగా ఈ వైరస్‌ కోతుల నుంచి వచ్చిందని భావించినా... పెంచుకోడానికి అనువుగా ఉండే కొన్ని ఎలుకల (రొడెంట్స్‌) జాతుల నుంచి కూడా వ్యాపించవచ్చన్నది నిపుణుల భావన. అందుకే ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల నుంచి కొంతకాలం పాటు దూరంగా ఉండటం మంచిది. 
∙వైరస్‌ సోకి బాధపడుతున్న రోగిని ఐసోలేట్‌ చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు బాధితుల నుంచి కొద్దిరోజుల పాటు దూరంగా మెలగాలి. 
∙పెంపుడుజంతువును గానీ లేదా బాధితుడిని గాని తాకినట్లు అనుమానం వస్తే సబ్బుతోగానీ లేదా ఆల్కహాల్‌ బేస్‌డ్‌ శానిటైజర్‌తోగానీ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
∙బాధితులకు దగ్గరగా వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు పీపీఈ కిట్లు ధరించాలి. అంటే మంకీపాక్స్‌ విషయంలోనూ ఇంచుమించు కరోనా వైరస్‌కు సంబంధించిన జాగ్రత్తలే తీసుకోవాలి. ఇక్కడ కూడా అవే బాగా పనికి వస్తాయి. 

చికిత్స: ఇది వైరస్‌ కారణంగా వచ్చే జబ్బు కావడంతో దీనికి నిర్దిష్టంగా మందులు ఉండవు. లక్షణాలను బట్టి మందులు (సింప్టమేటిక్‌ ట్రీట్‌మెంట్‌) వాడాల్సి ఉంటుంది. అయితే కొన్ని యాంటీవైరల్‌ మందులను ఇందుకోసం వాడవచ్చనీ, మశూచీ (స్మాల్‌పాక్స్‌) కోసం వాడిన వ్యాక్సిన్‌ కూడా కొంతవరకు దీని తీవ్రతను తగ్గిస్తుందని ఇప్పటికి నిపుణులు భావిస్తున్నారు. 

కోవిడ్‌ లాగే మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా? 
ఇప్పటికిప్పుడైతే అలా మారే అవకాశం లేదు. వ్యాధి సోకిన తర్వాత ఒంటిపై మచ్చలు చాలాకాలం ఉండిపోయినప్పటికీ చాలావరకు ఇది తనంతట తానే తగ్గిపోయే వ్యాధి (సెల్ఫ్‌ లిమిటింగ్‌ డిసీజ్‌) కావడంతో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల భావన. అందుకే దీని కారణంగా పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌లూ, ఇతరత్రా ఆంక్షలు అవసరం లేనప్పటికీ... ఇది వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తూ... అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైరాలజీ నిపుణులతో పాటు సంబంధిత ఇతర రంగాలకు చెందిన నిపుణులంతా దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
-డాక్టర్‌ కిరణ్మయి పగడాల, కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజిషియన్‌ – డయాబెటాలజిస్ట్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top